Crow Story: కాకి చెప్పిన సంతోషం కథ...మన జీవితానికి ఉపయోగపడుతుంది

సంతోషం కోసం పరిగెత్తే ప్రతి మనిషి ఈ కథను తప్పని సరిగా చదవాలి. నిజమైన సంతోషం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి.

Balachander
Published on: 30 April 2026 8:45 AM IST
Crow Story: కాకి చెప్పిన సంతోషం కథ...మన జీవితానికి ఉపయోగపడుతుంది
X

Crow Story on Happiness: మనం అలుపెరుగకుండా పరుగులు తీస్తూనే ఉంటాం. అసలు మనిషి దేనికోసం పరిగెడుతున్నాడు అంతే వచ్చే సమాధానం సంతోషం కోసమే. కానీ, కానీ, దురదృష్టవశాత్తూ మన దగ్గర ఉన్న దానితో తృప్తి చెందకుండా, పక్కవాడి జీవితాన్ని చూసి ఈర్ష్య పడటమే నేటి మానవ విచారానికి అసలు కారణం. ఈ మానసిక సంఘర్షణను తొలగించి, ఆనందానికి కొత్త అర్థాన్ని ఇచ్చే అద్భుతమైన కథ ఇది. మనిషి ఆనందంగా ఎలా ఉండాలో కాకి రూపంలో చెప్పిన కథ ఇది. సమస్త మానవాళికి కనువిప్పు కలిగించే గొప్ప అంశాలు ఇందులో ఉన్నాయి.

ఒక కాకి.. ముగ్గురు మిత్రులు.. ఒకే ఒక సత్యం!

పూర్వకాలంలో బామ్మలు, తాతమ్మలు మనకు కథలు చెప్పేవారు. అవి వినడానికి చాలా బాగుంటాయి. అందులోని నీతిని ఆరోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు పాటించేవారు. అందుకే అప్పట్లో అందరూ సంతోషంగా ఉండేవారు. కాలం మారుతున్నకొద్ది అవకాశాలు మారుతున్నాయి. ఒకచోట స్థిరంగా ఉండటం ఆగిపోయింది. తెలియనిదాని కోసం పరుగుతు తీస్తున్నాం. ఇలాంటివారికి ఈ కథ ఓ కనువిప్పు. ఒకానొక అడవిలో ఒక కాకి తన రంగును చూసి నిరాశతో కుమిలిపోతుండేది. "నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను? నన్ను చూస్తే అందరూ అసహ్యించుకుంటారు" అని బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తుండగా, ఒక మహానుభావుడైన స్వామీజీ దానిని పలకరించారు. సంతోషంగా ఎవరున్నారని నీ భావన అని ఆయన అడగ్గా.. కాకి తన అన్వేషణ మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా కాకి మొదట హంస వద్దకు వెళ్తుంది. "నీవు ఎంత తెల్లగా, ప్రశాంతంగా ఉన్నావో.. నువ్వే లోకంలో అత్యంత సంతోషజీవివి" అంది. కానీ హంస నవ్వి.. "నేను తెల్లగా ఉన్నాను కానీ నాకంటూ ప్రత్యేక రంగులు లేవు. కానీ అటు చూడు...రంగురంగుల రామచిలుక.. అన్ని రంగులతో ఆహ్లాదకరంగా ఉంది. అదే అసలైన అందం" అని నిట్టూర్చింది.

వెంటనే కాకి పరుగు పరుగున రామచిలుక వద్దకు వెళ్లి... హంసను అడిగిన విధంగానే అడుగుతుంది. ఆ మాటలు విన్న రామచిలుక భయపడుతూ... "నా అందమే నాకు శాపం. ఎప్పుడు ఎవరు పట్టుకెళ్లి పంజరంలో బంధిస్తారో అని ప్రాణభయంతో బతకాలి. నాదీ ఒక బ్రతుకేనా... చీ... నాకంటే ఆ నెమలి ఎంతో అదృష్టవంతురాలు" అని బదులిచ్చింది.

రామచిలుక చెప్పిన మాట విన్నాక కాకి నెమలి వద్దకు వెళ్తుంది. నెమలిని కూడా అదే ప్రశ్న అడుగుతుంది. అంతేకాకుండా నీ అందం చూసి వేలమంది మురిసిపోతారు. నీ జీవితం ధన్యం అని అంటుంది కాకి. కాకి చెప్పిన మాట విని నెమలి భారంగా నిట్టూరుస్తూ... "మిత్రమా! నా అందం చూసి జనం వస్తారు కానీ, నా పింఛాల కోసం నన్ను వేటాడుతారు. నన్ను జంతువుల మధ్యలో బంధించి ప్రదర్శన వస్తువును చేశారు. కానీ నిన్ను ఎవరూ బంధించరు, ఎవరూ వేటాడరు. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే నీ జీవితమే నాకు కావాలి" అని అసలు రహస్యాన్ని చెబుతుంది.

మన జీవితానికి పనికొచ్చే 3 ముఖ్య సూత్రాలు

స్వేచ్చ గురించి మనం పెద్దగా గుర్తించడం లేదు. పంజరంలో ఉన్నా అది బంగారమనే బ్రమలో ఉన్నాం. బానిసత్వం గురించి పట్టించుకోవడం లేదు. మన దగ్గర ఉన్న స్వేచ్చే మహాభాగ్యం అని గుర్తించాలి. ఇక రెండోది బాహ్య సౌందర్యం శాశ్వతం కాదని గుర్తెరగాలి. రంగులు, రూపాలు కేవలం పైపైన కనిపించేవే. అంతరంగంలో ఉన్న ప్రశాంతతే అసలైన సంపద. ముఖ్యమైనది మూడోది పోలికలు. ఎదుటివారితో ఎప్పటికీ పోలిక పెట్టుకోకూడదు. పక్కవాడు బాగున్నాడని బాధపడకూడదు. ప్రతి ఒక్కరికి వారిదైన కష్టాలు, భయాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ సూత్రాలు గుర్తుపెట్టుకొని జీవితానికి అన్వయించుకుంటే ప్రతి మనిషి జీవితం ఆనందంగా, కష్టాలకు భయపడకుండా సంతోషంగా ఉండొచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story