Bhavanarayana Swamy: బాపట్ల భావనారాయణ స్వామి ఆలయం రహస్యం...ఒకవైపు ఉగ్రరూపం..మరోవైపు శాంతివదనం
బాపట్ల భావనారాయణ స్వామి ఆలయంలో ఉగ్రనరసింహుడు, శాంతి కేశవస్వామి మహిమలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఎండలో చల్లదనం, చలిలో వెచ్చదనం ఈ ఆలయ ప్రత్యేకత.
Bhavanarayana Swamy: ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లని ప్రదేశాలు ఎక్కడున్నాయా అని చూసుకోని లక్షలకు లక్షలు ఖర్చుపెట్టుకొని వెళ్తుంటారు. ఎత్తైన కొండ ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ, మైదాన ప్రాంతంలో ఉంటూనే ప్రకృతి నియమాలకు విరుద్దంగా ఎండాకాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండే ఓ అద్భుతమైన దేవాలయం గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో ఉంది. అదే ప్రసిద్ధ శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం. సుమారు 1500 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఈ పురాతన ఆయలంలో ఒకేచోట స్వామివారు ఉగ్రరూపం, మరోవైపు శాంతి వదనం కొలువై ఉండటం విశేషం.
పునాదుల్లో కదిలిన ఉగ్రరూపం.. కారంచేడు మంటల కథ!
శతాబ్దాల క్రితం ఈ భావనారాయణ స్వామి ఆలయ నిర్మాణ సమయాన పునాదులు తవ్వుతుండగా, భూగర్భం నుండి ఒక అద్భుతమైన ఉగ్ర నరసింహస్వామి విగ్రహం బయటపడింది. శాస్త్రోక్తంగా ఆ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అయితే, స్వామివారి ఉగ్రనేత్రాల తీవ్రత ఏ స్థాయిలో ఉండేదంటే... ఆ విగ్రహం చూపు పడే దిశలో... పక్కనే గల కారంచేడు గ్రామంలో తరచూ మంటలు వ్యాపించేవట. ఈ ఉపద్రవానికి విరుగుడుగా, స్వామివారి ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి పండితులు ఒక అద్భుత ఉపాయాన్ని ఆలోచించారు. ఉగ్రనరసింహ స్వామికి సరిగ్గా ఎదురుగా శాంతి కేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ క్షణం నుండి నరసింహుని క్రోధం చల్లారి, ఆ ప్రాంతమంతా ప్రశాంతత చేకూరింది.
కాలాలకు ఎదురుతిరిగే గర్భగుడి వాతావరణం!
ఈ రెండు విగ్రహాల ప్రతిష్ట తర్వాత ఆలయంలో ఒక ప్రకృతి వింత చోటుచేసుకుంది, అది నేటికీ భక్తులను అబ్బురపరుస్తూనే ఉంది. బయట ఎండలు 40 డిగ్రీలు దాటినా, ఆలయం లోపల మాత్రం ఏసీ వేసినట్లు చల్లగా ఉంటుంది. శాంతి కేశవస్వామి విగ్రహం నుండి వచ్చే చల్లని గాలులే దీనికి కారణం. ఇక శీతాకాలంలో బయట చలి వణికిస్తున్నా, గర్భగుడిలోకి వెళ్తే వెచ్చగా అనిపిస్తుంది. ఇది ఉగ్రనరసింహుని నుండి వెలువడే ఉష్ణ తరంగాల మహిమ అని భక్తులు నమ్ముతారు. ఇదే ఇక్కడి విశేషం.
ఒకే ఆలయ ప్రాంగణంలో, ఒకే సమయంలో రెండు విరుద్ధ శక్తులు సమతుల్యంగా ఉంటూ భక్తులకు రక్షణ కల్పించడం కేవలం బాపట్ల క్షేత్రంలోనే సాధ్యమైంది. ఈ అద్భుతాన్ని కనులారా వీక్షించడానికి, స్వామివారి దైవిక శక్తిని అనుభూతి చెందడానికి ఏటా వేలాది మంది భక్తులు బాపట్లకు తరలివస్తుంటారు. మీ జీవితంలో కూడా కష్టాలనే ఎండలు ఎక్కువగా ఉంటే, ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి... ఆ భావనారాయణ స్వామి కరుణతో మీ మనసు చల్లబడుతుంది. పేరుకు తగ్గట్టుగానే భావనారాయణుడు మన మనసులోని బాధల్ని తొలగించి మనసుకు శాంతిని కలిగిస్తాడు.




