Married Women : పెళ్లి ఫ్యాషన్ కాదు...గాజులు మోటు కాదు... సనాతన ధర్మం చెప్పింది వింటే ఆశ్చర్యపోతారు
పెళ్లైన మహిళలు చేతికి ఎన్ని గాజులు ధరించాలి...ఎన్ని రోజులు ధరించాలి...ఎందుకు ధరించాలి అనే అంశాలు జ్యోతిష్య, శాస్త్ర నియమాల ప్రకారం తెలుసుకుందాం.
Married Women : సనాతన ధర్మంలో వివాహం అనేది కేవలం ఒక ఫ్యాషన్ లేదా ఆచారం మాత్రమే కాదు, అది ఒక దివ్యమైన పవిత్ర బంధం. పెళ్లయిన స్త్రీలు ధరించే ఆభరణాల వెనుక విశేషమైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య, శాస్త్రీయ రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ముత్తైదువులు చేతులకు నిండుగా గాజులు ధరించడం అనేది కేవలం సౌందర్యానికే కాక, ఆ ఇంటి సౌభాగ్యానికి, సకల ఐశ్వర్యాలకు, మానసిక ప్రశాంతతకు మూలస్తంభంగా నిలుస్తుందని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. స్త్రీలు ధరించే గాజుల ప్రాశస్త్యం, నియమాలు, జ్యోతిష్య విశ్లేషణను పరిశీలిద్దాం.
గ్రహ దోష నివారణ ... ధనం, మానసిక ప్రశాంతత
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గాజులు బుధ, చంద్ర గ్రహాలకు చిహ్నాలు. బుధగ్రహం సంపద, ఐశ్వర్యం, వృద్ధికి సూచిక. ఇక చంద్రగ్రహం మనస్సు, ప్రశాంతత, సానుకూల ఆలోచనలకు ప్రతీక. చేతులకు నిండుగా గాజులు వేసుకోవడం వలన ఈ రెండు గ్రహాల అనుగ్రహం లభిస్తుంది. తద్వారా కుటుంబంలో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.
గాజుల సంఖ్య ... సాంప్రదాయ నియమాలు
జ్యోతిష్య నియమాల ప్రకారం వివాహిత అయిన స్త్రీ ప్రతీ చేతికి కనీసం 21 గాజులు ధరించాలి. రెండు చేతులలోనూ గాజుల సంఖ్య సమానంగా ఉండటం అత్యంత శుభప్రదం. అయితే, కొత్తగా పెళ్లయిన వధువులు కనీసం సంవత్సరం పాటు లేదా అత్యంత నిష్ఠతో కనీసం 40 రోజుల పాటు గాజులను తప్పనిసరిగా వేసుకోవాలి. కానీ, నేటికాలంలో ఫ్యాషన్ పేరుతో ఒకటి రెండు గాజులు మాత్రమే వేసుకోవడం శాస్త్ర విరుద్ధమని, నిండుగా వేసుకోవడమే ముత్తైదువుకు శ్రేయస్కరమని వేద పండితులు చెబుతున్నారు. అంతేకాదు, పాత గాజులను తొలగించి కొత్త గాజులు వేసుకోవాలనుకునే స్త్రీలు సమయాన్ని పాటించడం చాలా ముఖ్యం. కొత్త గాజులను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే ధరించాలి. మధ్యాహ్నం వేళ పాత గాజులను తీసివేసి కొత్తవి వేసుకోకూడదు.
రంగుల ఎంపిక ... శుభ వర్ణాలు
వివాహితలు ఎల్లప్పుడూ ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగు గాజులనే ధరించాలి. ఈ మూడు వర్ణాలు సౌభాగ్యానికి, మంగళకరమైన శక్తికి ప్రతీకలు. పొరపాటున కూడా నలుపు లేదా ముదురు రంగు గాజులను ధరించకూడదని శాస్త్రం హెచ్చరిస్తోంది. నుదిటిన బొట్టు, మెడలో మంగళసూత్రం, కాళ్లకు మెట్టెలు ఎంత పవిత్రమైనవో... చేతులకు నిండుగా ధరించే గాజులు కూడా అంతే దివ్యమైన శక్తిని ఇస్తాయి. సనాతన సంప్రదాయాలను గౌరవిస్తూ గాజులను నిండుగా ధరించడం ద్వారా ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది.




