Bade Hanuman Temple: ఉత్తరప్రదేశ్‌లో అద్భుతం.... శివుడి ఆజ్ఞతో హనుమంతుడికి గంగమ్మ అభిషేకం
ఉత్తర ప్రదేశ్‌లో అద్భుతమైన ఆలయాల్లో ఒకటి బడే హనుమాన్ ఆలయం. సుమారు 20 అడుగుల పొడవైన పవళించిన విధంగా ఉండే హనుమంతుడి విగ్రహం వెనుక అద్భుతమైన కథ ప్రచారంలో ఉంది.
Bade Hanuman Temple: భారతదేశంలో హనుమంతుని గుడులు వేలాదిగా ఉన్నాయి. ప్రతిచోటా స్వామివారు నిలబడి గదాధరుడిగానో, లేదా చేతులు జోడించి రామభక్తుడిగానో దర్శనమిస్తారు. కానీ, సాక్షాత్తూ గంగా, యమునా, గుప్త సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రంలో మాత్రం ఆంజనేయస్వామి విభిన్నంగా పవళించిన భంగిమలో కనిపిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొలువై ఉన్న దాదాపు 600 సంవత్సరాల నాటి ప్రాచీన 'బడే హనుమాన్' ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. దీనినే స్థానికులు 'లేటే హనుమాన్ జీ' అని పిలుస్తారు. వర్షాకాలంలో గంగానది ఉప్పొంగినప్పుడు, నదీ జలాలు స్వయంగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి చరణాలను తాకుతూ అభిషేకం చేయడం ఇక్కడి పరమ అద్భుతం. ఒక సంపన్న వ్యాపారి కన్నౌజ్ నుండి తెచ్చిన ఈ భారీ విగ్రహం, వింధ్యాచల్ కొండలకు వెళ్లకుండా ఇక్కడే ఇసుకలో ఎందుకు స్థిరపడిందో తెలుసుకుందాం.
వ్యాపారి కల ... సంగమ ఇసుక తిన్నెల్లో స్థిరపడ్డ హనుమయ్య
ఈ ఆలయ ఆవిర్భావం వెనుక 600 ఏళ్ల నాటి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ప్రాచీన కాలంలో కన్నౌజ్ నగరానికి చెందిన ఒక గొప్ప ధనవంతుడైన వ్యాపారి, తన సంతాన కాంక్ష నెరవేరినందుకు కృతజ్ఞతగా వింధ్యాచల్ కొండలపై ఒక హనుమాన్ ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అందుకోసం ఒక భారీ రాతి విగ్రహాన్ని తయారు చేయించి, దానికి త్రివేణీ సంగమ పవిత్ర జలాల్లో పుణ్యస్నానం చేయించాడు. ఆ తర్వాత విగ్రహాన్ని కొండలపైకి తరలించే క్రమంలో స్వామివారు ఆ వ్యాపారి కలలో దర్శనమిచ్చారు. తనను వింధ్యాచల్ కొండలకు తీసుకెళ్లవద్దని, ఈ పవిత్ర సంగమ క్షేత్ర జాలాల్లోనే తనను వదిలిపెట్టాలని, కోరికలు నెరవేరుతాయని చెబుతాడు. స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఆ వ్యాపారి విగ్రహాన్ని అక్కడే వదిలి వెళతాడు.
బాబా బాలగిరి మహరాజ్ అన్వేషణ ... గంగమ్మ పాదపూజ
కాలక్రమేణా ఆ భారీ విగ్రహం సంగమం వద్ద ఇసుక తిన్నెల్లో పూర్తిగా కూరుకుపోయింది. శతాబ్దాల తర్వాత ఆ ప్రాంతానికి వచ్చిన సిద్ధపురుషుడు బాబా బాలగిరి జీ మహరాజ్ తన తపోశక్తితో ఇసుకలో నిద్రావస్థలో ఉన్న ఆంజనేయస్వామి రూపాన్ని గుర్తించారు. ఆ విగ్రహాన్ని పడుకున్న భంగిమలోనే ఉంచి అక్కడ ఒక సుందరమైన ఆలయాన్ని నిర్మించారు. ఈ క్షేత్రంలో స్వామివారి విగ్రహం దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుంది. ప్రతి ఏటా వర్షాకాలంలో గంగానది ఉధృతి పెరిగినప్పుడు, నదీ మాత ఆలయ గర్భగుడిలోకి వచ్చి స్వామివారికి జలాభిషేకం చేస్తుంది. గంగమ్మ వచ్చి పాదాలు తాకిన తర్వాతే ప్రయాగ్‌రాజ్‌లో వరదలు తగ్గుముఖం పడతాయని స్థానికుల అచంచల విశ్వాసం. కాశీ, ప్రయాగ యాత్రకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఈ బడే హనుమంతుడిని దర్శించుకుంటేనే వారి యాత్రా ఫలం సంపూర్ణమవుతుందని పురాణాలు చెబుతున్నాయి.




