అల్లూరి సీతారామరాజుకు అత్యంత ఇష్టమైన శివాలయం.. సాహసం చేస్తేనే చేరుకోగలం

Alluri Sitarama Raju Shiva Temple: భారత స్వతంత్య్ర సంగ్రామంలో తెల్లదొరలపై అలుపెరుగని పోరాటం చేసిన మన్యం వీరు అల్లూరి సీతారామరాజు.

Balachander
Published on: 25 April 2026 8:47 AM IST
Alluri Sitarama Raju Shiva Temple
X

అల్లూరి సీతారామరాజుకు అత్యంత ఇష్టమైన శివాలయం.. సాహసం చేస్తేనే చేరుకోగలం

Alluri Sitarama Raju Shiva Temple: భారత స్వతంత్య్ర సంగ్రామంలో తెల్లదొరలపై అలుపెరుగని పోరాటం చేసిన మన్యం వీరు అల్లూరి సీతారామరాజు. అల్లూరి ఎంత వీరుడో అంతకంటే భక్తిపరుడు. ప్రతిరోజు నిత్యం ఓ నిర్ణీత సమయానికి ఆయన ఓ శివాలయంలో స్వామివారికి స్వయంగా అభిషేకం చేసేవారట. అల్లూరి సీతారామరాజు నిత్యాభిషేకం చేసిన ఆ శివాలయాన్ని చేరుకోవాలంటే సాహసయాత్ర చేయాల్సిందే. అదే రంపచోడవరం శివాలయం. అల్లూరి అడుగుజాడలు పడిన ఈ నేల కేవలం ఒక చారిత్రక ప్రాంతమే కాదు, అంతుచిక్కని అద్భుతాలకు నెలవు కూడా.

12వ శతాబ్దపు శిలల విన్యాసం

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, రంప గ్రామంలో దట్టమైన అడవుల మధ్య కొలువైన ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందినది. చోళుల కాలంలో నాగవంశీయులు నిర్మించిన ఈ అద్భుత కట్టడం చూస్తే అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి మనం ముచ్చటపడక తప్పదు. ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి సిమెంటు, ఇటుకలు, ఇనుమును వాడలేదు. భారీగా ఉండే బండరాళ్లను ఒకదానిపై ఒకటి క్రమపద్దతిలో అమర్చి ఆలయాన్ని నిర్మించారు. ఇలా బండరాళ్లను అమర్చి ఆలయం నిర్మించడం చాలా కష్టమైన పని. అద్భుతంగా ఉండే ఈ ఆలయం వందల ఏళ్లు గడిచినా, ప్రకృతి వైపరిత్యాలు ఎదురైనా చెక్కుచెదరకుండా ఉన్నది.

అల్లూరి ఆరాధించిన స్వయంభూ లింగం

అల్లూరి సీతారామరాజు విప్లవ పోరాటం సమయంలో ఈ ప్రాంతంలో తలదాచుకోవడమే కాకుండా, ప్రతిరోజూ ఈ శివాలయంలో స్వయంభూ నాగశిలకు అభిషేకం చేసేవారట. భక్తితో శక్తిమేరకు మహాశివుడిని ఆరాధించేవారట. ఇక్కడి స్వయంభూ నాగశిలకు అభిషేకం చేయడం వలన మొండి సమస్యలు తొలగిపోయి, కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

ప్రకృతి ఒడిలో సాహస యాత్ర

ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి సాహసయాత్ర చేయాలి. ఒక్కసారి ఈ యాత్రను చేస్తే ఆధ్యాత్మికంగా జీవితంలో మార్పులు వస్తాయని భక్తులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు చేరుకోవాలి. అక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర దట్టమైన అడవిలో, రాళ్లు రప్పల మధ్య ప్రయాణించాలి. చుట్టూ జలపాతాల హోరు, అడవి జంతువుల అరుపుల మధ్య ఈ ప్రయాణం సాగుతుంది. ప్రకృతి ఒడిలో సాగే ఈ ప్రయాణం మనసుకు ఆనందాన్ని ఇస్తుంది.

అయితే, రంపచోడవరం శివాలయం చేరుకునే ప్రదేశం జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి శివాలయాన్ని చేరుకోవాలని అనుకునేవారు తమ వెంట ఆహారం, తాగునీరు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. స్వచ్చమైన ప్రకృతి ఒడిలో ఉన్న ఈ మన్యం మహాశివుడిని దర్శించుకోవడం ప్రతి భక్తుడికి ఒక మధురానుభూతి. చరిత్రను, ప్రకృతిని, దైవత్వాన్ని ఒకేచోట చూడాలనుకునేవారు తప్పక దర్శించాల్సిన క్షేత్రం ఇది. ఇక్కడికి చేరుకొని భక్తితో అభిషేకం చేసి, స్వామిని ఆరాధిస్తే తప్పకుండా జీవితంలో మార్పులు చోటుచేసుకుంటాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story