Adhika Masam 2026: శుభకార్యాలకు విశ్రాంతినిచ్చినా... అధికమాసంలో వీటిని తప్పనిసరిగా చేయాలి
2026వ సంవత్సరంలో మే 17వ తేదీ నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కానుంది. ఈ అధిక జ్యేష్ఠమాసంలో ఏం చేయవచ్చు...ఏం చేయకూడదో తెలుసుకుందాం.
Adhika Masam 2026: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కాలగణనలో అధిక మాసం అత్యంత విశిష్టమైనది. సాధారణంగా శుభకార్యాలకు ఈ మాసం నిషిద్ధమని మనందరికీ తెలుసు. అయితే, లౌకిక సుఖాల కంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి, దైవచింతనకు ఈ మాసం ఒక వరం వంటిది. "అధికస్య అధికం ఫలం" అన్న నానుడి ప్రకారం.. ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైనా వేయి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. 2026వ సంవత్సరంలో మే 17వ తేదీ నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కానుంది. ఈ అధిక జ్యేష్ఠమాసంలో ఏం చేయవచ్చు...ఏం చేయకూడదో తెలుసుకుందాం.
అసలు అధిక మాసం అంటే ఏమిటి?
సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని 'సంక్రాంతి' అంటారు. ఏ మాసంలో అయితే సూర్య సంక్రమణం జరగదో, ఆ మాసాన్ని అధిక మాసం అంటారు. శాస్త్రీయంగా చూస్తే, సౌరమానానికి (365 రోజులు), చాంద్రమానానికి (354 రోజులు) మధ్య ఉండే 11 రోజుల తేడాను సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి ఒక నెలను అదనంగా చేరుస్తారు. ఇదే అధిక మాసం.
పురుషోత్తమ మాసం వెనుక ఉన్న పరమార్థం
పురాణాల ప్రకారం, ఈ మాసానికి అధిపతి లేకపోవడంతో దీనిని అందరూ నిరసించేవారట. అప్పుడు శ్రీమహావిష్ణువు కరుణించి, ఈ మాసానికి తన పేరైన 'పురుషోత్తమ' నామాన్ని ఇచ్చి, దీనికి అధిపతిగా మారారు. అందుకే ఈ నెలలో విష్ణుమూర్తి ఆరాధన అనంతమైన ఫలితాలనిస్తుంది. ఈ అధికమాసంలో పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువును విరాజమానంగా ఆరాధిస్తారు. సత్యనారాయణ వ్రతాలు విరివిగా చేస్తారు.
ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?
అధిక మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి లౌకిక శుభకార్యాలు చేయకూడదు. కానీ, అంతకంటే గొప్పవైన పనులు తప్పనిసరిగా చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ మాసంలో ఇష్టదైవం నామస్మరణ, గాయత్రీమంత్రం జపం, నరసింహ కవచం వంటివి పఠించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు, ఈ మాసంలో పండ్లను, పిండి వంటలను, స్వయంపాకాన్ని దానం చేయడం వలన సుఖశాంతులు లభిస్తాయి. ముఖ్యంగా ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో ఈ దానాలు చేయాలి. పితృదేవతల సద్గతి కోసం ఈ మాసమంతా సంధ్యాసమయంలో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన పితృదేవతలు సంతోషించి కుటుంబానికి, వంశాభివృద్ధికి సహకరిస్తారు. ఇక ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు, నవగ్రహ హోమాలు, శాంతిపూజలు నిర్వహిస్తారు.
ఒక్కమాటలో చెప్పాలంటే అధిక మాసం అంట విరామం అని అర్థం కాదు. భక్తికి ఇచ్చే అదనపు సమయం. బాహ్యమైన వేడుకలకు దూరంగా ఉంటూ...అంతరంగంలో దైవాన్ని నింపుకోవడానికి ఇది ఓ మంచి అవకాశం. 2026 మే 17 నుంచి ప్రారంభమయ్యే ఈ పురుషోత్తమ మాసంలో పుణ్యకార్యాలను చేద్దాం. ఆ స్వామివారి ఆనుగ్రహాన్ని పొందుదాం.




