Krishna Temple: 1800 ఏళ్లనాటి శ్రీకృష్ణ మందిరం...ఇక్కడి దండం మహిమతో సంతానయోగం
సుమారు 1800 సంవత్సరాల నాటి సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఎన్నో మహిమలకు తార్కాణంగా నిలిచింది. ఇక్కడ ముఖ్యంగా పిల్లలు లేని దంపతలకు ఈ ఆలయం వరప్రదాయనిగా మారింది.
Krishna Temple: సంతాన భాగ్యం కోసం ఏళ్ల తరబడి నోములు, వ్రతాలు చేస్తూ అల్లాడిపోయే దంపతులకు ఆశల దీపంగా నిలుస్తోంది కర్ణాటకలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం. సుమారు 1800 సంవత్సరాల సుదీర్ఘమైన ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రంలో అడుగుపెడితే చాలు, ఎలాంటి మాతృత్వ వేదనైనా తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఆలయ స్థల పురాణం – దైవిక సాక్షాత్కారం
పూర్వం గంగరస మహారాజు యుద్ధం ముగించుకుని తిరిగి వస్తుండగా, ఆయన రథం చక్రం ఒక నిర్దిష్ట ప్రదేశంలో మట్టిలో కూరుకుపోయింది. అంతకుముందే ఆయనకు కలలో శ్రీకృష్ణ పరమాత్మ కనిపించి తన విగ్రహం ఉన్న ప్రదేశాన్ని సూచించాడు. తవ్వకాలు జరపగా స్వయంభూగా వేణుగోపాల స్వామి విగ్రహం లభ్యమైంది. ఆ విగ్రహాన్ని కౌండిన్య మహర్షి తన ఆశ్రమంలో ప్రతిష్ఠించడంతో ఈ క్షేత్రానికి 'కౌండిన్య మహర్షి క్షేత్రం' అని పేరు వచ్చింది. మూలవిరాట్టు త్రిభంగి ముద్రలో మురళి ఊదుతూ కంటికి ఇంపైన రూపంలో దర్శనమిస్తారు.
హుచ్చప్ప గోపాల్ అని ఎందుకు పిలుస్తారు?
ఈ స్వామిని స్థానికులు 'హుచ్చప్ప గోపాల్' అని పిలవడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక చోళ రాజు సంతానం కోసం ఇక్కడ ప్రార్థించగా, రాణికి ఆడపిల్ల జన్మించింది. తీవ్ర నిరాశతో రాజు ఆత్మహత్యకు సిద్ధపడగా, ఆ పసిపాప అద్భుత రీతిలో మగపిల్లాడిగా మారిపోయింది. స్వామివారి ఈ విచిత్ర లీల వల్ల ఆయనను 'హుచ్చు గోపాల్' అని పిలవడం మొదలుపెట్టారు. మైసూర్ రాజు కాంతీరవ నరసింహ రాజ వడియార్‌కూడా ఇక్కడ పూజలు చేసి సంతాన ప్రాప్తి పొందినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి.
ముఖ్యమైన ఆకర్షణ ...దండ స్పర్శ
ఈ ఆలయంలో అత్యంత విశేషమైనది కౌండిన్య మహర్షి ఉపయోగించిన పవిత్రమైన 'దండం'. ఈ దండంలో మహర్షి తపోశక్తి నిక్షిప్తమై ఉందని నమ్ముతారు. ప్రతీ శనివారం, ఆదివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులకు ఈ దండ స్పర్శ భాగ్యం కల్పిస్తారు. ఈ దండాన్ని తాకడం వల్ల సంతాన లేమి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ధన నష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇక సెప్టెంబరు నుండి మే నెల మధ్యకాలం ఈ క్షేత్ర దర్శనానికి అనుకూలమైన సమయం. రథసప్తమి వేడుకల సమయంలో వేలాదిగా తరలివచ్చే భక్తులతో ఈ చిన్న గ్రామం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతుంది. సంతానం లేని దంపతలు ఎందరో ఈ ఆలయాన్ని సందర్శించి సంతానాన్ని పొందినట్టుగా భక్తులు చెబుతున్నారు.




