Nandu's World: నందూస్ వరల్డ్ గుట్టు రట్టు ..అడ్డంగా పట్టించిన బిగ్‌బాస్

Nandu's World: బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం లండన్ నుండి ఇండియా వచ్చి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చిక్కిన యూట్యూబర్ రమానందన.

Gagan kumar
Updated on: 9 Sept 2026 10:16 AM IST
Nandus World
X

Nandu's World: నందూస్ వరల్డ్ గుట్టు రట్టు ..అడ్డంగా పట్టించిన బిగ్‌బాస్

Nandu's World: యూట్యూబ్‌లో లండన్ లైఫ్‌స్టైల్ వీడియోలు, చిరునవ్వులతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫేమస్ యూట్యూబర్ నందన అలియాస్ రమానందన కథ అడ్డం తిరిగింది. విదేశాల్లో ఉద్యోగాలు, వీసాల పేరుతో కోట్ల రూపాయల మోసానికి పాల్పడి విదేశాల్లో తలదాచుకున్న ఆమె, భారత్‌లో అడుగుపెట్టడమే ఆలస్యం పోలీసులకు చిక్కిపోయారు.

యుకే నుంచి హైదరాబాద్ వచ్చిన రమానందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే నందన దంపతులపై జారీ చేసిన లుక్‌ఔట్ సర్క్యులర్ ఆధారంగా ఎయిర్‌పోర్ట్ అలర్ట్ సిస్టమ్ ఆమెను గుర్తించింది. వెంటనే పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇక కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అసలు ఆమె లండన్ నుంచి సడన్‌గా ఇండియాకు ఎందుకు వచ్చింది తెలుసా..? ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. రమానందనకు బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ అవకాశం దక్కిందట. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి మరింత ఫేమస్ అయిపోదాం అని స్కెచ్ వేసుకుని వస్తే.. ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మొత్తానికి బిగ్‌బాస్ ఆఫర్ నందు కొంపముంచినట్టు అయింది.

‘నందూస్ వరల్డ్’ పేరిట సుమారు 28 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న తన ఛానెల్‌ వేదికగా ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ అనే సంస్థను ప్రచారం చేశారు. లండన్‌లో ఉద్యోగాలు, వీసా ఎక్స్‌టెన్షన్‌, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామంటూ బాధితుల నుంచి లక్షలాది రూపాయలు దండుకున్నారు. ఉద్యోగాలు రాకపోగా, చేతిలో నకిలీ పత్రాలు పెట్టి కాంటాక్ట్‌లోకి రాకుండా డ్రామాలు ఆడటంతో బాధితులు ఏపీలోని ఇబ్రహీంపట్నం, అద్దంకి పోలీస్ స్టేషన్‌లలో కేసులు పెట్టారు.

పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న బాధితులు తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. పొలాలు అమ్మేసి మరీ లక్షల్లో చెల్లించామని, మోసపోయామని తెలిసి గుండెపోటుతో ఆస్పత్రుల పాలయ్యామని కొందరు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, విచారణలో రమానందన మాత్రం నాకేమీ తెలియదు, అంతా నా భర్త మధుకరే చేశాడు అంటూ స్టేట్‌మెంట్ ఇవ్వడం గమనార్హం.

ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని పోలీసులు నందనకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె భర్త మధుకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. యూట్యూబ్‌లో కనిపించే రంగుల ప్రపంచం వెనుక ఇన్ని కోరల మోసాలు దాగున్నాయని తెలిసి నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story