World Idli Day: ఈరోజు ఇడ్లీ దినోత్సవం.. ప్రపంచంలో ఇడ్డెనలకు ఉన్న క్రేజే వేరు!
World Idli Day: ఉదయాన్నే నాలుగిడ్లీ టిఫిన్ గా తింటే ఆ కిక్కే వేరు కదా. ఇడ్లీ దినోత్సవం సందర్భంగా ఇడ్లీకి ఉండే క్రేజ్ గురించి చెప్పేసుకుందాం.
World Idli Day
World Idly Day: ఉదయాన్నే.. వేడి వేడిగా తెల్లని నాలుగిడ్లీ ప్లేటులో పెట్టుకుని.. కాస్త నెయ్యి పోసి.. దానిమీద కారంపొడి చల్లుకుని.. కమ్మని పల్లి చెట్నీతో తింటే ఆ మజానే వేరు కదా. ఏమిటి ఇడ్లీ మీద పడ్డారు అనుకుంటున్నారా? విషయం ఉందండీ. ఈరోజు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం. అవును అన్నిటికీ ఉన్నట్టే ఇడ్లీకి కూడా ఓ రోజుందన్న మాట. సరే.. మరి ఇడ్లి దినోత్సవం సందర్భంగా దాని గురించి నాలుగు మాటలు చెప్పేసుకుందాం.
ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని మార్చి 30న జరుపుకుంటారు. 2015 నుండి ఇలా చేస్తూ వస్తున్నారు. ఇడ్లీ దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ వంటకం. దీనిని ఆవిరి మీద వండుతారు కాబట్టి ఇది ఆరోగ్యకరమైనదని కచ్చితంగా చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు సమతుల్యంగా ఉంటాయి. ఇడ్లీలోని అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇది సాంస్కృతిక బంధాలను బలపరుస్తుంది. ఇది కేవలం ఆహార వేడుక మాత్రమే కాదు, సాంప్రదాయ ఆహారం విలువను, దాని ప్రపంచవ్యాప్త ప్రజాదరణను తెలియజేసే రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు - పోషక విలువ
ఆవిరి మీద వండటం వల్ల సులభంగా జీర్ణమయ్యే ఇడ్లీని, పోషకాహార నిపుణులు 'అత్యంత సమతుల్య భోజనం'గా సిఫార్సు చేస్తారు. బియ్యం, మినప పిండిని పులియబెట్టి తయారుచేసే ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు సమతుల్యంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన శక్తిని, సమతుల్య జీర్ణక్రియను అందించే ఈ ఆహారం, పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది.
ఇడ్లీ రకాలు..
సాధారణ ఇడ్లీ నుండి కాంచీపురం ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, తాటు ఇడ్లీ వరకు చాలా రకాలుగా ఇడ్లీ దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లలో ఇది ఒక అనివార్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. కాలక్రమేణా, ఇడ్లీ వివిధ రుచులు, కొత్త రకాలుగా రూపాంతరం చెంది, అంతర్జాతీయ ఆహార జాబితాలలో చేరిపోయింది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏ హోటల్ లేదా రెస్టారెంట్ లో అయినా ఇడ్లీ లేకుండా మెనూ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇది భారతీయ వంటకాలకు ఒక ముఖ్యమైన చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
సాంస్కృతిక బంధం..
ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం ఇడ్లీని వేడుకగా జరుపుకోవడం. ఇది కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే కాదు, లక్షలాది మందికి ఒక సాంస్కృతిక బంధం కూడా. ఇడ్లీ కుటుంబాలను, సమాజాలను ఏకం చేసే ఒక ఆహారం. ఈ రోజు సాంప్రదాయ వంటకాలను పరిరక్షించడాన్ని, వాటి ప్రాముఖ్యతను తర్వాతి తరానికి అందించడాన్ని ప్రోత్సహిస్తుంది.
మల్లెపూల వంటి ఇడ్లీని ఇలా చేసుకోవచ్చు..
మోతాదు: 4 భాగాల ఇడ్లీ బియ్యానికి, 1 భాగం మినప పప్పు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోండి.
నానబెట్టడం: బియ్యం - మినపపప్పును విడివిడిగా 4 నుండి 5 గంటల పాటు నానబెట్టండి.
రుబ్బడం: మినప పప్పును విడిగా వెన్నలా మెత్తగా అయ్యేంత వరకు, బియ్యాన్ని సాంబార్ లాగా కొంచెం గరుకుగా అయ్యేంత వరకు రుబ్బండి.
కలపడం: రుబ్బిన రెండు రకాల పిండిని తీసుకుని, అవసరమైనంత ఉప్పు వేసి చేతులతో బాగా కలపండి.
పులియబెట్టడం: పిండి ముద్దను ఒక గిన్నెలో 8 నుండి 10 గంటల పాటు (లేదా రాత్రంతా) పులియబెట్టండి.
ఆవిరి మీద ఉడికించడం: ఇడ్లీ పళ్ళెంకు గుడ్డతో నూనె లేదా వెన్న పూసి, పిండిని పోసి 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించండి.
ఇడ్లీ ఉడికిన తర్వాత, దానిపై కొద్దిగా నీళ్ళు చల్లి దించండి. ఇడ్లీ మెత్తగా, తెల్లగా వేడిగా నోరూరుంచేలా రెడీ. దీనికి కాస్త నెయ్యి కారంపొడి పల్లీ చెట్నీ తగిలించి నోట్లో వేసుకుంటే యిట్టె కరిగిపోతుంది. మరెందుకాలస్యం రేపు టిఫిన్ కి ఇడ్లీ పిండి రెడీ చేసేయండి.




