Viral Video: కుక్క నోట కనిపించిన నల్లటి కవర్.. సీసీటీవీ చూడగా వెలుగులోకి షాకింగ్ నిజం

Viral Video: ఉత్తరప్రదేశ్‌లో ఒక వ్యాపారవేత్తకు చెందిన రూ. లక్ష నగదు ఉన్న సంచిని వీధి కుక్క నోట కరుచుకుని పారిపోయింది. మసీదు వద్ద జరిగిన ఈ వింత దొంగతనం సీసీటీవీ విజువల్స్‌లో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ravi
By Ravi
Published on: 25 May 2026 1:53 PM IST
Viral Video
X

Viral Video: కుక్క నోట కనిపించిన నల్లటి కవర్.. సీసీటీవీ చూడగా వెలుగులోకి షాకింగ్ నిజం

Viral Video: సమాజంలో దొంగతనాలు జరగడం కొత్తేమీ కాదు. బైక్‌లపై వెళ్లేవారిని నమ్మించి మోసం చేయడం, ఆగి ఉన్న వాహనాల నుంచి బ్యాగులు కొట్టేయడం లాంటి నేరాలు మనం రోజూ వింటూనే ఉంటాం. కానీ ఓ వీధి కుక్క ఏకంగా రూ. లక్ష నగదు ఉన్న సంచిని నోట కరుచుకుని పారిపోవడం ఎక్కడైనా చూశారా.? వినడానికి ఇది కాస్తా విచిత్రంగా అనిపించినా.. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి నమ్మశక్యం కాని ఘటన ఒకటి జరిగింది. ప్రస్తుతం ఆ దొంగతనానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన ఒక వ్యాపారవేత్త తన వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంకుకు వెళ్లి రూ. లక్ష నగదును విత్ డ్రా చేశాడు. వాటిని ఓ నల్లటి సంచిలో పెట్టుకుని.. అనంతరం తన బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే, మార్గం మధ్యలో నమాజ్ చేసుకునే సమయం కావడంతో ఒక మసీదు వద్ద బైక్‌ను ఆపాడు. ఆ కంగారులోనో, లేదా కాసేపే కదా అనే నమ్మకంతోనో ఏకంగా రూ. లక్ష ఉన్న ఆ నగదు సంచిని బైక్ హ్యాండిల్‌కే తగిలించి మసీదు లోపలికి వెళ్లాడు.

ఆ వ్యాపారవేత్త లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే అక్కడికి ఒక వీధి కుక్క వచ్చింది. బైక్‌కు వేలాడుతున్న సంచిని చూసి, అందులో ఏదైనా తినే పదార్థం లేదా మాంసం ముక్కలు ఉన్నాయేమోనని అది భ్రమపడింది. అంతే, క్షణాల వ్యవధిలో ఆ సంచిని నోట కరచుకుని అక్కడి నుంచి వేగంగా పారిపోయింది. నమాజ్ ముగించుకుని బయటకు వచ్చిన వ్యాపారవేత్తకు బైక్‌పై సంచి కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఎవరో దొంగలు తన డబ్బును ఎత్తుకెళ్లారని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మసీదు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ ఫుటేజీ చూసిన పోలీసులతో పాటు సదరు వ్యాపారవేత్త కూడా నోరెళ్లబెట్టారు. అక్కడ దొంగతనం చేసింది ఏ మనిషో కాదని, ఒక సాధారణ వీధి కుక్క అని స్పష్టమైంది. దీంతో పోలీసులు ఇప్పుడు ఆ వింత దొంగను, దాని నోట ఉన్న డబ్బుల సంచిని వెతికే పనిలో పడ్డారు. ఏది ఏమైనా, డబ్బు విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ వింత ఘటన మనకు గుర్తుచేస్తోంది.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story