Viral Video : ఈగల ఛాయ్.. ఇంటర్నెట్లో ఇప్పుడిదే ట్రెండింగ్.. తెగ తాగుతున్న కస్టమర్లు
Viral Video : ఈగలు ముసిరిన పంచదారతో అతను కస్టమర్లకు టీ తయారు చేస్తున్న తీరు చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Roadside Chai Viral
Viral Video : భారతదేశంలో చాయ్ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు.. అది కోట్ల మంది ప్రజల రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. పొద్దున్నే లేవగానే వేడి వేడి టీ కప్పుతో రోజును ప్రారంభించే వారు మన దగ్గర చాలా మంది ఉంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు అలసటను దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ టీ తాగడానికే ఇష్టపడతారు. అందుకే నగరాల నుంచి పల్లెల వరకు రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న టీ కొట్లు, తోపుడు బండ్లు ఎప్పుడూ కస్టమర్లతో బిజీగా కనిపిస్తుంటాయి. అయితే, సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం.. రోడ్డు పక్కన దొరికే చాయ్ తాగే ముందు వంద సార్లు ఆలోచించక తప్పదు.
ప్లేట్ నిండా పంచదార.. అంతకంటే ఎక్కువ ఈగలు
ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో రోడ్డు పక్కన టీ అమ్ముతున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. అయితే అతను టీ తయారు చేసే విధానం చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. వీడియోను నిశితంగా గమనిస్తే.. సదరు టీవాలా పక్కన ఒక పెద్ద ప్లేట్ లో పంచదార పోసి ఉంచారు. ఆ చక్కెరపై వందలాది ఈగలు ముసిరి ఉన్నాయి. అసలు అక్కడ చక్కెర ఉందా లేక ఈగలు ఉన్నాయా అన్నట్లుగా ఆ ప్లేట్ తయారైంది. అయినా సరే, ఆ టీ వ్యాపారి ఎలాంటి సంకోచం లేకుండా, ఏమాత్రం అసహ్యం పడకుండా నేరుగా ఆ ఈగలు ఉన్న ప్లేట్ లోంచే చేత్తో పంచదారను తీసి గ్లాసులో వేశాడు. ఆ తర్వాత కేటిల్ లోంచి వేడి వేడి టీని అందులో పోసి స్పూన్ తో బాగా కలిపి కస్టమర్ కి ఇచ్చేశాడు.
मसाला चाय तो सबने पी ही होगी... पेश है मक्खी चाय...☕🙄
— 𝙈𝙪𝙧𝙩𝙞 𝙉𝙖𝙞𝙣 (@Murti_Nain) July 9, 2026
लुत्फ़ उठाइये 🤐 pic.twitter.com/uD2vVUNx33
జనం ముందే ఇంత ఘోరమా?
అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఇల్లీగల్, అన్‌హైజీనిక్ పనిని ఆ చాయ్‌వాలా అందరి ముందే బాహాటంగా చేస్తున్నాడు. చుట్టుపక్కల చాలా మంది కస్టమర్లు నిలబడి ఉన్నారు. విచిత్రం ఏంటంటే, అతని పక్కనే ఒక వ్యక్తి చాలా ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. కానీ అక్కడ అంత దారుణంగా ఈగలు ముసిరిన చక్కెరతో చాయ్ కలుపుతున్నా.. ఎవరూ కూడా అతడిని ఆపలేదు, కనీసం ఏంటయ్యా ఈ గలీజు పని అని ప్రశ్నించలేదు. కొద్ది సెకన్ల పాటు ఉన్న ఈ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో షేర్ అవ్వడమే ఆలస్యం.. క్షణాల్లో లక్షలాది మంది వ్యూస్ సంపాదించి వైరల్ గా మారింది.
ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కాగానే నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. వేల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోపై తమ శైలిలో స్పందిస్తున్నారు. తిండి, పానీయాల విషయంలో కనీస శుభ్రత పాటించకపోతే ఎలా అని చాలా మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చక్కెరపై అన్ని ఈగలు వాలినప్పుడు దాన్ని పారేయాలి లేదా కనీసం మూత పెట్టాలి గానీ, అలానే వాడటం ఏంటని టీవాలాపై విరుచుకుపడుతున్నారు. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం.. "ఇదే రోడ్‌సైడ్ చాయ్ లో ఉండే అసలైన సీక్రెట్ మసాలా" అంటూ కామెడీగా కామెంట్లు పెడుతున్నారు.




