Viral Video : గ్యాస్ సంక్షోభానికి వింత పరిష్కారం.. చిచ్చుబుడ్డితో టీ కాచిన యువకుడు.. ప్రపంచమే షాకయ్యే విన్యాసం
Viral Video : గ్యాస్ కొరత నేపథ్యంలో ఒక యువకుడు చిచ్చుబుడ్డి వెలిగించి టీ తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రయోగమని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
Viral Video
Viral Video : ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నడుస్తున్న యుద్ధ వాతావరణం సామాన్యుల వంటింట్లో మంటలు పుట్టిస్తోంది. అంతర్జాతీయంగా చమురు మరియు సహజ వాయువు సరఫరాకు ఆటంకం కలగడంతో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. చాలా చోట్ల గ్యాస్ దొరకక జనం అల్లాడిపోతున్నారు. హోటళ్లలో తిందామంటే ఖర్చు భారమైపోతోంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి కొందరు ఇండక్షన్ స్టౌవ్‌ల వైపు మొగ్గు చూపుతుంటే, మరికొందరు మాత్రం తమలోని క్రియేటివిటీని వాడి వింత ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఒక యువకుడు చేసిన పని చూస్తే మీరు ఖచ్చితంగా తల పట్టుకుంటారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక క్లిప్‌లో, గ్యాస్ లేదన్న నెపంతో ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి టీ తయారు చేశాడు. అతడు ముందుగా ఇటుకలతో ఒక చిన్న స్టాండ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నాడు. దానిపై టీ గిన్నె పెట్టి అందులో పాలు, నీళ్లు, చక్కెర, టీ పొడి అన్నీ కలిపేశాడు. ఇక్కడి వరకు అంతా మామూలుగానే ఉన్నా, ఆ గిన్నెను వేడి చేయడానికి అతడు ఎంచుకున్న మార్గమే అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. స్టౌవ్ వెలిగించే బదులు గిన్నె కింద ఒక 'అనార్ బాంబు' (చిచ్చుబుడ్డి) పెట్టాడు.
అనురాగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో, చిచ్చుబుడ్డిని వెలిగించగానే దాని నుంచి వచ్చే భయంకరమైన వేడి, సెగ గిన్నెను తాకుతుంది. ఆ వేడికి కొద్దిసేపటికే గిన్నెలోని పాలు ఉడకడం మొదలై, చాయ్ సిద్ధమైపోయింది. చూడటానికి ఇది ఏదో గొప్ప జుగాడ్‌లా అనిపించినా, ఇది అత్యంత ప్రమాదకరమైన పని. బాంబు పేలితే లేదా ఆ వేడికి గిన్నె కరిగిపోయినా తీవ్రమైన గాయాలయ్యే అవకాశం ఉంది. కేవలం లైకులు, వ్యూస్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం జరుగుతుండటంతో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్టౌవ్‌లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. సామాన్యులు గ్యాస్ ఆదా చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అయితే ఇలా బాంబులు, పేలుడు పదార్థాలతో టీలు, వంటలు చేయడం అనేది ఏమాత్రం క్షేమకరం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.




