Viral Video: భారీ మొసలిని భుజాన వేసుకుని పోలీస్ స్టేషన్‌కు.. రైతు ధైర్యానికి పోలీసులు షాక్!

Viral Video: చేనులో ప్రత్యక్షమైన 5 అడుగుల భారీ మొసలిని ఓ రైతు భయపడకుండా పట్టుకుని భుజాన వేసుకుని నడిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Arun Chilukuri
Published on: 3 Aug 2026 12:17 PM IST
Viral Video
X

Viral Video: భారీ మొసలిని భుజాన వేసుకుని పోలీస్ స్టేషన్‌కు.. రైతు ధైర్యానికి పోలీసులు షాక్!

Viral Video: సాధారణంగా చిన్న పాము కనిపించినా భయంతో ఎంతో దూరం పరుగులు తీస్తాం. అలాంటిది ఐదు అడుగుల భారీ మొసలి ఎదురొస్తే? ఎవరైనా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోతారు. కానీ, బిహార్‌కు చెందిన ఓ రైతు మాత్రం ఏమాత్రం భయం లేకుండా భారీ మొసలిని పట్టుకోవడమే కాకుండా.. దానిని ఏకంగా తన భుజాలపై వేసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. ఈ వింత దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ ఆసక్తికర ఘటన బిహార్‌లోని సుపౌల్ జిల్లాలో చోటుచేసుకుంది. అమిత్ కుమార్ అనే రైతు ఇతర కూలీలతో కలిసి తమ వరి చేనులో పనులు చేసుకుంటుండగా, పంట పొలం మధ్యలో ఏదో కదులుతున్నట్లు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా సుమారు 5 అడుగుల పొడవున్న భారీ మొసలి కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అయితే, గ్రామస్తులు ఎవరూ తొందరపడి మొసలికి హాని తలపెట్టలేదు. రైతు అమిత్ కుమార్ సమయస్ఫూర్తితో వ్యూహం రచించి.. అది ఎవరిపైనా దాడి చేయకుండా ముందుగా దాని నోటిని తాడుతో గట్టిగా కట్టేశారు. అనంతరం దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగించాలని భావించారు.

ఆ సమయంలో గ్రామంలో ఎలాంటి వాహనం అందుబాటులో లేకపోవడంతో సమయం వృథా చేయకుండా అమిత్ కుమార్ ఆ మొసలిని ఏకంగా తన భుజాన వేసుకుని నడక మొదలుపెట్టాడు. నేరుగా అటవీ శాఖ కార్యాలయానికి వెళ్లగా.. అది మూసివేసి ఉంది. దీంతో ఆ మొసలితోనే దగ్గరలోని భీమ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు నడిచొచ్చాడు.

భుజంపై మొసలితో స్టేషన్‌లోకి అడుగుపెట్టిన రైతును చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అనంతరం పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మొసలిని సురక్షితంగా స్వాధీనం చేసుకుని అడవిలో వదిలిపెట్టారు. భుజాన మొసలితో నడుస్తున్న రైతు వీడియో ఇప్పుడు నెట్టింట గ్లోబల్ ట్రెండింగ్‌గా మారగా.. ఆయన గుండెధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story