Viral Video: వాటర్ నింపుతుండగా ట్యాంక్‌లో ఏదో కదులుతూ కనిపించింది.. మూత తీసి చూడగా
Viral Video: హరిద్వార్‌లోని ఓ ఇంట్లో తమ వాటర్ ట్యాంక్ తెరిచి చూసిన కుటుంబ సభ్యులకు కళ్లు బైర్లు కమ్మాయి.
Viral Video: వాటర్ నింపుతుండగా ట్యాంక్‌లో ఏదో కదులుతూ కనిపించింది.. మూత తీసి చూడగా
Viral Video: సాధారణంగా మన ఇంట్లో ఉండే నీళ్ల ట్యాంకును ఎప్పుడైనా చెక్ చేసినప్పుడు అందులో చెత్త లేదా పాచి లాంటివి కనిపిస్తేనే మనం కంగారు పడిపోతాం. అలాంటిది ఓ కుటుంబం తమ ఇంటి వాటర్ ట్యాంకు మూత తీసి చూడగా.. అందులో ఏకంగా 27 పాము పిల్లలు సజీవంగా బుసలు కొడుతూ కనిపించాయి. వినడానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే?
హరిద్వార్‌లోని సరాయ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం, సోమవారం మధ్యాహ్నం తమ ఇంటి ఆవరణలో ఉన్న నీటి ట్యాంకులోకి నీళ్లు పడుతున్న సమయంలో.. లోపల ఏదో కదులుతున్నట్లు గమనించారు. అనుమానంతో ట్యాంక్ మూత తీసి చూడగా, అందులో డజన్ల కొద్దీ చిన్న పాము పిల్లలు ఈదుతూ కనిపించాయి. దీంతో భయాందోళనకు గురైన ఆ కుటుంబ సభ్యులు వెంటనే స్థానికులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారుల బృందం.. స్నేక్ క్యాచర్లు తాలిబ్, భోలాలతో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంతో చాకచక్యంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, నీటి ట్యాంకులో ఉన్న పాములను ఒక్కొక్కటిగా బయటకు తీశారు. ఆ ట్యాంకులో నుంచి మొత్తం 27 పాము పిల్లలను సురక్షితంగా వెలుపలికి తీశారు. ఈ మొత్తం తతంగాన్ని అక్కడున్న వారు వీడియో తీయగా, ఆ విజువల్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
కాగా, అటవీ శాఖాధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పాములన్నీ 'చెక్వెర్డ్ కీల్‌బ్యాక్' అనే జాతికి చెందిన నీటి పాములు. ఇవి విషపూరితమైనవి కావని, సాధారణంగా చెరువులు, కాలువలు, నీటి వనరుల సమీపంలో కనిపిస్తాయని అటవీ అధికారి స్వప్నిల్ స్పష్టం చేశారు. ఈ పాములను రక్షించిన అనంతరం సురక్షిత ప్రాంతంలో వదిలేశారు.
ట్యాంకులోకి ఇన్ని పాములు ఎలా వచ్చాయి?
ఒక ట్యాంకులో ఇన్ని పాము పిల్లలు ఒకేసారి రావడం వెనుక ఉన్న కారణాన్ని అధికారులు విశ్లేషించారు. ఒక ఆడ పాము ఈ ట్యాంకు సమీపంలో గుడ్లు పెట్టి ఉంటుందని, వేసవిలో ఎండ వేడిమి నుంచి రక్షించుకోవడానికి, చల్లదనం కోసం ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలన్నీ ఆ నీటి ట్యాంకులోకి చేరి ఉంటాయని భావిస్తున్నారు.




