UP Railway Station: రియల్ హీరో: ప్రాణాలకు తెగించి ప్రయాణికుడిని కాపాడిన కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్!

UP Railway Station: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు దిగుతూ ప్రమాదవశాత్తు ట్రాక్‌పై పడబోయిన ప్రయాణికుడిని ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ చాకచక్యంగా కాపాడారు.

Arun Chilukuri
Published on: 10 July 2026 12:10 PM IST
UP Railway Station
X

UP Railway Station: రియల్ హీరో: ప్రాణాలకు తెగించి ప్రయాణికుడిని కాపాడిన కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్!

UP Railway Station: రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. కదులుతున్న రైలు ఎక్కడం లేదా దిగడం ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తున్నా.. ఎవరో ఒకరు ఇలాంటి సాహసాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ (UP) లోని వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్‌ (ఝాన్సీ) లో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. కదులుతున్న రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పైకి దిగబోయి రైలు కింద పడిపోతున్న ఓ ప్రయాణికుడిని, అక్కడ విధుల్లో ఉన్న రైల్వే కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తితో కాపాడి ప్రాణదాతగా నిలిచారు.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాముద్దీన్-జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైల్వే స్టేషన్ నుంచి నెమ్మదిగా ముందుకు కదులుతోంది. ఆ సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన రమేశ్‌ జైన్‌ అనే ప్రయాణికుడు కదులుతున్న స్లీపర్‌ కోచ్‌ నుంచి కిందకు దిగడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేగాన్ని అంచనా వేయలేక పట్టుతప్పి జారి, కదులుతున్న రైలుకు-ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో (గ్యాప్) లోపలికి పడిపోబోయాడు.

రమేశ్ జైన్ రైలు కింద పడిపోవడాన్ని ప్లాట్‌ఫామ్‌పై విధుల్లో ఉన్న ఆర్‌పీఎఫ్ (RPF) కానిస్టేబుల్‌ ప్రవీణ్ కుమార్ గమనించారు. ఒక్క క్షణం ఆలస్యమైనా ప్రయాణికుడు రైలు చక్రాల కింద నలిగిపోయే పరిస్థితి. కానీ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ క్షణాల వ్యవధిలో పరిగెత్తుకుంటూ వెళ్లి, ప్రాణాలకు తెగించి ఆ ప్రయాణికుడిని వెనక్కి లాగేశారు. దీంతో ఒక పెద్ద ఘోర ప్రమాదం తప్పి, రమేశ్ జైన్ ప్రాణాలతో బయటపడ్డాడు.

బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఒళ్లు గగుర్పొడిచే ప్రమాద దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి. తాజాగా ఈ వీడియో వెలుగులోకి రావడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ సమయస్ఫూర్తిని, సాహసాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ను ఝాన్సీ రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) మనోజ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రయాణికుల రక్షణ మరియు భద్రత కోసమే తమ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా విధుల్లో ఉంటారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story