ఒక్క రోజు భార్యాభర్తలుగా ఉండి విడిపోయారు.. ఈ ఇద్దరు యువకులు పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదే!

Odisha: ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్ జిల్లా గంహారియా గ్రామంలో వింత సంఘటన. వానలు పడటం కోసం శతాబ్దాల నాటి సంప్రదాయం ప్రకారం ఇద్దరు మగవారు వేదమంత్రాల మధ్య వివాహం చేసుకున్నారు.

Arun Chilukuri
Published on: 20 Jun 2026 3:02 PM IST
ఒక్క రోజు భార్యాభర్తలుగా ఉండి విడిపోయారు.. ఈ ఇద్దరు యువకులు పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదే!
X

Odisha: దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో శతాబ్దాల నాటి నమ్మకాలు, వింత సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలో వర్షాల కోసం ఇద్దరు మగవారు పెళ్లి చేసుకున్న వింత సంఘటన వెలుగుచూసింది. రుతుపవనాలు ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం, ఎండలు దంచికొడుతుండటంతో గ్రామ పెద్దలంతా కలిసి ఈ విచిత్ర వివాహాన్ని జరిపించారు.

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా గంహారియా గ్రామంలో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానలు పడక పంటలు ఎండిపోతుండటంతో, గ్రామస్థులంతా కలిసి తమ పూర్వీకుల నాటి సాంప్రదాయాన్ని తెరపైకి తెచ్చారు. అక్కడ ఉన్న నమ్మకం ప్రకారం.. తీవ్ర కరవు పరిస్థితులు ఉన్నప్పుడు ఊరిలో వర్షాలు పడాలంటే ‘అందిర బిబాహ’ జరిపించాలి. ఈ సంప్రదాయంలో భాగంగా గ్రామానికి చెందిన ఇద్దరు మగాళ్లకు పెళ్లి చేస్తారు. పెళ్లయ్యాక ఆ జంట ఒక రోజు మొత్తం భార్యాభర్తలుగా కలిసి ఉంటుంది. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఇలా చేయడం వల్ల వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని ఆ గ్రామ ప్రజల బలమైన నమ్మకం.

ఈ వింత పెళ్లి కోసం గ్రామానికి చెందిన 29 ఏళ్ల జతిన్ కతువా, 27 ఏళ్ల కలాండి నాయక్ అనే ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. గ్రామస్థులంతా కలిసి పెళ్లి పనులను చకచకా పూర్తి చేశారు. గురువారం సాయంత్రం జతిన్ వరుడి దుస్తులు ధరించి, పెళ్లి కారులో స్థానిక సిద్ధేశ్వరి ఆలయానికి చేరుకున్నాడు. అక్కడ వధువు గెటప్‌లో పట్టుచీర, ఆభరణాలు ధరించి కలాండి సిద్ధంగా ఉన్నాడు.

గ్రామ పెద్దలు లక్ష్మణ్ కతువాను పెళ్లి కుమారుడి తండ్రిగా, మనగోబింద నాయక్‌ను పెళ్లి కూతురి తండ్రిగా వ్యవహరింపజేశారు. బంధుమిత్రులు, వేద మంత్రాలు, మేళతాళాల మధ్య ఈ ఇద్దరు యువకుల వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. పెళ్లి అనంతరం ఆలయ ప్రాంగణంలోనే గ్రామస్థులందరికీ ఘనంగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాల అనంతరం సాంప్రదాయబద్ధంగా అప్పగింతల కార్యక్రమం కూడా ముగిసింది.

కట్టుబాట్ల ప్రకారం.. పెళ్లయిన తర్వాత జతిన్, కలాండి జంట ఒక రోజంతా భార్యాభర్తలుగా కలిసి గడిపారు. అనంతరం ఆ వింత తంతు ముగియడంతో, శుక్రవారం ఇద్దరూ తమ పెళ్లి బంధాన్ని ముగించుకుని ఎవరి దారిన వారు తమ సొంత పనుల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వింత పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story