The Forgotten Hero of the Ramayana: భరతుడిని కాదని రాముడితో సమానంగా శతృఘ్నుడు సాధించిన అతిపెద్ద విజయం ఇదే...

రామాయణం మానవ సంబంధాలు, అనుబంధాలకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ముఖ్యంగా రాముడి ధర్మం, భరతుడి త్యాగం, లక్ష్మణుడి వినయం గురించి ఎక్కువగా ప్రస్తావించబడింది.

Balachander
Updated on: 10 April 2026 9:53 AM IST
Shatrughnas Victory over Lavanasura
X

Shatrughna's Victory over Lavanasura

Shatrughna : రామాయణం మానవ సంబంధాలు, అనుబంధాలకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ముఖ్యంగా రాముడి ధర్మం, భరతుడి త్యాగం, లక్ష్మణుడి వినయం గురించి ఎక్కువగా ప్రస్తావించబడింది. అయితే, శతృఘ్నుడి పరాక్రమం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. కానీ, ఉత్తర రామాయణంలో శతృఘ్నుడు సాధించిన అపూర్వమైన విజయం గురించి ప్రస్తావన ఉంది. శ్రీరాముడు రావణుడిని సంహరించినంతటి గొప్ప కార్యంగా పురాణాలు కీర్తించాయి. లవణాసుర వధ ద్వారా లోకానికి శాంతిని చేకూర్చిన శతృఘ్నుడి గాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మధువనం - లవణాసురుడి అరాచకాలు

ప్రతి యుగంలో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడానికి కొంతమంది రాక్షసులు పుడుతుంటారు. త్రేతాయుగంలో ఇలా పుట్టిన వారిలో ఒకడు మధువు. రాక్షసుడే అయినా రావణుడి మాదిరిగా ఘోరమైన తపస్సుచేసి శివుడిని మెప్పించి త్రిశూలాన్ని వరంగా పొందుతాడు. ఆ ఆయుధం అతని చేతిలో ఉన్నంత వరకు ఎవరూ అతడిని జయించలేరు. అయితే, కుటుంబ సంక్షేమం కోసం వంశపారంపర్యంగా ఆయుధాన్ని పొందే వరం కావాలని అడగ్గా అందుకు శివుడు తిరస్కరించి నీ కుమారుడి వరకు మాత్రమే ఈ ఆయుధం పొందగలరని వరం ఇస్తాడు. మధుడు సాత్వికుడిగా ప్రజారంజకుడిగా పాలన చేయగా, అతని కుమారుడు లవణాసుడు పరమ దుర్మార్గుడిగా మారతాడు. మునులను, ఋషులను బాధిస్తాడు. యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ మనుషులను భక్తిస్తూ లవణాసుడు పరమ కిరాతకుడిగా మారిపోతాడు.

శరణు కోరిన ఋషులు

లవణాసురుడి బాధలు తట్టుకోలేక, అతని ఆగడాలను భరించలేక యమునా తీరంలోని ఋషిపుంగవులంతా కలిసి అయోధ్యవెళ్లి శ్రీరామచంద్రుడికి తమ బాధలు చెప్పుకుంటాడు. లవణాసురుడి నుంచి తమను కాపాడాలని వేడుకుంటారు. కాగా, శరణు కోరిన వారికి అభయం ఇవ్వడం రాజుగా విధి. ఋషులకు అభయం ఇచ్చిన తరువాత తన సోదరులను పిలిచి లవణాసురుడిని సంహరించే బాధ్యతను ఎవరు తీసుకుంటారని అడుగుతాడు. ఈ విషయంలో మొదట భరతుడు ముందుకు వస్తాడు. తాను ఆ రాక్షసుడిని సంహరిస్తానని చెబుతాడు.

శతృఘ్నుడి ధైర్యం

భరతుడి మాటలకు శతృఘ్నుడు అడ్డుపడతాడు. శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో ఉండగా భరతుడు అయోధ్యను కంటికి రెప్పలా కాపాడాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఆయనకు విశ్రాంతి అవసరం. లవణాసురుడిని సంహరించే బాధ్యతతనకు ప్రసాదించమని శతృఘ్నుడు శ్రీరాముడిని వేడుకుంటాడు. శతృఘ్నుడి ధైర్యానికి మెచ్చిన శ్రీరాముడు అతడిని మధురాపురానికి రాజుగా పట్టాభిషేకం చేసి ఓ దివ్యమైన బాణాన్ని అందిస్తాడు.

వ్యూహాత్మక యుద్ధం

తండ్రి తరువాత శివుడి ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి లోకకంటకుడిగా మారిన లవణాసురుడి గురించి శ్రీరామచంద్రుడు కొన్ని విషయాలు చెబుతాడు. త్రిశూలానికి ఓ ప్రత్యేక ఉందని, యుద్ధానికి ముందు పూజలు చేసి ఆయుధాన్ని ధరిస్తే అతడిని ఎవరూ ఓడించలేరని, లవణాసుడు ఆయుధం లేకుండా ఆహారం కోసం బయటకు వచ్చినపుడు మాత్రమే అతడిని సంహరించే అవకాశం ఉంటుందని చెబుతాడు. బయటకు వచ్చిన రాక్షసుడిని తిరిగి కోటలోపలికి వెళ్ళకుండా అడ్డుకొని సంహరించాలని ఉపదేశిస్తాడు. శ్రీరామచంద్రుడు చెప్పిన విధంగా శతృఘ్నుడు మధువు పరిపాలించిన నగరానికి వెళ్లి లవణాసురుడిని అడ్డుకుంటాడు. యుద్ధం చేసేందుకు ముందుకు వచ్చిన శతృవు గురించి తెలుసుకోవడం యుద్ధనీతి. శతృఘ్నుడి గురించి తెలుసుకున్న లవణాసుడు హాహాకారాలు చేస్తాడు. తన మేనమామ రావణుడిని చంపిన రాముడి సోదరుడు వచ్చాడని, శతృఘ్నుడిని చంపి మేనమామ ఆత్మకు శాంతి చేకూరుస్తానని చెప్పి వికటాట్టహాసం చేస్తాడు.

అద్భుత విజయం

ఇద్దరిమధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. లవణాసురుడు వివిధ రకాలైన వస్తువులతో యుద్ధం చేస్తాడు. చివరికి లవణాసురుడు ఓ భారీ వృక్షాన్ని పెకిలించి శతృఘ్నుడి మీదకు విసురుతాడు. ఆ చెట్టు తలకు తగలడంతో స్పృహకోల్పోతాడు. శతృఘ్నుడు మరణించాడని భావించిన ఆ రాక్షసుడు ఆకలితో తాను వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని భుజించడం మొదలుపెడతాడు. వెంటనే స్పృహలోకి వచ్చిన శతృఘ్నుడు శ్రీరామచంద్రుడు ఇచ్చిన దివ్యాస్త్రాన్ని లవణాసురుడిపై ప్రయోగిస్తాడు. ఆ బాణం మెరుపువేగంతో దూసుకెళ్లి రాక్షసుడి గుండెను చీల్చివేస్తుంది. అక్కడి నుంచి పాతాళంలోకి వెళ్లి తిరిగి శతృఘ్నుడి అమ్ములపొదిలోకి చేరుతుంది. రాక్షసుడు నేలకూలగానే శివుడి త్రిశూలం తిరిగి కైలాసం చేరుతుంది.

శతృఘ్నుడి గొప్పదనం

లవణాసుడిపై విజయంతో శతృఘ్నుడి కేవలం శ్రీరాముడి తమ్ముడిగానే కాకుండా ఒక స్వతంత్ర వీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అంతేకాదు, శతృఘ్నుడు 12 ఏళ్లపాటు కఠోరమైన దీక్షతో మధురాపురాన్ని పాలించి ఆ ప్రాంతాన్ని సుభిక్షం చేశాడు. రావణుడిని సంహరించేందుకు శ్రీరాముడు వానరసైన్యంతో పోరాడగా... శతృఘ్నుడు ఒంటరిగా ధైర్యంగా , రాముడి ఉపదేశంతో లవణాసురుడిని అంతం చేశాడు. రామాయణంలో మౌనంగా కనిపించే శతృఘ్నుడు ఈ ఘట్టంలో మహావీరుడిగా దర్శనమిస్తాడు. భగవంతుడిపై ఉండే భక్తి, లోకకళ్యాణం కోసం చేసే పోరాటం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తాయో అని చెప్పడానికి శతృఘ్నుడి కథే ఓ నిదర్శనం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story