Viral Video : ఇరాన్ పర్వతాల్లో వింత జీవి.. 0.2 సెకన్లలో వేటాడే మాయావి పాము గురించి మీకు తెలుసా?

Viral Video : సాలెపురుగు ఆకారంలో తోక కలిగిన వింత పాము వీడియో వైరల్ అవుతుంది. ఇరాన్ పర్వతాల్లో పక్షులను వేటాడే స్పైడర్-టెయిల్డ్ వైపర్ తెలివైన వేట చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

CR Reddy
Published on: 24 April 2026 9:44 AM IST
Viral Video
X

Viral Video

Viral Video : ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. కొన్నిటిని చూస్తే మనం ఆశ్చర్యంతో నోరెళ్లబెడతాము. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. ఒక జీవిని చూడగానే అది పొడవైన కాళ్లున్న సాలెపురుగు అనుకుంటాం.. కానీ తీరా దగ్గరకు వెళ్లి చూస్తే అది అత్యంత ప్రమాదకరమైన పాము అని తెలుస్తుంది. ప్రకృతిలో దొరికే అతిపెద్ద వేటగాళ్లలో ఒకటైన స్పైడర్ టెయిల్డ్ హార్న్డ్ వైపర్‎కి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఏమిటీ వింత జీవి?

దీనిని శాస్త్రీయ పరిభాషలో స్యూడోసెరాస్టెస్ ఉరరాక్నోయిడ్స్ అని పిలుస్తారు. సాధారణ భాషలో దీనిని స్పైడర్ టెయిల్డ్ హార్న్డ్ వైపర్ అంటారు. దీని తోక చివర ఒక సాలెపురుగు లాంటి ఆకారం ఉంటుంది. తోక చివర భాగం ఉబ్బిపోయి, దానికి సాలెపురుగుకు ఉన్నట్లుగా పొడవైన వెంట్రుకలు లేదా కాళ్లు లాంటి ఆకారాలు ఉంటాయి. ఈ పాము తన తోకను కదిలించినప్పుడు, దూరం నుంచి చూసే ఎవరికైనా అది ఒక పెద్ద సాలెపురుగు పాకుతున్నట్లు కనిపిస్తుంది.

వేటాడే స్టైలే వేరు

ఈ పాము వేటాడే విధానం చాలా తెలివైనది. ఇది ఇరాన్ దేశంలోని పర్వత ప్రాంతాల్లో, రాళ్ల మధ్య గంటల తరబడి కదలకుండా పడి ఉంటుంది. దీని శరీరం రంగు రాళ్ల రంగులో కలిసిపోవడం వల్ల దీనిని గుర్తించడం అసాధ్యం. సాలెపురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి ఇది తన తోకను నెమ్మదిగా కదిలిస్తుంది. పక్షి తన ఆహారం (సాలెపురుగు) దొరికిందని ఆశతో దగ్గరకు రాగానే, ఈ పాము కంటి రెప్పపాటు కాలంలో అంటే కేవలం 0.2 సెకన్ల వేగంతో దాడి చేసి పక్షిని నోట పట్టుకుంటుంది.

శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచిన చరిత్ర

ఈ వింత పాము గురించి 1968లో మొట్టమొదటిసారి తెలిసింది. అప్పట్లో దీనిని చూసిన శాస్త్రవేత్తలు, ఆ పాము తోకకు ఏదో గడ్డ అయి ఉంటుందని లేదా ఏదైనా పుట్టుకతో వచ్చిన లోపం అనుకున్నారు. కానీ 2006లో జరిగిన లోతైన పరిశోధనల తర్వాత తెలిసింది ఏమిటంటే.. అది లోపం కాదు, పక్షులను ఆకర్షించడానికి ప్రకృతి దానికి ఇచ్చిన అద్భుతమైన ఆయుధమని.. ఇరాన్‌లోని జాగ్రోస్ పర్వత ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ జీవులు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయి.

నెటిజన్ల కామెంట్స్

ఇన్‌స్టాగ్రామ్‌లోని @hakadiscoveryanimals పేజీలో షేర్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రకృతిలో ఇంతటి మాయగాళ్లు కూడా ఉంటారా? అని కొందరు, అసలు కళ్లు నమ్మలేకపోతున్నాం అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదిస్తూ తెగ వైరల్ అవుతోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story