Thailand Ends Free Visa Entry : బ్యాంకాక్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఉచిత వీసా రద్దు..!

Thailand Ends Free Visa Entry : మీరు థాయిలాండ్ అందాలను ఆస్వాదించడానికి సుదీర్ఘ వేసవి ప్లాన్ చేసుకుంటున్నా.. అక్కడి బీచ్‌లలో కూర్చొని ప్రశాంతంగా వర్కేషన్

G Krishna
Published on: 22 May 2026 5:33 PM IST
Thailand
X

 Thailand

Thailand Ends Free Visa Entry : మీరు థాయిలాండ్ అందాలను ఆస్వాదించడానికి సుదీర్ఘ వేసవి ప్లాన్ చేసుకుంటున్నా.. అక్కడి బీచ్‌లలో కూర్చొని ప్రశాంతంగా వర్కేషన్ చేయాలనుకుంటున్నా మీ ప్రయాణ ప్రణాళికను మరోసారి సరిచూసుకోవాల్సిందే. పర్యాటకులకు ఎంతో కాలంగా ఊరటనిస్తున్న 60 రోజుల ఉచిత వీసా సదుపాయాన్ని పూర్తిగా రద్దు చేస్తూ థాయిలాండ్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనకు అక్కడి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో భారతీయ పర్యాటకులు మళ్లీ కఠినమైన సరిహద్దు నిబంధనలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఏం మారింది? భారతీయులపై పడే ప్రభావం ఇదే..

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 93 దేశాల పర్యాటకులకు థాయిలాండ్ ప్రభుత్వం గతంలో కల్పించిన ఉచిత ప్రవేశ సదుపాయానికి స్వస్తి పలుకుతూ, సరిహద్దుల వద్ద నిఘాను పెంచేందుకు వీలుగా ఒక క్రమబద్ధమైన సరికొత్త వీసా విధానాన్ని తీసుకురాబోతోంది. ఈ కొత్త నిర్ణయంతో భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు లభించిన తాత్కాలిక వీసా ఫ్రీ హోదా పూర్తిగా రద్దయింది. దీనివల్ల భారతీయులు థాయిలాండ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత మళ్లీ వీసా ఆన్ అరైవల్ కౌంటర్ల వద్ద లైన్లలో నిలబడాల్సి ఉంటుంది.. లేకపోతే.. ప్రయాణానికి ముందే ఆన్‌లైన్ ద్వారా ఈ-వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఎయిర్‌పోర్టులో లైన్ల రద్దీని తట్టుకోవడానికి అధికారిక థాయిలాండ్ ఈ-వీసా పోర్టల్ ద్వారా ప్రయాణానికి 3 నుండి 5 రోజుల ముందే అప్లై చేసుకోవచ్చు కానీ దీనికోసం దాదాపు 2500 థాయ్ భట్ అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 5,800 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా గతంలో ఉచిత వీసా కింద 60 రోజుల పాటు థాయిలాండ్‌లో ఉండే అవకాశం ఉండగా, ఇప్పుడు పునరుద్ధరించిన వీసా ఆన్ అరైవల్ నిబంధనల ప్రకారం ఒకసారి వెళ్తే గరిష్టంగా 15 రోజులు మాత్రమే అక్కడ ఉండేందుకు చట్టబద్ధమైన అనుమతి లభిస్తుంది.

పర్యాటక రంగ నిపుణుల విశ్లేషణ

తక్కువ బడ్జెట్‌లో థాయిలాండ్ వెళ్లాలనుకునే వారిపై ఈ అదనపు ఖర్చులు, పేపర్ వర్క్ భారం పడుతుందని పర్యాటక రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ప్రెసిడెంట్ రవి గోసేన్ దీనిపై స్పందిస్తూ ప్లానింగ్, డాక్యుమెంటేషన్, అదనపు ఫీజుల వల్ల ఇష్టమొచ్చినప్పుడు అప్పటికప్పుడు థాయిలాండ్ వెళ్లే వారి సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ తక్కువ దూరం, తక్కువ ఖర్చు, చక్కని ఆతిథ్యం కారణంగా భారతీయులకు థాయిలాండ్ ఎప్పటికీ ఒక పాపులర్ డెస్టినేషన్‌గానే ఉంటుందని చెప్పారు. అయితే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకునే డిజిటల్ నోమాడ్స్, కుటుంబాలతో కలిసి సుదీర్ఘ విహారయాత్రలు చేసేవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని పర్యాటక నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిబంధనలు కఠినంగా మారినప్పుడు పర్యాటకులు తమ రూట్ మార్చుకుని మలేషియా, వియత్నాం, శ్రీలంక, బాలి వంటి సులభమైన వీసా నిబంధనలు ఉన్న దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు.

కొత్త రూల్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి..?

థాయిలాండ్ ప్రభుత్వ అధికారిక పబ్లిక్ జర్నల్ అయిన 'రాయల్ గెజెట్' లో ఈ కొత్త నిబంధనలు ప్రచురితమైన సరిగ్గా 15 రోజుల తర్వాత ఇవి పూర్తిగా చట్టబద్ధంగా అమలులోకి వస్తాయి. ఒకవేళ గెజెట్ నోటిఫికేషన్ రాకముందే మీరు టికెట్లు బుక్ చేసుకుని ఉంటే కంగారు పడాల్సిన పనిలేదు, పాత పద్ధతిలోనే మీకు ఎయిర్‌పోర్టులో స్టాంప్ వేస్తారు , ఆ స్టాంప్ గడువు ముగిసేవరకు మీరు థాయిలాండ్‌లో సురక్షితంగా గడపవచ్చు. అయితే పర్యాటకులు ఏవైనా హోటల్, ఫ్లైట్ బుకింగ్స్ చేసుకునే ముందు థాయిలాండ్ విదేశాంగ శాఖ అధికారిక పోర్టల్‌లో తాజా అప్‌డేట్స్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

థాయిలాండ్ ప్రభుత్వం ఎందుకు యూ-టర్న్ తీసుకుంది.?

కరోనా మహమ్మారి తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న తమ పర్యాటక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించుకోవడానికి థాయిలాండ్ ప్రభుత్వం జూలై 2024 లో సరిహద్దు నిబంధనలను సడలించి వీసా మినహాయింపు దేశాల జాబితాను పెంచింది. దీనివల్ల భారతీయ కుటుంబాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, వీకెండ్ ప్లాన్స్ చేసుకునే వారితో థాయిలాండ్ పర్యాటక రంగం కళకళలాడింది. కానీ వీసా నిబంధనలను సడలించడం వల్ల థాయిలాండ్ స్థానిక పోలీసులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. గత కొన్ని నెలలుగా పర్యాటక వీసాల పేరుతో దేశంలోకి వచ్చి ఆన్‌లైన్ స్కామ్ కేంద్రాలు నడపడం, ఇల్లీగల్ బిజినెస్‌లు చేయడం , వీసా గడువు ముగిసినా దొంగతనంగా అక్కడే ఉండిపోవడం వంటి నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటికి తోడు కొందరు బాధ్యతారాహిత్య పర్యాటకులు స్థానిక పురాతన దేవాలయాలను ధ్వంసం చేయడం, మద్యం మత్తులో రోడ్లపై గొడవలకు దిగడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చింది, అందుకే థాయిలాండ్ ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story