Tea: రోడ్డు పక్కన టీ తాగుతున్నారా..? అయితే ఈ వీడియో మీకోసమే!
Tea: రోడ్డు పక్కన టీ కొట్టులో ఈగలు ముసిరిన చక్కెరతో ఏమాత్రం సంకోచం లేకుండా టీ తయారు చేస్తున్న వ్యాపారి వీడియో ఎక్స్ లో వైరల్ అవుతోంది.
Tea: రోడ్డు పక్కన టీ తాగుతున్నారా..? అయితే ఈ వీడియో మీకోసమే!
Tea Video: భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం కాదు, కోట్లాది మందికి అదొక భావోద్వేగం. ఉదయం నిద్ర లేచింది మొదలు, ఆఫీసు ఒత్తిడిని దూరం చేసుకోవడం వరకు ప్రతి ఒక్కరికీ ఒక కప్పు వేడి వేడి చాయ్ కావాల్సిందే. అందుకే గల్లీ చివరన ఉండే చిన్న టీ కొట్టు నుండి హైవే పక్కన ఉండే డాబాల వరకు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అయితే, మనం అంత ఇష్టంగా తాగే ఈ టీని ఎంతవరకు పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియో చూస్తే, బయట టీ తాగే ముందు ఎవరైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించక మానరు.
సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. ఈ వైరల్ వీడియోలో, ఒక రోడ్డు పక్కన ఉండే టీ వ్యాపారి ఎలాంటి భయం, సంకోచం లేకుండా టీ తయారు చేస్తున్నాడు. అయితే అక్కడ అసలు సమస్య అతను వాడే చక్కెర దగ్గర వచ్చింది. ఆ దుకాణంలో ఉన్న చక్కెర గిన్నెపై వందల కొద్దీ ఈగలు వాలి, భీభత్సంగా ఝుమ్మని శబ్దం చేస్తూ ముసురుకున్నాయి. ఆ వ్యాపారి ఆ ఈగలను తోలే కనీస ప్రయత్నం కూడా చేయకుండా, నేరుగా ఆ ఈగలు పట్టిన చక్కెరనే స్పూన్‌తో తీసి మరుగుతున్న టీ గిన్నెలో వేసేశాడు. చూసేందుకే తీవ్ర అసహ్యం కలిగించేలా ఈ దృశ్యం ఉంది.
ఈ వీడియోలో అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే అక్కడ నిలబడిన వినియోగదారుల వైఖరి. దుకాణం చుట్టూ చాలా మంది కస్టమర్లు నిలబడి ఉన్నారు. కళ్లెదుటే అంత అపరిశుభ్రంగా, ఈగలు ముసిరిన చక్కెరతో టీ తయారు చేస్తున్నా ఎవరూ అతడిని నిలదీయలేదు, ఆపడానికి ప్రయత్నించలేదు. ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న ఆ నిర్లక్ష్యాన్ని చూస్తూ కూడా జనం తమ చాయ్ కప్పు కోసం నిశ్శబ్దంగా వేచి ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ వీడియో వైరల్ అవుతుండటంతో ఆన్లైన్లో విపరీతమైన చర్చకు దారితీసింది. ఇది వ్యాపారం కాదు, ప్రజారోగ్యంతో ఆడుకుంటున్న ప్రాణాంతక ఆట అని ఒక యూజర్ కామెంట్ చేయగా, చూస్తూ కూడా నోరు విప్పని కస్టమర్లదే అసలు తప్పు అని మరికొందరు మండిపడుతున్నారు. బయట దొరికే ఇలాంటి అపరిశుభ్ర ఆహార పదార్థాల వల్ల టైఫాయిడ్, కలరా, విరేచనాలు వంటి తీవ్రమైన వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.




