Ketan Murder Case : లవ్ స్టోరీలో కిల్లర్ ట్విస్ట్..! సియా గోయల్ - కేతన్ వీడియో వైరల్.!

Ketan Murder Case : ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్వుతున్న ఆ ముఖాల వెనుక.. అంతటి క్రూరత్వం దాగి ఉంటుందని బహుశా ఆ దేవుడు కూడా ఊహించి ఉండడు. ప్రేమ,..

G Krishna
Published on: 24 Jun 2026 11:12 AM IST
Ketan Murder Case
X

Ketan Murder Case

Ketan Murder Case : ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్వుతున్న ఆ ముఖాల వెనుక.. అంతటి క్రూరత్వం దాగి ఉంటుందని బహుశా ఆ దేవుడు కూడా ఊహించి ఉండడు. ప్రేమ, పెళ్లి, ప్యాలెస్‌లు అంటూ ప్రపంచానికి ఒక ‘పిక్చర్ పర్ఫెక్ట్’ లవ్ స్టోరీని చూపించిన సియా గోయల్, నిజ జీవితంలో మాత్రం ఒక కిరాతక హంతకురాలిగా మారింది. కేతన్ విశాల్ అగర్వాల్ అనే యువకుడిని ప్రాణంగా ప్రేమిస్తున్నట్లు నటిస్తూ, నిశ్చితార్థం చేసుకుని, కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన ఆమె.. చివరకు అతడినే లోయలోకి తోసి చంపేంత దారుణానికి ఒడిగట్టింది. ఈ సమాజం తలదించుకునేలా ఆమె చేసిన ఈ నయవంచన, సోషల్ మీడియా ప్రేమల వెనుక ఉన్న భయంకరమైన నల్లని నిజాలను బయటపెట్టింది.

ఇన్‌స్టాగ్రామ్ సాక్షిగా సాగిన నటన

నిశ్చితార్థం జరిగినప్పటి నుండి సియా గోయల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కేతన్‌తో ఉన్న రొమాంటిక్ ఫోటోలు, వీడియోలతో నింపేసింది. "నా హృదయానికి ఒక ఇల్లు దొరికిన రోజు" అంటూ కేతన్‌ను ట్యాగ్ చేస్తూ కేక్ కట్ చేసిన ఫోటోలు పెట్టింది. మే నెలలో కేతన్ ఆమెకు ఒక పువ్వు ఇస్తూ హగ్ చేసుకున్న వీడియోను షేర్ చేస్తూ, "నేను నీకు నచ్చాననే విషయాన్ని నువ్వు చాలా సీరియస్‌గా తీసుకున్నావ్" అంటూ మురిసిపోతున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది. పుట్టినరోజు కౌంట్‌డౌన్ అంటూ రొమాంటిక్ సాంగ్‌కి కేతన్‌తో కలిసి డాన్స్ చేస్తూ రీల్స్ చేసింది. కానీ, అదే చేతులతో అతడిని లోయలోకి నెట్టేయాలని మనసులో ప్లాన్ చేసుకుంటూ.. ప్రపంచం ముందు ఇంతగా ఎలా నటించగలిగింది అనేది ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

ప్రేమ ముసుగులో కిరాతకం

పరిశ్రమల మీటింగ్‌లో పరిచయమైన చేతన్ చౌదరి అనే ప్రియుడితో కలిసి సియా ఈ దారుణానికి స్కెచ్ వేసింది. గడిచిన ఏడు నెలల్లో ప్రియుడితో ఏకంగా రెండు వేలకు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ, వందల గంటలు గడిపిన ఈమె.. కేతన్‌ను కేవలం ఒక అడ్డుకట్టలాగే చూసింది. పెళ్లి ఇష్టం లేకపోతే పెద్దలకు చెప్పి ఆపేయాల్సింది పోయి, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవాలని చూడటం ఆమెలోని వికృత చేష్టలకు అద్దం పడుతోంది. ఎంతో నమ్మకంగా తనతో కోటపైకి వచ్చిన కాబోయే భర్తను, ఎవరూ లేని సమయం చూసి వెనుక నుండి లోయలోకి తోసేసింది. అంతటితో ఆగకుండా, ఘోరం జరిగిన తర్వాత పోలీసుల ముందు ఏమాత్రం బాధ లేకుండా, కళ్లలో కన్నీరు కూడా రాకుండా "కాలు జారి పడిపోయాడు" అంటూ అబద్ధాలు చెప్పడం ఆమె ఎంతటి కఠిన గుండెదో చెప్తోంది.

మొదటి ప్లాన్ ఫెయిల్ అయినా వదల్లేదు

ఈమె క్రూరత్వం కేవలం కోటపైనే ఆగలేదు. అంతకుముందే బాలి ట్రిప్‌కి వెళ్లే దారిలో కేతన్ పాస్‌పోర్ట్‌ను దొంగిలించి అతని ట్రిప్ క్యాన్సిల్ చేసింది. జూన్ పద్నాలుగో తేదీన మొదటిసారి కోటపై నుండి నెట్టేసినప్పుడు కేతన్ ఒక పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడితే.. అక్కడ "పాము ఉంది" అంటూ కవర్ చేసి, అతడిని గట్టిగా కౌగిలించుకుని మళ్లీ నమ్మించింది. ఒక మనిషి తన ప్రాణాలను కాపాడుకోవడానికి అంతలా పోరాడితే, కనీసం ఆ సమయంలోనైనా ఆమె మనసు కరగలేదు.

'ప్లాన్ ఏ' ఫెయిల్ అయితే 'ప్లాన్ బి', అది కూడా ఫెయిల్ అయితే 'ప్లాన్ సి' అంటూ ఒక మనిషి ప్రాణం తీయడమే లక్ష్యంగా పెట్టుకున్న సియా గోయల్ ఉదంతం.. నమ్మకానికి వెన్నుపోటు లాంటిది. జైపూర్‌లో పదిహేను కోట్ల రూపాయలతో జరగాల్సిన పెళ్లి వేడుక.. సియా గోయల్ కపట ప్రేమ, రాక్షస బుద్ధి వల్ల చివరకు శ్మశాన వైరాగ్యంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ప్రియుడితో కలిసి జైలు పాలైన ఈమెకు చట్టం ఎలాంటి కఠిన శిక్ష విధిస్తుందో చూడాలి.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story