Viral: స్కిల్డ్ దొంగరా మావ.! ఇలా జాబ్ పట్టాడు.. మరుసటి రోజే ల్యాప్‌టాప్‌తో ఉడాయించాడు..

Viral: ఉద్యోగంలో చేరాల్సిన మొదటి రోజే ఓ అభ్యర్థి కంపెనీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఆఫీస్ పని కోసం కంపెనీ ఇచ్చిన ఖరీదైన మ్యాక్ బుక్‌తో..

Ravi
By Ravi
Updated on: 4 Jun 2026 6:39 AM IST
Viral
X

Viral: స్కిల్డ్ దొంగరా మావ.! ఇలా జాబ్ పట్టాడు.. మరుసటి రోజే ల్యాప్‌టాప్‌తో ఉడాయించాడు..

Viral: కష్టపడి ఇంటర్వ్యూలు పాసయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఎవరైనా ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడు ఆఫీస్‌లో అడుగుపెడదామా, కెరీర్ ఎలా ప్రారంభించాలా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. కానీ, ఓ అభ్యర్థి మాత్రం తనను నమ్మి ఉద్యోగం ఇచ్చిన కంపెనీకే కళ్లుగప్పి భారీ షాక్ ఇచ్చాడు. ఉద్యోగంలో చేరాల్సిన మొదటి రోజే, కంపెనీ అతనికి పని చేసుకోవడానికి ఇచ్చిన ఖరీదైన యాపిల్ మ్యాక్ బుక్ తీసుకుని రాత్రికి రాత్రే పరారయ్యాడు. ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.

ఈ హైటెక్ మోసం వివరాల్లోకి వెళితే.. ఉబెర్ సంస్థ పలు దశల ఇంటర్వ్యూలు నిర్వహించి ఒక అభ్యర్థిని ఎంపిక చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఆఫీస్ అవసరాల కోసం అతనికి జాయినింగ్ కంటే ముందే వెల్కమ్ కిట్‌తో పాటు ఒక ఖరీదైన ల్యాప్‌టాప్‌ను పంపించింది. తీరా మొదటి రోజు లాగిన్ అవ్వాల్సిన సమయానికి ఆ అభ్యర్థి ఎంతకీ ఆన్‌లైన్‌లోకి రాలేదు. ఆందోళన చెందిన హెచ్ఆర్ బృందం అతన్ని సంప్రదించడానికి ప్రయత్నించగా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సరే, లింక్డ్‌ఇన్ లేదా ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా మెసేజ్ చేద్దామని చూస్తే, అప్పటికే తన డిజిటల్ ఉనికిని పూర్తిగా ఆన్‌లైన్ నుంచి చెరిపేసి, అన్ని అకౌంట్స్ డిలీట్ చేసి ఎవరికీ చిక్కకుండా మాయమయ్యాడు. ఆ ల్యాప్‌టాప్ నొక్కేయాలనే పక్కా ప్లాన్‌తోనే ఈ మోసానికి పాల్పడినట్లు కంపెనీకి అప్పుడు అసలు విషయం అర్థమైంది.

ఈ షాకింగ్ సంఘటనను ఆ కంపెనీకి చెందిన వారు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఇదెక్కడి విడ్డూరం అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం, ఆన్‌లైన్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియల్లో కంపెనీలు మరింత అప్రమత్తంగా ఉండాలని, సరైన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా విలువైన గ్యాడ్జెట్స్ ముందే పంపించకూడదని సలహాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా, డిజిటల్ యుగంలో ఇలాంటి హైటెక్ దొంగలు కార్పొరేట్ కంపెనీలకు సరికొత్త సవాళ్లు విసురుతున్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.






Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story