Viral News : రూ.1,285 ట్రిప్‌కు రూ.5,662 బిల్లు.. ఇదేం లెక్క.?

దేశ రాజధాని ఢిల్లీలో ఓలా క్యాబ్ వినియోగదారులకు ఊహించని షాకింగ్ అనుభవం ఎదురైంది. సాధారణ ప్రయాణం కోసం క్యాబ్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు చివరికి

G Krishna
Published on: 29 Aug 2026 11:48 AM IST
Ola
X

Ola

దేశ రాజధాని ఢిల్లీలో ఓలా క్యాబ్ వినియోగదారులకు ఊహించని షాకింగ్ అనుభవం ఎదురైంది. సాధారణ ప్రయాణం కోసం క్యాబ్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు చివరికి దాదాపు నాలుగు రెట్లు అదనంగా బిల్లు రావడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బుకింగ్ సమయంలో చూపించిన అంచనా ఛార్జీకి, ప్రయాణం ముగిశాక వచ్చిన ఆఖరి బిల్లుకు అసలు సంబంధమే లేకపోవడంతో ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగింది?

ఢిల్లీకి వచ్చిన కొందరు ప్రయాణికులు ఉదయం 10 గంటల సమయంలో మహిపాల్‌పూర్‌లోని ఒక హోటల్ నుంచి '6 గంటలు - 60 కిలోమీటర్ల' ప్యాకేజీ కింద ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. యశోభూమిలో జరుగుతున్న ఒక ఎగ్జిబిషన్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన వారు, మధ్యాహ్నం 3:45 గంటల వరకు అక్కడే గడిపారు. ఆ తర్వాత క్యాబ్‌లో నేరుగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రయాణం ప్రారంభంలో యాప్‌లో ఈ ట్రిప్ అంచనా ధర రూ.1,285 గా చూపించింది.

షాక్ ఇచ్చిన ఫైనల్ బిల్లు

విమానాశ్రయానికి చేరుకుని ట్రిప్ ముగించగానే ఓలా యాప్‌లో వచ్చిన బిల్లు చూసి బాధితులు షాక్ అయ్యారు. వారు తిరిగిన దూరానికి అదనంగా ఏకంగా 240.5 కిలోమీటర్ల ప్రయాణం జరిగినట్లు బిల్లులో నమోదైంది. దీనికి టోల్ ఛార్జీలు, ఇతర రుసుములు కూడా తోడవడంతో మొత్తం బిల్లు రూ. 5,662కి చేరింది. తాము ప్రయాణించిన స్వల్ప దూరానికి ఏకంగా 250 కిలోమీటర్ల మేర అదనపు రీడింగ్ ఎలా వచ్చిందో అర్థం కాక ఆవేదన చెందిన ప్రయాణికులు, ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

స్పందించని కస్టమర్ కేర్.. నెటిజన్ల అనుమానాలు

ఈ అనుమానాస్పద బిల్లుపై తక్షణమే వివరణ కోరేందుకు ఓలా కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ, వారాంతం (వీకెండ్) కావడంతో కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ప్రయాణికులు తెలిపారు. వేరే దారి లేకపోవడంతో వారు ఈ అంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రయాణికులు ఎగ్జిబిషన్‌లో ఉన్న సమయంలో డ్రైవర్ క్యాబ్‌ను తన వ్యక్తిగత పనుల కోసం తిప్పి ఉంటాడని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. యాప్ సాంకేతిక లోపం లేదా డ్రైవర్ తప్పును నిరూపించేందుకు ప్రయాణికులు తమ ఫోన్ 'లొకేషన్ హిస్టరీ' ని ఆధారంగా చూపాలని పలువురు సూచించారు. కాగా, ఈ ఘటన అంతా ప్రయాణికులు సోషల్ మీడియాలో చేసిన ఆరోపణల ద్వారానే వెలుగులోకి వచ్చింది. దీనిపై ఓలా యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన లేదా స్పష్టత రాలేదు. తమకు జరిగిన ఈ అన్యాయంపై సంస్థ తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story