Viral News: అమెరికాలో బెండకాయ ధర చూస్తే మైండ్ బ్లాకే.. కిలో అన్ని వేలా?

Viral News: అమెరికాలో బెండకాయ ధర చూసి ఒక భారతీయుడు అవాక్కయ్యాడు. ఇండియాలో అత్యంత చౌకగా దొరికే బెండకాయ, అక్కడ కిలో రూ. 7,200 పలుకుతుండటంతో దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Arun Chilukuri
Published on: 7 Jun 2026 12:14 PM IST
Viral News
X

Viral News: అమెరికాలో బెండకాయ ధర చూస్తే మైండ్ బ్లాకే.. కిలో అన్ని వేలా?

Viral News: సాధారణంగా మనం కూరగాయలు కొనడానికి మార్కెట్‌కు వెళ్లినప్పుడు రూపాయి, రెండు రూపాయల తేడాల గురించే చర్చిస్తాం. కానీ, అమెరికాలో ఓ భారతీయుడు బెండకాయ (Okra) ధర చూసి అవాక్కై, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. భారతదేశంలో అత్యంత చౌకగా, సామాన్యుడికి అందుబాటులో దొరికే బెండకాయకు అమెరికాలో ఉన్న ధర చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లిన ఒక భారతీయ యువకుడు అక్కడ ప్యాక్ చేసి అమ్మకానికి పెట్టిన పచ్చి బెండకాయలను చూశాడు. అక్కడ పచ్చి బెండకాయల ధర ఒక పౌండ్‌కు దాదాపు 40 డాలర్లుగా ఉంది. దీన్ని భారత కరెన్సీలోకి మార్చి, కిలో చొప్పున లెక్కిస్తే సుమారు రూ. 7,200 అవుతుందని తెలిసి అతను తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యాడు.

అంతేకాదు, అదే సూపర్‌ మార్కెట్‌లో మసాలాలు దట్టించి, డీప్ ఫ్రై చేసిన బెండకాయలను ఒక స్నాక్‌గా అమ్ముతున్నారు. "చూడండి, ఇండియాలో మనం రోజువారీగా కూర చేసుకునే బెండకాయలు అమెరికాలో స్నాక్‌గా దొరుకుతున్నాయి. మసాలాలు వేసి, బాగా వేయించి ప్యాక్ చేసిన దీని ధర 6.50 డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 600. మరి పరిమాణం ఎంతో తెలుసా? కేవలం 85 గ్రాములు మాత్రమే," అంటూ ఆ యువకుడు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. "మన దగ్గర రోజూ తినే సాధారణ బెండకాయ, ఇక్కడ లేస్ ప్యాకెట్ కంటే ఖరీదైన ప్రీమియం స్నాక్" అని అతను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు క్యాప్షన్ జతచేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇప్పటివరకు 2.48 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా చమత్కరిస్తున్నారు. "అమెరికన్ల ఆదాయం ఎక్కువ కాబట్టి వారికి ఇది పెద్ద ఖరీదేమీ కాదు" అని ఒకరు కామెంట్ చేయగా.. "ఈ మసాలాలతో కలిపినా మన భారత్‌లో రూ. 20 కి మించి పెట్టం. అక్కడ ధనవంతులు కూడా కొనలేరు" అని మరొకరు రాసుకొచ్చారు. మరో యూజర్ సరదాగా స్పందిస్తూ "మనం ఇండియా నుంచి అమెరికాకు బెండకాయల ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ వ్యాపారం మొదలుపెడితే బాగుంటుంది" అని సలహా ఇచ్చాడు. విదేశాల్లో సరఫరా తక్కువగా ఉండటం, దిగుమతి ఖర్చులు, ప్యాకేజింగ్ వ్యయం వంటి కారణాల వల్లే భారతీయ కూరగాయలు అక్కడ ప్రత్యేక ఉత్పత్తుల కేటగిరీ కిందకు వచ్చి ఇంత భారీ ధరలకు అమ్ముడవుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story