Odisha School Textbooks : న్యూటన్ ఒక 'పైలట్'.. హంపి గుడి 'కోణార్క్'!.. పాఠ్యపుస్తకాల్లో అద్భుతాలు.!

Odisha School Textbooks : పిల్లలకు చదువు నేర్పించాల్సిన ప్రభుత్వ పాఠ్యపుస్తకాలే ఇప్పుడు సరికొత్త 'జ్ఞానాన్ని' పంచుతున్నాయి. ఒడిశా ప్రభుత్వ పాఠశాలల్లో...

G Krishna
Published on: 19 Jun 2026 1:38 PM IST
Odisha-School-Textbooks
X

Odisha-School-Textbooks

Odisha School Textbooks : పిల్లలకు చదువు నేర్పించాల్సిన ప్రభుత్వ పాఠ్యపుస్తకాలే ఇప్పుడు సరికొత్త 'జ్ఞానాన్ని' పంచుతున్నాయి. ఒడిశా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ముద్రించిన కొత్త పుస్తకాల్లో ఏకంగా 1,678 తప్పులు దొర్లాయి. జాతీయ విద్యా విధానం (NEP 2020) ప్రకారం, ఒడిశా కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ 2025 కింద అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన ఈ పుస్తకాలు స్కూళ్లకు చేరగానే టీచర్ల మైండ్ బ్లాక్ అయింది. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ రంగంలోకి దిగి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ముగ్గురు సభ్యుల కమిటీని వేసి దర్యాప్తుకు ఆదేశించారు. పుస్తకాల్లో దొర్లిన ఆ 'అద్భుతమైన' ఆణిముత్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

న్యూటన్ ఆకాశంలో విమానం నడిపారట..

ఈ పుస్తకాల్లో దొరికిన అన్నింటికంటే అతిపెద్ద 'ఆవిష్కరణ' ఏంటంటే, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టిన జగద్విఖ్యాత శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్‌ను సైంటిస్ట్ అనడానికి బదులు ప్రపంచంలోనే అత్యంత గొప్ప పైలట్ అని ముద్రించేశారు. ఆపిల్ పండు కింద పడటం చూసి గ్రావిటీని కనిపెట్టిన న్యూటన్ ని ఏకంగా విమానం కాక్‌పిట్‌లో కూర్చోబెట్టేసిన ఘనత మన ఒడిశా విద్యాశాఖకే దక్కింది. ఈ ఒక్క తప్పు చాలు పుస్తకాలు ఎంత అద్భుతంగా తయారయ్యాయో చెప్పడానికి.

కర్ణాటక అసెంబ్లీ.. ఒడిశాకు షిఫ్ట్ అయింది..

భౌగోళిక, చారిత్రక అంశాల్లోనూ మన పుస్తక తయారీదారులు సరికొత్త సృష్టి చేశారు. కర్ణాటక శాసనసభ (విధానసౌధ) ఫోటోను వేసి కింద ఒడిశా శాసనసభ అని రాశారు. అలాగే కర్ణాటకలోని ప్రసిద్ధ హంపి ఆలయ కాంప్లెక్స్ ఫోటోను ప్రింట్ చేసి, దాని కింద ఒడిశా గర్వకారణమైన కోణార్క్ సూర్య దేవాలయం అని బోర్డు తగిలించారు. బహుశా రాష్ట్రాలు వేరైనా అంతా ఒక్కటే అనే విశాల జాతీయ భావంతో ఎడిటర్లు ఈ వినూత్న ప్రయోగానికి తెరలేపినట్లున్నారు.

8వ తరగతి పుస్తకాల్లో 'తప్పుల' సెంచరీ..

మొత్తం తప్పులలో ఒక్క 8వ తరగతి పుస్తకాల్లోనే అత్యధికంగా 705 తప్పులు దొర్లడం విశేషం. సైన్స్, జాగ్రఫీ సబ్జెక్టులను వీరు తిరగరాసిన విధానం చూస్తే ఎవరికైనా పిచ్చెక్కడం ఖాయం. ఒడిశాలోనే ఉండే ప్రసిద్ధ నియమగిరి కొండలు రాత్రికి రాత్రే జార్ఖండ్ రాష్ట్రానికి వలస వెళ్ళిపోగా, గంజాం జిల్లాలోని బ్రహ్మపుర అనే నగరాన్ని ఏకంగా ఒక కొత్త జిల్లాగా ప్రమోట్ చేసేశారు. ఇక వరి మొక్కను గోధుమగా, గోధుమను వరిగా మార్చి రైతులకు కూడా షాక్ ఇచ్చారు. సైన్స్ పుస్తకంలో ఉష్ణోగ్రతకు పీడనానికి తేడా తెలియకుండా వాడేయడమే కాకుండా, ఫుడ్ వెబ్ అనడానికి బదులు ఫుడ్ సైకిల్ అని, ఈక్వినాక్స్ అనడానికి బదులు ఈక్వేటర్ అని రాసి కొత్త శాస్త్రాన్ని కనిపెట్టారు.

టీచర్లకు హోంవర్క్.. తప్పుల లిస్టుతో క్లాసులు..

పుస్తకాలు ఆల్రెడీ అచ్చయిపోయి పిల్లల చేతుల్లోకి చేరిపోవడంతో, ఇప్పుడు విద్యాశాఖ స్కూళ్లకు ఒక పెద్ద తప్పుల సవరణ పట్టికను పంపింది. క్లాసు రూములో పాఠాలు చెప్పేటప్పుడు పుస్తకంలో ఉన్నది కాకుండా, ఈ లిస్టు చూసి నిజాలు చెప్పాలని టీచర్లను కోరింది. అంటే పిల్లలు పుస్తకంలోని తప్పును చూసి, టీచర్ చెప్పే ఒరిజినల్ ఆన్సర్‌ను నమ్మాలన్నమాట. ఇంతమంది అధికారులు, నిపుణులు, క్వాలిటీ చెకింగ్ టీమ్‌లు ఉండి కూడా కళ్ళు మూసుకుని ఈ పుస్తకాలను ఎలా ప్రింట్ చేశారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా ఈ పుస్తకాలు చదివితే భవిష్యత్తులో మన దేశానికి ఎలాంటి 'పైలట్లు' వస్తారోనని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story