Mysuru: రోడ్డుపై మూత్ర విసర్జన: షాక్ ట్రీట్‌మెంట్ మామూలుగా లేదుగా.. ఐడియా అదుర్స్

Mysuru: బహిరంగంగా మూత్ర విసర్జన చేసే వారికి బుద్ధి చెప్పేందుకు అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

Srinivas Rao
Published on: 8 May 2026 3:36 PM IST
Mysuru
X

Mysuru

Mysuru: బహిరంగంగా మూత్ర విసర్జన చేసే వారికి బుద్ధి చెప్పేందుకు అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. జరిమానాలు విధిస్తారు, గోడల మీద దేవుళ్ల బొమ్మలు వేస్తారు.. అయినా మార్పు రాదు. కానీ, మైసూర్ మున్సిపల్ అధికారులు వేసిన ఒక ప్లాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిక్షల కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యమని భావించిన అధికారులు చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం నెటిజన్లను ఫిదా చేస్తోంది.

పనికానిచ్చేద్దామంటే ఎదురుగా ‘నువ్వే’ కనిపిస్తావు!

సాధారణంగా గోడల మీద 'ఇక్కడ మూత్రం పోయరాదు' అని రాస్తే ఎవరూ పట్టించుకోరు. అందుకే మైసూర్ సిటీ కార్పొరేషన్ అధికారులు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. నగరంలోని సబర్బన్ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఒక గోడను ప్రజలు ఎప్పుడూ అపరిభ్రం చేసేవారు. ఎన్నిసార్లు శుభ్రం చేసినా పరిస్థితి మారలేదు. దీంతో అధికారులు ఆ గోడకు నిలువెత్తు అద్దాలను అమర్చారు. ఎవరైనా అక్కడ మూత్ర విసర్జన చేయడానికి వెళ్తే, ఎదురుగా అద్దంలో వారి రూపమే వారికి కనిపిస్తుంది. పబ్లిక్ ప్లేస్‌లో తనను తాను అలా చూసుకోవడం వల్ల కలిగే సిగ్గు, మొహమాటమే వారిని ఆ పని చేయకుండా అడ్డుకుంటుందని అధికారులు భావించారు.

రాత్రి వేళ కూడా పనిచేసేలా ఎల్ఈడీ వెలుతురు

ఈ అద్దాల ప్రయోగం కేవలం పగలు మాత్రమే కాదు, రాత్రి పూట కూడా పనిచేసేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అద్దాల పైభాగంలో ప్రత్యేకమైన ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల చీకటిలో కూడా అద్దాలు మెరుస్తూ కనిపిస్తాయి. ఈ వినూత్న ఆలోచనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ చక్కర్లు కొడుతోంది. "శిక్ష విధిస్తాం అని బోర్డులు పెడితే ఎవరూ భయపడరు.. ఇలా సెల్ఫ్ అవేర్నెస్ కలిగిస్తేనే మార్పు వస్తుంది" అని ఈ వీడియో తీసిన వ్యక్తి అభిప్రాయపడ్డారు.

స్వచ్ఛ భారత్‌లో భాగంగా సరికొత్త ప్రయోగాలు

మైసూర్ నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో భాగంగా అధికారులు ఇలాంటి విభిన్నమైన ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. కఠినమైన చట్టాల కంటే సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఈ అద్దాల ఏర్పాటు ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు. గతంలో లండన్ వంటి నగరాల్లో ఇలాంటి ప్రయోగాలు విజయవంతం కాగా, ఇప్పుడు మన దేశంలో కూడా అధికారులు అవే పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ ఐడియా షాకింగ్ గురూ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ 'అద్దాల ప్లాన్' ఇతర నగరాలకు కూడా పాకుతుందో లేదో చూడాలి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story