Viral News: మసిపట్టేసిన షర్ట్‌కు రూ. 80 వేలా.! ఇది టూ మచ్‌రా.. దెబ్బకు బిత్తరపోయిన నెటిజన్లు..

Viral News: మింత్రా యాప్‌లో మురికిగా ఉన్న డిజైనర్ షర్ట్ ధర రూ. 80 వేలు ఉండటంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Ravi
By Ravi
Published on: 3 Sept 2026 6:58 PM IST
Viral News
X

Viral News: మసిపట్టేసిన షర్ట్‌కు రూ. 80 వేలా.! ఇది టూ మచ్‌రా.. దెబ్బకు బిత్తరపోయిన నెటిజన్లు..

Viral News: ఆధునిక కాలంలో ఫ్యాషన్ ట్రెండ్స్ క్షణక్షణానికి మారిపోతున్నాయి. కొత్త రకం దుస్తులు మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఉన్న ఫ్యాషన్ బ్రాండ్ అయినా క్షణాల్లో మన ముందుకు వచ్చేస్తోంది. అయితే కొన్నిసార్లు ప్రసిద్ధ బ్రాండ్స్ ప్రవేశపెట్టే విచిత్రమైన డిజైన్లు సాధారణ ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేస్తుంటాయి. చిరిగిన ప్యాంట్లు, మురికిగా కనిపించే బూట్లు మార్కెట్లో వేల రూపాయలకు అమ్ముడవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఒక విచిత్రమైన షర్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ మింత్రా యాప్‌లో దర్శనమిచ్చిన ఓ డిజైనర్ షర్ట్ ధర, దాని రూపం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

మింత్రా యాప్‌లో ఆర్13 అనే ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు చెందిన రెడ్ ఓవర్‌సైజ్డ్ చెక్స్ షర్ట్ ఒకటి అమ్మకానికి పెట్టారు. ఫ్యాషన్ ప్రపంచంలో డిజైనర్ దుస్తులకు భారీ ధరలు ఉండటం సాధారణమే అయినా ఈ షర్ట్ ధర చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. యాప్‌లో ఈ షర్ట్ అసలు ధర ఏకంగా రూ. 1.14 లక్షలుగా నమోదు చేశారు. దీనిపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన తర్వాత కూడా ప్రస్తుతం రూ. 80 వేలు ధరకు అందుబాటులో ఉంది. కేవలం ఒక షర్ట్ కోసం ఏకంగా రూ. లక్ష వరకు వెచ్చించాలా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అంత భారీ ధర పెట్టి కొనే షర్ట్ కనీసం చూడటానికైనా బాగుందా అంటే అదీ లేదు. ఎన్నో ఏళ్లుగా వాడి పడేసిన పాత మురికి బట్టలా, మసిగుడ్డలా ఆ షర్ట్ డిజైన్ ఉండటం అందరినీ తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఎక్కడెక్కడో నూనె మరకలు అంటినట్లు, అంచులు చిరిగిపోయినట్లు అత్యంత దారుణంగా ఆ డిజైనర్ దుస్తులు కనిపిస్తున్నాయి.

ఈ మురికి షర్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత దారుణంగా ఉన్న బట్టలకు రూ. 80 వేలు ఖర్చు చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి మసిగుడ్డలు మన ఇళ్లలోని కిచెన్‌లో, బైక్ మెకానిక్ షాపుల్లో రోజూ ఉచితంగానే దొరుకుతాయని సెటైర్లు వేస్తున్నారు. ఇంట్లో పాతబడిన బట్టలను ఫ్యాషన్ పేరుతో లక్షల రూపాయలకు అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహుశా మెకానిక్ షెడ్‌లో దొంగిలించిన షర్ట్ అయి ఉంటుందని కొందరు ఆటపట్టిస్తున్నారు. ఈ విచిత్రమైన డిజైన్ పట్ల మింత్రా యాప్‌ను సైతం ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇలాంటి ప్రయోగాలు కొత్తేమీ కాదు. డిస్ట్రెస్డ్ ఫ్యాషన్ పేరుతో మురికిగా, చిరిగిపోయినట్లు ఉండే దుస్తులను రూపొందించడం ఒక ట్రెండ్. గతంలో బలెన్సియాగా లాంటి అంతర్జాతీయ బ్రాండ్లు పూర్తిగా పాడైపోయినట్లు కనిపించే షూస్‌ను లక్షల రూపాయలకు విక్రయించాయి. గుస్సీ లాంటి బ్రాండ్లు సైతం మురికిగా ఉండే ప్యాంట్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ధనవంతులు, సెలబ్రిటీలు ఇటువంటి భిన్నమైన దుస్తులు ధరించడానికి ఆసక్తి చూపుతుంటారు. వారి అభిరుచికి తగ్గట్టుగానే డిజైనర్లు ఇలాంటి లుక్ దుస్తులను ప్రత్యేకంగా రూపొందిస్తుంటారు. ఆ డిజైన్ కోసం వారు వాడే మెటీరియల్, బ్రాండ్ వాల్యూ కారణంగా వీటికి ఇంత భారీ స్థాయిలో ధర నిర్ణయిస్తారు. సామాన్యులకు ఇవి పిచ్చి చేష్టల్లా కనిపించినా ఫ్యాషన్ ప్రియులకు మాత్రం ఇవి అత్యంత ఆకర్షణీయంగా అనిపిస్తాయి. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ మసిగుడ్డ డిజైన్ షర్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారి అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story