Medical Negligence : బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వలేదని సర్జరీ చేసిన కాలు విరిచిన వైద్యుడు..!
Medical Negligence : ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యం ఎంత అద్భుతంగా అందుతుందో చెప్పడానికి ఒక తాజా ఉదాహరణ వెలుగుచూసింది..
Viral Story
Medical Negligence : ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యం ఎంత అద్భుతంగా అందుతుందో చెప్పడానికి ఒక తాజా ఉదాహరణ వెలుగుచూసింది. రేష్మా అనే ఒక వితంతువు, తన 14 ఏళ్ల మానసిక వికలాంగురాలైన కుమార్తెను తీసుకుని కలెక్టరేట్ మెట్లెక్కింది. జిల్లా ఆరోగ్య శాఖ, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల అసమాన ప్రతిభను చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ఉచితంగా వైద్యం చేసి పుణ్యం కట్టుకోవడం కంటే.. పేదవాళ్ల వద్ద కూడా నైపుణ్యంగా డబ్బులు ఎలా వసూలు చేయాలి, ఆపరేషన్ సక్సెస్ అయినా కాలును ఎలా విరగ్గొట్టాలి అనే సరికొత్త వైద్య విధానాన్ని ఇక్కడి డాక్టర్లు ప్రదర్శించారు.
కలెక్టర్ ఆర్డర్ వేస్తే ఎంత.. మా రేటు మారదుగా..
బాధిత తల్లి రేష్మా కథనం ప్రకారం.. సుమారు ఒకటిన్నర నెల క్రితం ఆమె కుమార్తె కుడి కాలు ఎముకకు ఆపరేషన్ చేయడానికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఏకంగా రూ.25,000 డిమాండ్ చేశారు. తాను వితంతువునని, అంత డబ్బు లేదని ఆ తల్లి ఎంత బ్రతిమిలాడినా ధర్మం తెలియని ఆసుపత్రి సిబ్బంది అసలు వైద్యమే చేయమని ఖరాఖండిగా చెప్పారు. దీంతో ఆమె జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి మొరపెట్టుకుంది. కలెక్టర్ వెంటనే స్పందించి, ఆ బాలికకు ఉచితంగా వైద్యం అందించాలని ముఖ్య వైద్యాధికారిని ఆదేశించారు. అయితే, కలెక్టర్ ఆర్డర్లు కలెక్టరేట్ లోనే పనిచేస్తాయి కానీ ఆసుపత్రిలో కాదని నిరూపిస్తూ.. ఆసుపత్రి సిబ్బంది ఆ తల్లి నుంచి బలవంతంగా రూ.8,000 నొక్కేశారు. మిగిలిన డబ్బులు ఇవ్వకపోతే నెక్స్ట్ సీన్ దారుణంగా ఉంటుందని బెదిరించారు.
డాక్టర్.. అది రోగి కాలు, ఇనుప కడ్డీ కాదు
ఆపరేషన్ తర్వాత చెకప్ కోసం రావాలని, అప్పుడు మోకాలు వంచేలా చేస్తామని డాక్టర్లు చెప్పారు. ఆ తల్లి నమ్మకంతో కుమార్తెను తీసుకుని ఆసుపత్రికి వెళ్లగా.. ఆపరేషన్ చేసిన డాక్టర్ చతుర్వేది తన కండరాల బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. ఆ బాలిక మోకాలిని పట్టుకుని బలవంతంగా ఒక్కసారిగా వంచేసాడు. ఆ దెబ్బకు ఆ అమాయక బాలిక నొప్పితో కేకలు వేసింది, లోపల ఎముక టప్ మని విరిగిన శబ్దం కూడా వచ్చింది. అయినా సరే, ఆ డాక్టర్ ఏమాత్రం చలించకుండా వారిద్దరినీ అక్కడి నుండి తరిమేశాడు. ఆ తర్వాత బయట ఎక్స్-రే తీయించి చూస్తే.. సాక్షాత్తూ ఆపరేషన్ చేసిన కాలు ఎముకే విరిగిపోయి దర్శనమిచ్చింది. ఈ డాక్టర్ల పరాక్రమంపై పెద్ద అధికారులకు ఫిర్యాదు చేసినా దొందు దొందే అన్నట్లు ఎవరూ పట్టించుకోలేదు.
దర్యాప్తు ప్రారంభం.. లంచం తీసుకున్నట్లు సాక్ష్యాలు కావాలట
ఈ ఉదంతంపై ముజఫర్‌నగర్ ముఖ్య వైద్యాధికారి సునీల్ తేవాటియా స్పందించారు. రెండో పక్షం (అంటే కాలు విరగ్గొట్టిన డాక్టర్, లంచం తీసుకున్న సిబ్బంది) వాదన వినకుండా ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం చాలా తొందరపాటు అవుతుందని ఆయన సెలవిచ్చారు. అయితే, ఈ పూర్తి వ్యవహారంపై కంటితుడుపు చర్యగా దర్యాప్తు జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విచారణలో గనుక ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం, లంచగొండితనం రుజువైతే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అప్పటివరకు ఆ బాలిక విరిగిన కాలుతోనే వైద్యుల గొప్పదనాన్ని తలుచుకుంటూ ఉండక తప్పదు.




