Viral Video: వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా అస్సలు తగ్గట్లేదు!
Viral Video: ముంబై లోకల్ ట్రైన్ ముందు ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి రైలు పట్టాలపై నడిచిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video: వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా అస్సలు తగ్గట్లేదు!
Viral Video: సాధారణంగా రైలు హారన్ సౌండ్ వినపడగానే ఎవరికైనా గుండెలు ఝల్లుమంటాయి. ఎంతటివారైనా సరే భయంతో రైలు పట్టాలకు చాలా దూరంగా జరిగిపోతారు. కానీ మహారాష్ట్రలోని ముంబై నగరంలో మాత్రం ఓ వ్యక్తి ఏకంగా రైలు ముందే.. అది కూడా పట్టాలపై అత్యంత తాపీగా నడుస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. లోకో పైలట్ ఎంత గట్టిగా హారన్ కొడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా అతడు చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ముంబై నగరంలోని ఓ రైల్వే స్టేషన్ నుంచి లోకల్ ట్రైన్ బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. రైలు కొద్ది దూరం వెళ్లగానే పట్టాలపై ఓ వ్యక్తి నడుస్తూ కనిపించాడు. అది గమనించిన లోకో పైలట్ అప్రమత్తమై వెంటనే రైలు వేగాన్ని తగ్గించాడు. ఆ వ్యక్తిని పట్టాల పైనుంచి పక్కకు తప్పుకోవాలంటూ నిరంతరాయంగా హారన్ కొడుతూ సంకేతాలు ఇచ్చాడు. అయితే, ఆ వ్యక్తిలో ఏమాత్రం చలనం లేదు. వెనకాలే రైలు వస్తున్నా, హారన్ మోత మోగుతున్నా దర్జాగా నడుస్తూనే ఉన్నాడు.
ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆశ్చర్యంతో నోర్లు వెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. కొంతమంది ప్రయాణికులు ఈ వింత దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్‌లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.
నెటిజన్ల ఫన్నీ కామెంట్లు:
ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
"ఆ రోజు ఆ రైలు ఎందుకు ఆలస్యమైందో నాకు ఇప్పుడు అర్థమైంది" అని ఒకరు కామెంట్ చేయగా.."అది బోరివలి వెళ్లే ట్రైన్, ఆ సమయంలో నేను కూడా అదే రైలులో ఉన్నాను" అని మరొకరు చెప్పుకొచ్చారు. "జీవితంలో ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే చాలు ఎక్కడైనా బతికేయొచ్చు" అని కొందరు, "అతడు బాగా మందు తాగి ఉన్నట్టున్నాడు.. లేదంటే ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడా?" అని మరికొందరు అభిప్రాయపడ్డారు.




