Viral : రూ.72 లక్షల భారీ ప్యాకేజీ ఇస్తామన్న వద్దన్న టెక్కీ.. రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే?

Viral : వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం లేకపోవడం, సరైన లీవ్ పాలసీ లేకపోవడంతో మనీష్ అనే టెక్కీ రూ.72 లక్షల భారీ ప్యాకేజీ జాబ్ ఆఫర్‌ను తిరస్కరించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

CR Reddy
Published on: 2 Jun 2026 7:54 AM IST
Job Offer Rejected
X

 Job Offer Rejected

Viral : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచంలో వర్కహోలిక్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి రోజుల్లో ఉద్యోగం, జీతం కోసం యువత ఎంతటి ఒత్తిడినైనా భరించడానికి సిద్ధపడుతోంది. కానీ ఒక టెక్కీ మాత్రం ఏకంగా రూ.72 లక్షల వార్షిక ప్యాకేజీ ఆఫర్‌ను కాలదన్ని అందరినీ ఆశ్చర్యపరిచాడు. జీవితంలో కేవలం డబ్బే ముఖ్యం కాదు.. మానసిక ప్రశాంతత, వ్యక్తిగత ప్రాధాన్యతలు కూడా ముఖ్యమేనని నిరూపించాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో సాఫ్ట్‌వేర్ డెవలపర్ రాగిణి పాండే తన స్నేహితుడికి సంబంధించిన ఈ క్రేజీ స్టోరీని షేర్ చేయడంతో ఇది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సాఫ్ట్‌వేర్ డెవలపర్ అయిన రాగిణి పాండే తన స్నేహితుడు మనీష్ జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఎక్స్ వేదికగా పంచుకుంది. తన స్నేహితుడికి ఒక ప్రముఖ కంపెనీ నుంచి రూ.72 లక్షల భారీ ప్యాకేజీతో జాబ్ ఆఫర్ వచ్చిందని.. కానీ అతను ఆ ఆఫర్‌ను నిర్మొహమాటంగా తిరస్కరించాడని పేర్కొంది. చాలా మందికి అంతటి భారీ ప్యాకేజీ అనేది ఒక కలలాంటిదని.. అలాంటిది మనీష్ తన వ్యక్తిగత ప్రాధాన్యతలకు, విలువలకు ప్రాణం ఇచ్చి ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడని తెలిపింది. మనీష్ సదరు కంపెనీ హెచ్ఆర్కు పంపిన రిజెక్షన్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను కూడా రాగిణి షేర్ చేసింది.

మనీష్ అంత పెద్ద మొత్తాన్ని ఎందుకు రిజెక్ట్ చేశాడనే దానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. సదరు కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ లేదు. వారంలో 5 రోజులు కచ్చితంగా ఆఫీసుకే వచ్చి పని చేయాలనే నిబంధన పెట్టారు. దీనితో పాటు ఉద్యోగుల కోసం కంపెనీ దగ్గర ఎలాంటి సరైన లీవ్ పాలసీ కూడా లేదు. కొత్త నగరానికి మారాల్సి వస్తున్నా సరే కంపెనీ ఎలాంటి రీలొకేషన్ బోనస్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ఈ ఉద్యోగంలో బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. కానీ దానికి బదులుగా తన పాత జీతంపై కేవలం 25 శాతం మాత్రమే హైక్ ఇస్తున్నారని మనీష్ గుర్తించాడు. కొత్త నగరంలో ఉండటానికి అయ్యే జీవన వ్యయంతో పోలిస్తే ఆ కంపెనీ ఇచ్చే పెంపు చాలా తక్కువని లెక్కగట్టాడు. అందుకే మనీష్ సదరు హెచ్ఆర్‌కు చాలా మర్యాదపూర్వకంగా రిప్లై ఇచ్చాడు.

మనీష్ తన రిజెక్షన్ మెసేజ్‌లో ఇలా రాసుకొచ్చాడు.. "నేను నా కెరీర్ ప్రారంభంలో ఉండి ఉంటే బహుశా ఈ ఆఫర్‌ను కళ్లు మూసుకుని అంగీకరించేవాడిని. కానీ నా జీవితంలో ఈ దశలో ఈ కాంట్రాక్ట్ ఇరుపక్షాలకు సమానంగా కాకుండా.. కేవలం కంపెనీ వైపే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. అక్కడ ఉండే ఖర్చులు, మిగిలిన విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ డీల్ నా జీవితానికి ఏమాత్రం సరిపోదు" అని స్పష్టం చేశాడు. ఇంత పెద్ద ఆఫర్ వదులుకున్నా సరే మనీష్ లో ఎలాంటి బాధ లేదా పశ్చాత్తాపం లేకపోవడం చూసి రాగిణి ఆశ్చర్యపోయింది.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియా యూజర్లు రెండు గ్రూపులుగా విడిపోయి కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. "మీ ఫ్రెండ్ చాలా పెద్ద తప్పు చేశాడు. హెచ్ఆర్‌కు ఈ విధంగా కాంట్రాక్ట్ నచ్చలేదని చెప్తే వాళ్ల ఈగో దెబ్బతింటుంది.. వేరే కంపెనీల హెచ్ఆర్‌లతో చెప్పి మీ ఫ్రెండ్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే ప్రమాదం ఉంది" అని హెచ్చరించాడు. అయితే మరో యూజర్ మాత్రం మనీష్‌కు మద్దతుగా నిలిచాడు. "మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని దూరం చేసే అంత డబ్బు ఉండి ఏం లాభం? ఇలాంటి టాక్సిక్ కల్చర్‌కు దూరంగా ఉండటమే మంచిది" అని సపోర్ట్ చేశాడు. ఇంకొకరు.. "కచ్చితంగా అతని దగ్గర అంతకంటే మంచి ఆప్షన్స్ ఉండి ఉంటాయి" అని కామెంట్ చేశారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story