Amaravati: హాస్టల్‌లో గజ్జెల శబ్దాలు, ఏడుపులు.. 'దెయ్యం' భయంతో 608 మంది విద్యార్థుల ఖాళీ!
Amaravati: మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల హాస్టల్‌లో దెయ్యం ఉందంటూ ప్రచారం జరగడంతో 608 మంది విద్యార్థులు ఖాళీ చేసి వెళ్లారు. ఇది మాస్ హిస్టీరియా అని అధికారులు స్పష్టం చేశారు.
Amaravati: హాస్టల్‌లో గజ్జెల శబ్దాలు, ఏడుపులు.. 'దెయ్యం' భయంతో 608 మంది విద్యార్థుల ఖాళీ!
Amaravati: హాస్టల్‌లో అర్థరాత్రి వేళ గజ్జెల శబ్దాలు.. ఎవరో వింతగా నవ్వుతున్నట్టు, ఏడుస్తున్నట్టు భయానక శబ్దాలు! దీంతో హాస్టల్‌లో ‘దెయ్యం’ ఉందంటూ ప్రచారం జరగడంతో వందలాది మంది విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆశ్రమ (వసతి) పాఠశాలలో చోటుచేసుకున్న ఈ విచిత్ర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏకంగా 608 మంది విద్యార్థులు హాస్టళ్లను విడిచిపెట్టి వెళ్లడంతో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
హాస్టల్‌లోని కొందరు బాలికలు రాత్రి వేళల్లో అసాధారణ శబ్దాలు వినిపిస్తున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజయ్ చౌదరికి మొదట ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా గజ్జెలు మోగుతున్న శబ్దం, నవ్వులు, ఏడుపులు వినిపిస్తున్నాయని వారు చెప్పారు. ఈ వార్త క్రమంగా మిగతా విద్యార్థులకు వ్యాపించడంతో అందరిలోనూ తీవ్ర భయం మొదలైంది. ‘హాస్టల్‌లో దెయ్యాలు తిరుగుతున్నాయి’ అనే పుకారు క్షణాల్లో వ్యాపించడంతో.. 263 మంది బాలురు, 345 మంది బాలికలు, మొత్తంగా 608 మంది విద్యార్థులు ఒకేసారి హాస్టల్‌ను విడిచి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు.
విద్యార్థుల ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన పాఠశాల యాజమాన్యం, వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి మానసిక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు చేయించింది. విద్యార్థుల్లో కనిపిస్తున్న ఈ వింత లక్షణాలు ‘మాస్ హిస్టీరియా’ (Mass Hysteria) అనే తీవ్రమైన మానసిక పరిస్థితికి సంబంధించినవై ఉండవచ్చని వైద్యులు తేల్చిచెప్పారు. ప్రస్తుతం భయాందోళనలో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తూ భయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
స్థానిక ఆరోగ్య అధికారి అభిషేక్ నాయుడు విద్యార్థులు, తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. "ఇది కేవలం మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య మాత్రమే. దీనికి దెయ్యాలు లేదా అతీంద్రియ శక్తులతో ఎలాంటి సంబంధం లేదు. ఎవరూ మూఢనమ్మకాలు, వదంతులను నమ్మకూడదు" అని స్పష్టం చేశారు.
మరోవైపు విద్యార్థుల్లోని మూఢనమ్మకాలు, భయాన్ని తొలగించడానికి 'మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి' కూడా రంగంలోకి దిగింది. విద్యార్థులు తిరిగి ధైర్యంగా పాఠశాలకు, హాస్టల్‌కు వచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు.




