Invigilator Dictating Answers : మాస్ కాపీయింగ్‌కు కొత్త లెవల్.. మైక్‌లో ఆన్సర్లు అనౌన్స్ మెంట్..
Invigilator Dictating Answers : దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, పరీక్షల అక్రమాలపై తీవ్ర రచ్చ నడుస్తున్న వేళ.. రాజస్థాన్‌లో మరో సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది..
Mass-copying
Invigilator Dictating Answers : దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, పరీక్షల అక్రమాలపై తీవ్ర రచ్చ నడుస్తున్న వేళ.. రాజస్థాన్‌లో మరో సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో విశ్వవిద్యాలయ ఫ్లైయింగ్ స్క్వాడ్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీ (JNVU) పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో.. పరీక్ష హాలులో ఉన్న ఇన్విజిలేటరే అభ్యర్థులకు జవాబులు ల్యాప్‌టాప్, పుస్తకం చూసి మైకులో చెప్పినట్లు మైండ్ బ్లాకింగ్ రీతిలో డిక్టేట్ చేస్తూ దొరికిపోయాడు..
కాజోయ్ గ్రామంలో కాపీయింగ్ కలకలం
జైసల్మేర్ సమీపంలోని కాజోయ్ గ్రామంలో ఉన్న శ్రీ కర్ణి కాలేజీ పరీక్షా కేంద్రంలో శనివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్య 'బీఏ (BA) సెకండ్ ఇయర్' హిందీ లిటరేచర్ పరీక్ష జరిగింది. ఈ క్రమంలో జేఎన్‌వీయూ విశ్వవిద్యాలయానికి చెందిన ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు ప్రొఫెసర్ అమన్ సింగ్, సురేష్ చౌదరి, లలిత్ జాలా, గౌరవ్ జైన్‌లతో కూడిన బృందం అకస్మాత్తుగా ఆ కాలేజీ సెంటర్‌ను తనిఖీ చేసింది.
హాలులోకి వెళ్లగానే షాకింగ్ సీన్
స్క్వాడ్ అధికారులు పరీక్షా హాలులోకి అడుగుపెట్టగానే అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాంక్ అయింది. హాలులో విధుల్లో ఉండాల్సిన జై కరన్, ఓం ప్రకాష్ అనే ఇద్దరు ఇన్విజిలేటర్లు విద్యార్థులకు స్వయంగా జవాబులు డిక్టేట్ చేస్తున్నారు. వారు చెబుతుంటే విద్యార్థులందరూ పోటీపడి రాస్తున్నారు. అధికారులను చూడగానే నిందితులు బిత్తరపోయారు. ప్రాథమికంగా పరిశీలించగా హాలులోని విద్యార్థుల ఆన్సర్ షీట్లలో సమాధానాలన్నీ ఒకేలా, అక్షరం పొల్లు పోకుండా ఉండటం గమనించారు.
93 ఆన్సర్ షీట్లు సీల్.. సీసీటీవీలో ఘోరం రీక్రియేట్
ఈ మాస్ కాపీయింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఆ హాలులోని మొత్తం 93 మంది విద్యార్థుల సమాధాన పత్రాలను వెంటనే స్వాధీనం చేసుకుని సీల్ చేశారు. అనంతరం కాలేజీలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఇన్విజిలేటర్లు హాలులో తిరుగుతూ అందరికీ ఆన్సర్లు డిక్టేట్ చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం మాస్ చీటింగ్ కింద కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. కాగా, జవాబు పత్రాలు జప్తు చేసి.. విద్యార్థులకు కొత్త బుక్‌లెట్స్ ఇచ్చి పరీక్ష రాయించినట్లు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శ్యామ్ సుందర్ మీనా తెలిపారు.
డిబార్ పడే ఛాన్స్.. విసి సీరియస్
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పవన్ కుమార్ శర్మ ఈ ఉదంతంపై స్పందిస్తూ.. పరీక్షల అక్రమాలపై తమ విశ్వవిద్యాలయం 'జీరో టాలరెన్స్' విధానాన్ని పాటిస్తుందని, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం కాపీయింగ్‌కు పాల్పడినట్లు తేలితే సదరు విద్యార్థులను ఒకటి నుంచి మూడేళ్ల పాటు పరీక్షల నుంచి డిబార్ చేసే అవకాశముంది. హైలెవల్ కమిటీ సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవైపు దేశంలో పోటీ పరీక్షల విశ్వసనీయతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే, విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఇన్విజిలేటర్లే ఇలా దారి తప్పడం తీవ్ర కలకలం రేపుతోంది.




