Viral Video : మరణం అంచుల్లో మత్స్యకారులు.. కోస్ట్ గార్డ్ హీరోయిజం.!
Viral Video : అరబ్బీ సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు, అంధకారం, ఈదురు గాలుల మధ్య ఆరుగురు మత్స్యకారుల..
Viral-Video
Viral Video : అరబ్బీ సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు, అంధకారం, ఈదురు గాలుల మధ్య ఆరుగురు మత్స్యకారుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. వారు ప్రయాణిస్తున్న బోట్ పగిలిపోయి నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. మరికొద్ది నిమిషాల్లో జలసమాధి అవ్వడం ఖాయం అనుకున్న తరుణంలో.. ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సిబ్బంది దేవుడిలా వచ్చారు. కర్ణాటకలోని మంగళూరు తీరంలో జరిగిన ఈ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ప్రాణ భయంతో నడిసముద్రంలో హాహాకారాలు
కర్ణాటకలోని ఉడుపికి చెందిన ‘మంజు మాతా’ అనే ఫైబర్ గ్లాస్ ఫిషింగ్ బోట్ ఆరుగురు మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లింది. అయితే మంగళూరు పరిధిలోని సూరత్కల్ తీరానికి సుమారు 33 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలల ధాటికి బోట్ కింది భాగం తీవ్రంగా దెబ్బతిని, రంధ్రం పడింది. దాంతో సముద్రపు నీరు వేగంగా బోట్ లోపలికి రావడం ప్రారంభమైంది. ప్రాణభయంతో వణికిపోయిన మత్స్యకారులు వెంటనే కోస్ట్ గార్డ్‌కు అత్యవసర సహాయం (Distress Call) కోసం సందేశం పంపారు.
దేవుడిలా దూసుకొచ్చిన 'ఐసీజీఎస్ సాచేత్'
సందేశం అందిన వెంటనే కోస్ట్ గార్డ్ అలర్ట్ అయ్యింది. అప్పట్లోనే ఆ సముద్ర ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న 'ఐసీజీఎస్ సాచేత్' (ICGS Sachet) యుద్ధనౌక గమ్యాన్ని మార్చుకుని మునిగిపోతున్న బోట్ వైపు దూసుకెళ్లింది. కేవలం 90 నిమిషాల వ్యవధిలోనే ప్రమాదంలో ఉన్న బోట్ వద్దకు కోస్ట్ గార్డ్ నౌక చేరుకుంది. అయితే అప్పటికే చీకటి పడుతుండటం, విపరీతమైన గాలులు, సముద్రపు అలల తీవ్రత వల్ల రెస్క్యూ ఆపరేషన్ చేయడం అత్యంత ప్రమాదకరంగా మారింది.
రిమోట్ టెక్నాలజీతో ప్రాణాల రక్షణ
చీకటి, పేలవమైన విజిబిలిటీ ఉన్నప్పటికీ కోస్ట్ గార్డ్ సిబ్బంది వెనకడుగు వేయలేదు. ఇలాంటి ప్రమాదకర వాతావరణంలో వాడేందుకు వీలుగా ఉండే సరికొత్త రిమోట్-ఆపరేటెడ్ లైఫ్‌బాయ్స్ టెక్నాలజీని సిబ్బంది రంగంలోకి దించారు. మునిగిపోతున్న బోట్ లోంచి ఆరుగురు మత్స్యకారులను ఒక్కొక్కరిగా సురక్షితంగా రక్షించి తమ నౌకలోకి చేర్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా అందరూ సురక్షితంగా బయటపడటంతో మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు.
రక్షించబడిన ఆరుగురు మత్స్యకారులను న్యూ మంగళూరు హార్బర్‌కు తరలించి, ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాణాలను పణంగా పెట్టి సముద్రపు అలలతో పోరాడి మత్స్యకారులను కాపాడిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది రియల్ సాహసానికి నెటిజన్లు సలాం కొడుతున్నారు.
The Indian Coast Guard successfully rescued six fishermen from the distressed Indian Fishing Boat (IFB) Manju Matha in a challenging Maritime Search and Rescue (SAR) operation off the coast of Mangaluru on the evening of June 29, 2026.
— Manjeet Negi (@manjeetnegilive) June 30, 2026
Great work @IndiaCoastGuard 👏🇮🇳 pic.twitter.com/1mSrYkftvg




