Viral Video : ఐఐటీ బొంబాయిలో చిరుత హల్‌చల్.. CCTVలో షాకింగ్ వీడియో.!
Viral Video : ముంబైలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ 'ఐఐటీ బొంబాయి' (IIT-Bombay) క్యాంపస్‌లో ఒక చిరుతపులి హల్‌చల్ చేసింది. క్యాంపస్ ఆవరణలో తిరుగుతున్న ఒక...
Leopard
Viral Video : ముంబైలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ 'ఐఐటీ బొంబాయి' (IIT-Bombay) క్యాంపస్‌లో ఒక చిరుతపులి హల్‌చల్ చేసింది. క్యాంపస్ ఆవరణలో తిరుగుతున్న ఒక వీధి కుక్కపై చిరుతపులి దాడి చేసి, నోట కరుచుకుని లాక్కెళ్లిన భయంకర దృశ్యాలు అక్కడ ఉన్న సిసిటివి (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో క్యాంపస్ విద్యార్థులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన అధికారులు క్యాంపస్ పరిసరాల్లో నిఘాను తీవ్రం చేశారు.
చీకట్లో నుంచి వచ్చి.. క్షణాల్లో వేటాడింది..
పొవాయ్ (Powai) ప్రాంతంలో విశాలంగా విస్తరించి ఉన్న ఐఐటీ క్యాంపస్‌లోకి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ చిరుతపులి ప్రవేశించింది. తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో స్టాఫ్ హాస్టల్ బిల్డింగ్ సమీపంలో ఇది సంచరించింది. సిసిటివి ఫుటేజ్ ప్రకారం.. గాఢాంధకారం నుంచి ఒక్కసారిగా దూసుకువచ్చిన చిరుతపులి, అక్కడ నిలుచుని ఉన్న ఒక వీధి కుక్కపై మెరుపు వేగంతో పంజా విసిరింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ కుక్కను తన దవడలతో గట్టిగా పట్టుకుని, పక్కనే ఉన్న పొదల వైపు లాక్కెళ్లిపోయింది. ఈ అంతా కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగిపోయింది.
సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సరిహద్దు.. పెరిగిన నిఘా
ఐఐటీ బొంబాయి క్యాంపస్ ప్రసిద్ధ 'సంజయ్ గాంధీ నేషనల్ పార్క్' అడవికి ఆనుకుని ఉండటం వల్ల ఇక్కడ గతంలోనూ అప్పుడప్పుడు చిరుతపులులు కనిపించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ ఘోర ఉదంతం తర్వాత క్యాంపస్ యాజమాన్యం , అటవీ శాఖ అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఫ్యాకల్టీ క్వార్టర్స్, స్టాఫ్ హాస్టల్స్ , విద్యార్థుల వసతి గృహాల ప్రాంతాలలో నిఘా పెంచారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో విద్యార్థులకు గానీ, సిబ్బందికి గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, చిరుత కేవలం ఆ కుక్కను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అడవిలోకి వెళ్ళిపోయిందని అధికారులు తెలిపారు.
విద్యార్థులకు, నివాసితులకు అధికారుల కీలక హెచ్చరికలు
క్యాంపస్‌లో చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో అధికారులు నివాసితులకు , విద్యార్థులకు పలు సూచనలు జారీ చేశారు. అర్ధరాత్రి వేళల్లో , తెల్లవారుజామున ఎవరూ ఒంటరిగా బయటకు రాకూడదు. హాస్టల్స్, క్వార్టర్స్ పరిసరాల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. క్యాంపస్ లోపల ఎక్కడైనా మళ్లీ వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి లేదా అధికారులకు సమాచారం అందించాలి.
ఆహారం కోసమే జనారణ్యంలోకి..
ముంబై లాంటి రద్దీ నగరంలో అడవులకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఇలా చిరుతలు రావడం కొత్తేమీ కాదని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. చిరుతపులులు సాధారణంగా సులభంగా దొరికే ఆహారం కోసమే ఇలా అడవి సరిహద్దులు దాటి మనుషులు నివసించే ప్రాంతాల్లోకి వస్తుంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులు అటు విద్యార్థుల రక్షణను చూస్తూనే, మరోవైపు రక్షిత జీవి అయిన చిరుతపులికి ఎలాంటి హాని కలగకుండా దాన్ని తిరిగి అడవిలోకి పంపించేలా పర్యవేక్షిస్తున్నారు. నగరాల విస్తరణ అడవుల సరిహద్దుల వరకు వెళ్లడం వల్ల మానవులకు, వన్యప్రాణులకు మధ్య ఇలాంటి సంఘర్షణలు ఎదురవుతున్నాయని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
A Leopard Entered IIT Bombay Campus at Staff Hostel and Viciously Attacked a Dog Caught on CCTV Camera😳 pic.twitter.com/bsfcUvBTXS
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 19, 2026




