శిలల్లో ఆడ, మగ ఎలా గుర్తిస్తారో తెలుసా.? ఆశ్చర్యకరమైన విషయాలు..

Idols: మనుషుల్లాగే శిలల్లో కూడా ఆడ, మగ, నపుంసక అనే మూడు రకాలు ఉంటాయని మీకు తెలుసా?

Ravi
By Ravi
Published on: 20 Jun 2026 4:19 PM IST
Idols
X

శిలల్లో ఆడ, మగ ఎలా గుర్తిస్తారో తెలుసా.? ఆశ్చర్యకరమైన విషయాలు..

Idols: హిందూ సంప్రదాయంలో దేవాలయాలకు, అందులో కొలువైన దేవుళ్ల విగ్రహాలకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంటుంది. గుడిలో ప్రతిష్టించే విగ్రహాన్ని చెక్కడం అనేది కేవలం ఒక కళ మాత్రమే కాదు, అదొక గొప్ప శాస్త్రీయ ప్రక్రియ. అయితే, ఆ విగ్రహాలను తయారు చేయడానికి వాడే రాళ్లలో (శిలల్లో) కూడా మనుషుల్లాగే జెండర్ ఉంటుందనే ఆసక్తికరమైన విషయం చాలా మందికి తెలియదు.

శిల్పకళా నిపుణులు, ఆగమ శాస్త్రాల ప్రకారం శిలల్లో ప్రధానంగా ఆడ, మగ, నపుంసక అనే మూడు రకాలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా దేవాలయాల్లో మూలవిరాట్ లేదా దేవుళ్ల విగ్రహాల తయారీకి ఎక్కువగా 'కృష్ణశిల' (నల్లగా ఉండే రాయి)ను ఉపయోగిస్తుంటారు. ఈ శిలలను ఎంచుకునేటప్పుడు శిల్పులు అవి ఏ రకానికి చెందినవో అత్యంత నిశితంగా పరిశీలించి గుర్తిస్తారని తెలుస్తుంది.

ఒక రాయిని చూసి అది ఆడ శిలా, మగ శిలా లేదా నపుంసక శిలా అని ఎలా గుర్తిస్తారనే దానికి శిల్ప శాస్త్రంలో ఒక స్పష్టమైన, అద్భుతమైన పద్ధతి ఉంది. రాళ్లను ఏదైనా లోహంతో (సుత్తి లేదా ఉలి లాంటి వస్తువుతో) కొట్టినప్పుడు వాటి నుంచి వచ్చే శబ్దం, ఆ రాళ్ల ఆకారాన్ని బట్టి శిల్పులు వాటిని కచ్చితంగా వర్గీకరిస్తారు.

నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఒక పురుష శిలను (మగ రాయి) లోహంతో కొట్టినప్పుడు అందులోంచి కంచు గంటను మోగించినట్లుగా చాలా గట్టిగా, ఎక్కువ శబ్దం వస్తుంది. అదే ఒక స్త్రీ శిలను (ఆడ రాయి) లోహంతో కొట్టినప్పుడు ఇత్తడి గంటను మోగించినట్లుగా పురుష శిల కంటే కొంచెం తక్కువ శబ్దం, ఎంతో మృదువైన నాదం వెలువడుతుంది. ఇక మూడో రకమైన నపుంసక శిలను కొట్టినప్పుడు అందులోంచి ఎలాంటి లోహపు శబ్దం రాకుండా, కేవలం ఒక డప్పును కొట్టినట్లుగా డల్ సౌండ్ (బోలు శబ్దం) వస్తుందని శిల్పులు వివరిస్తున్నారు.

ఈ శబ్ద పరీక్షల ఆధారంగా రాళ్లను వేరు చేసిన తర్వాత, వాటిని విగ్రహాల తయారీలో నిర్దిష్టమైన పనులకు ఉపయోగిస్తారు. దేవుళ్లు, దేవతల విగ్రహాలను చెక్కడానికి శిల్పులు కేవలం మగ, ఆడ శిలలను మాత్రమే పవిత్రంగా వాడుతారు. రాతిలో ఉండే ధ్వని తరంగాలు, సాంద్రత, శక్తిని బట్టే ఈ వర్గీకరణ జరిగిందని ఆధునిక నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు.

అందుకే గుడిలోని మూలవిరాట్‌కు అభిషేకం చేసినప్పుడు లేదా మంత్ర పఠనం చేసినప్పుడు ఆ శబ్ద తరంగాలు విగ్రహం ద్వారా గ్రహించి గుడి మొత్తం ఒక సానుకూల శక్తి ప్రసరిస్తుందని చెబుతారు. నపుంసక శిలల్లో ఇలాంటి తరంగాలను గ్రహించే శక్తి తక్కువగా ఉండటం వల్ల వాటిని మూలవిరాట్ తయారీకి కాకుండా, విగ్రహాల కింది భాగంలో ఉండే పీఠాలు లేదా ఆలయ నిర్మాణంలో ఇతర అవసరాలకు ఉపయోగిస్తుంటారు. మన ప్రాచీన శిల్పకళా నైపుణ్యం వెనుక ఎంతటి గొప్ప శాస్త్రీయ పరిజ్ఞానం దాగి ఉందో చెప్పడానికి ఈ శిలల వర్గీకరణ ఒక అద్భుతమైన ఉదాహరణ.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story