ఈ కోడిని తింటే మూడేళ్ల జైలు శిక్షా?! వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం!

Grey Jungle Fowl: మన దేశంలో మాత్రమే కనిపించే అరుదైన అడవి కోడి (గ్రే జంగిల్ ఫౌల్)ని వేటాడితే మూడేళ్ల జైలు శిక్ష తప్పదని వన్యప్రాణి రక్షణ చట్టం హెచ్చరిస్తోంది.

Arun Chilukuri
Published on: 28 May 2026 10:35 AM IST
Grey Jungle Fowl
X

ఈ కోడిని తింటే మూడేళ్ల జైలు శిక్షా?! వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం!

Grey Jungle Fowl: మార్కెట్లో ప్రతిరోజూ వందల క్వింటాళ్ల కోడి మాంసం విక్రయాలు జరగడం సర్వసాధారణం. కానీ, ఓ రకం కోడిని తాకినా, వేటాడినా కటకటాల పాలుకావాల్సిందేనని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఇది మనం సాధారణంగా గ్రామాల్లో పెంచుకునే కోడి కాదు.. అడవుల్లో మాత్రమే జీవించే అరుదైన 'అడవి కోడి'.

ఆంగ్లంలో 'గ్రే జంగిల్‌ ఫౌల్‌' (Grey Jungle Fowl) అని పిలిచే ఈ అడవి కోళ్లు కేవలం మన దేశంలో మాత్రమే కనిపిస్తాయి. వీటి విశిష్టత, అంతరించిపోతున్న రకాల దృష్ట్యా భారత ప్రభుత్వం వీటిని 'వన్యప్రాణి రక్షణ చట్టం' పరిధిలోకి చేర్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఈ అడవి కోళ్లను వేటాడినా, వీటికి హాని తలపెట్టినా భారీ జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

ఇవి ఎక్కువగా నేల పైనే తిరుగుతూ జీవిస్తాయి. నేలపైనా లేదా చెట్లపైనా గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. అడవిలో దొరికే గింజలు, చెదలు, చిన్న చిన్న కీటకాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఇవి చాలా సున్నితమైనవి. చిన్న అలికిడి వినపడినా క్షణాల్లో అక్కడి నుంచి పారిపోతాయి. ఒకవేళ ప్రాణాపాయం ఉందని గ్రహిస్తే మాత్రం వెంటనే చెట్లపైకి ఎగిరిపోతాయి.

తాజాగా మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతంలో ఈ అరుదైన గ్రే జంగిల్‌ ఫౌల్‌ కెమెరా కంటికి చిక్కింది. అడవుల రక్షణ, వన్యప్రాణుల మనుగడపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story