Viral Video : గంగమ్మ ఒడిలో చికెన్ బిర్యానీ, బీరు బాటిళ్లతో దావత్.. చివరికి జైలు పాలు.!

Viral Video : పుణ్యక్షేత్రమైన వారణాసిలో గంగానది అంటే భక్తులకు పరమ పవిత్రం. నదిలో మునక వేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. కానీ కొందరు మేధావులకు మాత్రం..

G Krishna
Published on: 24 Jun 2026 12:26 PM IST
Viral-Video
X

Viral-Video

Viral Video : పుణ్యక్షేత్రమైన వారణాసిలో గంగానది అంటే భక్తులకు పరమ పవిత్రం. నదిలో మునక వేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. కానీ కొందరు మేధావులకు మాత్రం గంగమ్మ ఒడి ఒక ఊహించని పిక్నిక్ స్పాట్‌లా కనిపించింది. నడిగంగలో పడవ వేసుకుని, అక్కడే పొయ్యి రాజేసి చికెన్ వండుకుంటూ, చల్లటి బీరు కొడుతూ సోషల్ మీడియాలో రీల్స్ వదిలారు. ఇంకేముంది, ఆ వీడియో కాస్తా వైరల్ అవ్వడం, జనం తిట్టిపోయడం, పోలీసులు రంగంలోకి దిగి సదరు ఐదుగురు కిలాడీలను లోపల వేయడం చకచకా జరిగిపోయాయి.





గంగలో మునక కాదు.. గంగలోనే వంటక

కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఈ వీడియో స్థానికులతో పాటు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీపక్ కుమార్, అజయ్ సహ్ని, అరుణ్ కుమార్ సహ్ని, అనురాగ్ నిషాద్, రాహుల్ సహ్ని అనే ఇరవై ఐదు నుండి ముప్పై రెండేళ్ల వయసున్న ఐదుగురు యువకులు కలిసి ఈ సాహస కృత్యానికి ఒడిగట్టారు. కాశీ పుణ్యక్షేత్రంలో, అదీ గంగానది మధ్యలో ఇలాంటి పనులు చేసి భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారు. దశాశ్వమేధ ఏసీపీ అతుల్ అంజన్ త్రిపాఠి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వీరందరినీ ఐడెంటిఫై చేసి, నదిలో షికారు కొట్టిన ఆ పడవను సీజ్ చేసి, వీరికి జైలు ఊచలు లెక్కబెట్టే భాగ్యాన్ని కల్పించారు.

ఒకవైపు మాంసం దుకాణాల షిఫ్టింగ్.. మరోవైపు వీరి ప్యాకింగ్

ట్విస్ట్ ఏంటంటే.. పవిత్రమైన శ్రావణ మాసం రాబోతున్న నేపథ్యంలో వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ (VMC) రెండు వారాల క్రితమే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలో ఉన్న సుమారు మూడు వందల యాభై నుండి నాలుగు వందల వరకు ఉన్న చికెన్, మటన్, చేపల దుకాణాలన్నింటినీ సిటీ దాటించి శివార్లలోకి మార్చాలని ఆదేశించింది. ప్రతి ఏటా శ్రావణ మాసంలో సిటీ లోపల షాపులు బంద్ పెట్టాల్సి రావడం వల్ల వ్యాపారులకు జరిగే నష్టాన్ని తగ్గించడానికి రామ్‌నగర్, సుజాబాద్, గణేష్‌పూర్ లాంటి ఐదు చోట్లకు వీటిని తరలిస్తున్నారు. ఈ నిర్ణయంపై నగరంలో అటు సపోర్ట్, ఇటు విమర్శలతో రచ్చ నడుస్తోంది.

సిటీలో చికెన్ షాపులనే బయటకు పంపించేస్తుంటే.. ఈ ఐదుగురు మేధావులు మాత్రం ఏకంగా గంగానది మధ్యలోనే లైవ్ కిచెన్ పెట్టేసి మందు విందు కానిచ్చేశారు. రూల్స్ బ్రేక్ చేయడంలో తమ తర్వాతే ఎవరైనా అని నిరూపించుకోబోయి, చివరికి కటకటాలపాలయ్యారు. ఈ దెబ్బతో శ్రావణ మాసానికి ముందే వీరికి నాన్-వెజ్, లిక్కర్ రెండూ బంద్ అయిపోయాయి..!


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story