Fake Rapido driver: యువతికి చేదు అనుభవం..ర్యాపిడో డ్రైవర్ని అంటూ!

Fake Rapido driver: హైదరాబాద్ చార్మినార్ వద్ద ర్యాపిడో పేరుతో మోసం చేయబోయిన వ్యక్తిని ఓ మహిళ సమయస్ఫూర్తితో పట్టుకుని వీడియో తీసింది.

Naresh.k
Published on: 12 Aug 2026 12:36 PM IST
Fake Rapido driver
X

Fake Rapido driver: యువతికి చేదు అనుభవం..ర్యాపిడో డ్రైవర్ని అంటూ!

Hyderabad woman: రాత్రివేళ ప్రయాణించే మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో చాటిచెప్పే ఘటనా ఇది! హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో ఓ మహిళ ప్రదర్శించిన సమయస్ఫూర్తి, చాకచక్యంతో ప్రమాదం నుండి త తప్పించుకోవడమే కాకుండా, ర్యాపిడో పేరుతో మాయమాటలు చెప్పే వ్యక్తి అసలు రూపాన్ని బయటపెట్టింది.

బాధితురాలు సిద్ధి తెలిపిన వివరాల ప్రకారం... రాత్రి 9 గంటల సమయంలో చార్మినార్ సమీపంలో ఆమె ఆటో కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో మహమ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి వచ్చి, తాను 'ర్యాపిడో' డ్రైవర్‌నంటూ ఆమెను పికప్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, ఆమెకు వెంటనే కొన్ని విషయాలు అనుమానాస్పదంగా అనిపించాయి. అతడు వచ్చిన బైక్‌కు సరిగ్గా కనిపించే నంబర్ ప్లేట్ లేదు. నీ ర్యాపిడో ఐడీ చూపించు అని ఆమె నిలదీయగానే... అతగాడు అప్పటికప్పుడు ఫోన్‌లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం మొదలుపెట్టాడు.

సదరు వ్యక్తి వద్ద ఎలాంటి ఐడీ లేదని, ర్యాపిడో యాప్‌లో బుకింగ్ లేకుండానే రైడ్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడని గ్రహించిన సిద్ధి, వెంటనే తన ఫోన్ తీసి ఆ దృశ్యాలన్నింటినీ వీడియో తీసింది. తాను తీసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ సందర్భంగా సిద్ధి స్పందిస్తూ... నేను నిత్యం ర్యాపిడో సేవలు వాడుతుంటాను. సంస్థపై నాకేమీ ఫిర్యాదు లేదు. కానీ, ఇలాంటి ప్రైవేట్ రైడ్స్ ఇచ్చేందుకు ర్యాపిడో పేరును వాడుకుంటూ ప్రయాణికుల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై సంస్థ కఠినంగా వ్యవహరించాలి అని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మహిళలు రాత్రివేళల్లో రైడ్ ఎక్కేముందు యాప్‌లోని డ్రైవర్ వివరాలు, బైక్ నంబర్‌ను సరిచూసుకోవాలని సూచించారు.

ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ర్యాపిడో పేరుతో మహిళలను బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక ఖాతాలను ట్యాగ్ చేస్తున్నారు. మహిళల భద్రతకు ఈ ఘటన ఒక హెచ్చరిక లాంటిది. యాప్‌లో బుకింగ్ లేకుండా, నంబర్ ప్లేట్ లేని వాహనాలను ఎక్కి ఊహించని ముప్పు తెచ్చుకోవద్దని ఈ ఘటన నిరూపిస్తోంది.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story