Viral Video : లైక్స్ కోసం ఏనుగులతో చెలగాటం.. నెటిజన్ల ఫైర్.!
Viral Video : సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. రీల్స్ పిచ్చితో వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, తమ ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసుకుంటున్నారు.
viral-Video
Viral Video : సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. రీల్స్ పిచ్చితో వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, తమ ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసుకుంటున్నారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా సిమ్లిపాల్ అటవీ ప్రాంతంలో ఐదుగురు యువకులు చేసిన నిర్వాకం ఇప్పుడు ఇంటర్నెట్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం అడవి ఏనుగుల మందను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతూ వారు చేసిన పనులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు 'రీల్స్ గ్యాంగ్' పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏనుగుల ఆవాసాల్లోకి చొరబడి..
ఒక సోషల్ మీడియా యూజర్ ఈ దారుణాన్ని వీడియోలతో సహా బహిర్గతం చేశాడు. సిమ్లిపాల్ పరిసరాల్లో ఈ ఐదుగురు వ్యక్తులు ఏనుగుల పాలిట శాపంగా మారారని, కేవలం సోషల్ మీడియా పాపులారిటీ కోసం ఈ సాధు జంతువులను వారు నిరంతరం వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి బుద్ధిలేనితనం ఏదో ఒక రోజు పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించాడు.
ఆ వీడియోలలో ఈ యువకులు బైక్‌లపై అడవి దారుల్లో తిరుగుతూ ఏనుగుల మంద ఎక్కడుందో వెతుకుతున్నారు. ఏనుగులు కనిపించగానే వాటికి అత్యంత సమీపంలోకి వెళ్తున్నారు. ఒక క్లిప్‌లో, ఆ గ్యాంగ్ ఒక బుజ్జి ఏనుగును టార్గెట్ చేసి, దాన్ని ఆటపట్టిస్తూ వీడియోలు రికార్డ్ చేయడం స్పష్టంగా కనిపించింది.
కర్రలతో పొడుస్తూ శాడిజం..
మరికొన్ని వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒక వీడియోలో ఒక యువకుడు ఏనుగుకు అతి సమీపంలో నిలబడి, చేతిలోని కర్రతో దాన్ని పదే పదే పొడుస్తూ కోపం తెప్పించడానికి ప్రయత్నించాడు. మిగిలిన వారు ఏనుగుల చుట్టూ గుంపుగా చేరి మొబైల్స్ లో షూట్ చేస్తున్నారు. అడవి ఏనుగులకు కోపం వస్తే ఎంత ప్రమాదకరంగా మారుతాయో తెలిసి కూడా, కేవలం వీడియో కంటెంట్ కోసం వాటిని తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తున్నారని పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. ఇది కేవలం వినోదం కాదని, వన్యప్రాణుల చట్టాల ప్రకారం నేరమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రొఫైల్‌లో 'ఎలిఫెంట్ లవర్స్'.. నిజ జీవితంలో మాత్రం..
ఈ ఘోరానికి ఒడిగట్టిన సదరు యువకుల సోషల్ మీడియా అకౌంట్లను వెతికిన నెటిజన్లకు ఒక విచిత్రమైన విషయం తెలిసింది. ఆ ఐదుగురి ఇన్‌స్టాగ్రామ్ బయో ప్రొఫైల్స్ లో తాము 'ఏనుగుల ప్రేమికులం' అని రాసుకున్నారు. కానీ వారు పెట్టిన వీడియోల్లో మాత్రం ఏనుగులను వెంటాడటం, వాటిని భయపెట్టడం, కర్రలతో హింసించడం వంటి పనులే ఉన్నాయి. జంతువులను ప్రేమించడం అంటే వాటిని ఇంటర్నెట్ ఫేమ్ కోసం వాడుకోవడం కాదని నెటిజన్లు ఆ యువకులను ఏకిపారేస్తున్నారు. ఈ వీడియోలను అటవీ శాఖ అధికారులకు, ఉన్నతాధికారులకు పంపిస్తూ నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ రీల్స్ గ్యాంగ్‌ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని, లేదంటే భవిష్యత్తులో మనుషులకు, జంతువులకు మధ్య పెద్ద ఘర్షణలు జరిగి ప్రాణనష్టం జరుగుతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
5/5
— Prasant Rai (@PRaiLAC) June 15, 2026
We urgently demand strict, exemplary action from the Forest Department, Odisha Police, and Wildlife Authorities.
These individuals must be tracked down and penalized before their stupidity costs a life—be it an innocent elephant or a local villager.@CMO_Odisha… pic.twitter.com/88v2EOe2Gl




