iPhone: ఓం ఐఫోన్ గంగార్పణం.. వార్నీ ఎంత పని చేశావురా బుడ్డోడా..!
iPhone: సోషల్ మీడియాలో ఒక ఫన్నీ వీడియో హల్‌చల్ చేస్తోంది.
iPhone: ఓం ఐఫోన్ గంగార్పణం.. వార్నీ ఎంత పని చేశావురా బుడ్డోడా..!
Funny video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని గుండెల్ని పిండేసేలా ఉంటే, మరికొన్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఒక ఫన్నీ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఒక చిన్నారి చేసిన అల్లరి పనికి, ఆ తల్లి ముఖంలో మారిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ తన చిన్న బిడ్డతో కలిసి సరస్సులో హ్యాపీగా బోట్ రైడింగ్‌ను ఆస్వాదిస్తూ కనిపించింది. చుట్టూ అందమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో ఆమె ఎంతో మురిసిపోయింది. ఆ మధుర క్షణాలను రికార్డ్ చేయడానికి తన చేతిలో ఉన్న ఖరీదైన ఐఫోన్‌తో వీడియోలు తీసుకుంటూ మునిగిపోయింది. అంతా బాగానే ఉందనుకునే లోపే అక్కడ ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
ఆమె పక్కనే కూర్చున్న బుజ్జాయి.. ఒక్కసారిగా తల్లి చేతిలో ఉన్న ఐఫోన్‌ను లాక్కున్నాడు. పిల్లలు సాధారణంగా ఫోన్లతో ఆడుకుంటారు కాబట్టి, ఆ తల్లి కూడా మొదట లైట్ తీసుకుంది. కానీ, ఆ చిన్నారి మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా, ఆ ఖరీదైన ఐఫోన్‌ను నేరుగా సరస్సులోకి విసిరేశాడు. ఫోన్ టపాస్ మంటూ నీళ్లలో మునిగిపోయింది.
ఈ వీడియోలో అందరినీ విపరీతంగా నవ్విస్తున్న అంశం ఏమిటంటే.. ఫోన్ నీటిలో పడకముందు, పడిన తర్వాత ఆ తల్లి ముఖంలో వచ్చిన మార్పులే. అంతవరకు ఎంతో ఆనందంగా నవ్వుతూ ఉన్న ఆమె ముఖం.. ఫోన్ నీళ్లలో పడగానే ఒక్కసారిగా షాక్‌కు గురైంది. నిరాశ, నిస్సహాయతతో ఆమె పెట్టిన ముఖం చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇంకోవైపు, తాను ఎంత పెద్ద పని చేశానో కూడా తెలియని ఆ చిన్నారి.. ఏమీ ఎరుగనట్టు ప్రశాంతంగా కూర్చోవడం ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియోను స్లో-మోషన్‌లో కూడా జత చేయడంతో ఆ దృశ్యాలు మరింత స్పష్టంగా, ఫన్నీగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ వీడియోకు లక్షలాది వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. పిల్లాడికి పాపం ఐఫోన్ విలువ తెలియదుగా అని ఒకరంటే.. అది ఆ పిల్లాడు సరస్సుకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అంటూ మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వుల వర్షం కురిపిస్తోంది. పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చేటప్పుడు, ముఖ్యంగా ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.




