Hyderabad Startup : అమ్మ కోసం.. దేశానికి ‘క్యూరాపాడ్’.. హైదరాబాద్ కుర్రాడి ఘనత..!
Hyderabad Startup : "మా అమ్మ తన స్నేహితులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన రోజులు నాకు గుర్తున్నాయి" అని లైట్‌మెడ్ (Litemed) కో-ఫౌండర్, సీటీఓ సూర్య మగులూరి..
Hyderabad-Startup
Hyderabad Startup : "మా అమ్మ తన స్నేహితులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన రోజులు నాకు గుర్తున్నాయి" అని లైట్‌మెడ్ (Litemed) కో-ఫౌండర్, సీటీఓ సూర్య మగులూరి గుర్తుచేసుకున్నారు. "అక్కడ మిగిలిన వారంతా ఎంతో సులభంగా తిరుగుతుంటే, మా అమ్మ మాత్రం తీవ్రమైన నొప్పుల కారణంగా చాలా ఆలస్యంగా వారితో కలిసేది. రోజురోజుకూ ఆ నొప్పులు ఎంతలా ఎక్కువయ్యాయంటే.. ఆమె కనీసం మెట్లు కూడా ఎక్కలేక, పూర్తిగా లిఫ్ట్‌పైనే ఆధారపడవలసి వచ్చింది" అని ఆయన చెప్పారు. తన తల్లిని వేధించిన ఆ మోకాళ్ల నొప్పే ఒక సరికొత్త ఆవిష్కరణకు దారితీసింది. దీర్ఘకాలిక నొప్పుల నుంచి సురక్షితంగా ఉపశమనం కలిగించేలా ఆయన ‘క్యూరాపాడ్’ (Curapod) అనే ధరించగలిగే (Wearable) లైట్-థెరపీ పరికరాన్ని రూపొందించారు.
హైదరాబాద్‌కు చెందిన ఈ మెడ్-టెక్ స్టార్టప్, సూర్య మగులూరి , శ్రీరామ్ వెల్లియూర్ అనే ఇద్దరు మిత్రుల ద్వారా ప్రారంభమైంది. గత 12 నుండి 15 నెలల్లోనే ఈ సంస్థ ఏకంగా 30,000 కంటే ఎక్కువ క్యూరాపాడ్ యూనిట్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా నొప్పుల నివారణ సెషన్లలో ఈ డివైజ్‌ను విజయవంతంగా ఉపయోగించారు.
రూ.5 నాణెం సైజులో.. అత్యాధునిక టెక్నాలజీతో..
క్యూరాపాడ్ పరికరం కేవలం 4.8 సెంటీమీటర్ల వ్యాసంతో, దాదాపు ఒక ఐదు రూపాయల నాణెం సైజులో అత్యంత చిన్నగా ఉంటుంది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) నుండి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ పూర్తి చేసిన 31 ఏళ్ల సూర్య మగులూరి, ఈ డివైజ్ గురించి వివరిస్తూ.. ఇది ఎలాంటి దుష్ప్రభావాలు (Side Effects) లేకుండా దీర్ఘకాలిక నొప్పుల నుండి రోజువారీ ఉపశమనాన్ని ఇస్తుందని తెలిపారు.
ఈ పరికరం ‘ఫోటోబయోమాడ్యులేషన్’ (PBM) అనే ప్రత్యేక సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే రెడ్ ఎల్‌ఈడీ (LED) లైట్ శరీరంలోని నొప్పి ఉన్న భాగాలపైకి ప్రసరించి, అక్కడ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల వాపులు తగ్గి, గాయాలు త్వరగా మానడమే కాకుండా నొప్పి తీవ్రత తగ్గుతుంది. కేవలం 30 నిమిషాల క్యూరాపాడ్ సెషన్ ద్వారా ఆర్థరైటిస్, సయాటికా, ఫ్రోజెన్ షోల్డర్ వంటి నొప్పుల నుండి గరిష్టంగా 60 శాతం వరకు ఉపశమనం లభిస్తుందని కంపెనీ పేర్కొంది. అతిగా వాడకుండా ఉండటానికి వీలుగా, ప్రతి 30 నిమిషాల సెషన్ తర్వాత ఈ డివైజ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది రెండు సెషన్ల పాటు (60 నిమిషాలు) పనిచేస్తుంది. అయితే ఇది కేవలం నొప్పి నివారణ సాధనం మాత్రమేనని, వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని సూర్య స్పష్టం చేశారు.
క్లినికల్ ట్రయల్స్.. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు
2022లో క్యూరాపాడ్ తయారీ పనులు ప్రారంభం కాగా, మార్కెట్లోకి తీసుకురావడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ఈ కాలంలో ఎన్నో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి, ఏడు రకాల భద్రతా సర్టిఫికేషన్లను సాధించిన తర్వాత 2024లో దీనిని అధికారికంగా విడుదల చేశారు. ఇది భారతదేశపు ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ (CDSCO) లో నమోదైన గుర్తింపు పొందిన వైద్య పరికరం. దీనిని మాన్యువల్‌గా, ప్రత్యేక యాప్ సహాయంతో ఆపరేట్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా యూజర్లు తమ నొప్పి తగ్గుతున్న విధానాన్ని, సెషన్ల రికార్డులను ట్రాక్ చేసుకోవచ్చు. చర్మ భద్రతకు సంబంధించి ఐఈసీ 62471 (IEC 62471) వంటి అంతర్జాతీయ ప్రమాణాల సర్టిఫికేషన్లు కూడా దీనికి ఉన్నాయి.
భారతదేశంలో ధర , కొనుగోలుదారులు
భారత్‌లో క్యూరాపాడ్ ధర రూ.8,399 గా ఉంది. ఇది ప్రధానంగా 45 ఏళ్లు పైబడిన వారిని లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. ఈ డివైజ్ కొనుగోలుదారులలో 60 శాతం మంది 60 ఏళ్లు పైబడిన మహిళలే ఉండటం విశేషం. అలాగే ఎక్కువ సమయం కూర్చుని, నిలబడి పనిచేసే 35 ఏళ్ల పైబడిన ఐటీ, కార్పొరేట్ ఉద్యోగుల్లోనూ దీనికి మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ ఫోన్లను వాడేవారు పెద్దవారైనప్పటికీ, కొనేవారు మాత్రం వారి పిల్లలు లేదా మనవళ్లేనని సూర్య తెలిపారు. కస్టమర్లకు ఈ పరికరం వాడకంపై అవగాహన కల్పించడానికి కంపెనీ ప్రతినిధులు వర్చువల్ డెమోను కూడా అందిస్తారు.
హైదరాబాద్‌లోనే పూర్తి తయారీ.. గ్లోబల్ మార్కెట్ వైపు అడుగులు
క్యూరాపాడ్ డివైజ్‌ను పూర్తిగా హైదరాబాద్‌లోని కంపెనీ సొంత ఫ్యాక్టరీలోనే డిజైన్ చేసి తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీలో 60 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని ‘టీ-హబ్’ (T-Hub) ఇన్క్యుబేటర్ అందించిన మద్దతు, మెంటర్‌షిప్ వల్ల తమ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగిందని సూర్య కృతజ్ఞతగా పేర్కొన్నారు.
ప్రస్తుతం క్యూరాపాడ్ ఉత్పత్తులను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అపోలో ఫార్మసీ (Apollo Pharmacy) ద్వారా విక్రయిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ ఫిజియోథెరపీ కేంద్రాలు ఉన్న 'ఫిజియోప్లస్' (PhysioPlus) సంస్థతో , సీనియర్ సిటిజన్ల కమ్యూనిటీ అయిన 'ఖ్యాల్' (Khyaal) తో భాగస్వామ్యం కుదుర్చుకుని బిజినెస్-టు-బిజినెస్ (B2B) విక్రయాలను పెంచుకోవాలని కంపెనీ చూస్తోంది. రాబోయే నెలల్లో అమెరికా, యూరప్ మార్కెట్లలో కూడా క్యూరాపాడ్‌ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది అమెరికాలో ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టాలని ఈ హైదరాబాద్ మెడ్-టెక్ స్టార్టప్ లక్ష్యంగా పెట్టుకుంది.




