Crocodile : మహబూబాబాద్‌లో కలకలం.. బావిలో భారీ మొసలి.. గ్రామస్తులు చేసిన పని వైరల్.!
Crocodile : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో ఒక పెద్ద మొసలి ఒక్కసారిగా ప్రత్యక్షమై అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఊరి పక్కనే ఉన్న..
crocodile
Crocodile : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో ఒక పెద్ద మొసలి ఒక్కసారిగా ప్రత్యక్షమై అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఊరి పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలో ఈ మొసలి కనిపించడంతో చుట్టుపక్కల ఉండే రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వ్యవసాయ పొలాల్లో ఉన్న బావి దగ్గరకు పనుల కోసం వెళ్లిన రైతులకు, లోపల ఏదో పెద్ద జీవి కదలడం కనిపించింది. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే అది భారీ మొసలి కావడంతో ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే అప్రమత్తమైన రైతులు ఈ విషయం గురించి అటవీ శాఖ అధికారులకు కబురు పెట్టారు.
వెనకడుగు వేసిన అటవీ సిబ్బంది
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి అటవీ శాఖ సిబ్బంది చేరుకున్నప్పటికీ, ఆ మొసలిని సురక్షితంగా బయటకు తీసేందుకు వారు కాస్త వెనకడుగు వేశారు. తగిన ఏర్పాట్లు లేకపోవడంతో ఆపరేషన్ ఆలస్యమయ్యేలా కనిపించింది. అయితే, ఎప్పుడు ఏం జరుగుతుందో, మొసలి ఎక్కడ బావి పైకి వచ్చేస్తుందో అనే భయంతో స్థానికులు ఎక్కువ సమయం వేచి ఉండలేకపోయారు. ప్రమాదం పొంచి ఉందనే ఉద్దేశంతో గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చారు.
రంగంలోకి దిగిన స్థానిక యువకులు
అధికారుల సహాయం కోసం ఇంకా ఎదురుచూడటం కుదరదని భావించిన స్థానిక యువకులు, రైతులు కలిసి స్వయంగా రంగంలోకి దిగారు. ఎంతో అనుభవమున్న వారిలాగా పక్కా ప్లాన్‌తో, చాకచక్యంగా ఒక పెద్ద వలను సిద్ధం చేసుకున్నారు. బావి లోపల ఉన్న మొసలిని ఎంతో శ్రమించి ఆ వలలో చిక్కేలా చేశారు. ఆ తర్వాత అందరూ కలిసి గట్టిగా పట్టుకుని మొసలిని సురక్షితంగా బావి పైకి లాగారు.
రైతుల ఆందోళన
చివరకు మొసలి పట్టుబడటంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సాధారణంగా అడవుల్లో, పెద్ద పెద్ద నదుల్లో ఉండాల్సిన ఇలాంటి వన్యప్రాణులు.. జనావాసాలు, వ్యవసాయ పొలాల వైపు రావడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పనులకు వెళ్లే సమయంలో ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి, ఇలాంటి వన్యప్రాణులు ఊళ్లలోకి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




