Viral Video: హాస్టల్ వంట గదిలో మొసలి ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన కుక్స్!

Viral Video: రాజస్థాన్‌లోని కోటా నగరంలో ఒక బాయ్స్ హాస్టల్ మెస్‌లోకి భారీ మొసలి చొరబడటం తీవ్ర కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 20 July 2026 4:06 PM IST
Viral Video
X

Viral Video: హాస్టల్ వంట గదిలో మొసలి ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన కుక్స్!

Viral Video: చదువుల కోటగా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటా నగరంలో ఒక విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది. విద్యార్థులు ఉండే ఒక బాయ్స్ హాస్టల్ మెస్ (వంట గది) లోకి ఏకంగా ఒక భారీ మొసలి చొరబడింది. ఈ ఊహించని పరిణామంతో హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

కోటాలోని కోరల్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఒక బాయ్స్ హాస్టల్‌లో జూలై 17వ తేదీ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మెస్ సిబ్బంది రోజువారీలాగే మధ్యాహ్న భోజన వంటకాలు సిద్ధం చేస్తుండగా, ఒక్కసారిగా ఒక పెద్ద మొసలి లోపలికి ప్రవేశించింది. వంట గదిలో మొసలిని చూసిన సిబ్బంది భయంతో కేకలు వేస్తూ అక్కడి నుండి పరుగులు తీశారు. అయితే, ఆ మొసలి మెస్ లోపలికి వచ్చి ప్రశాంతంగా ఒక చోట పడుండిపోయింది. ఈ విషయం హాస్టల్ అంతటా పాకడంతో విద్యార్థులు, స్థానికులు మొసలిని చూసేందుకు పెద్ద ఎత్తున మెస్ వద్దకు చేరుకున్నారు.

హాస్టల్‌లో ఉండే కొందరు ఉత్సాహవంతులైన విద్యార్థులు స్వయంగా ఆ మొసలిని పట్టుకోవడానికి సాహస ప్రయత్నాలు చేశారు. కానీ, అది ప్రమాదకరంగా మారడంతో వారి వల్ల కాలేదు. వెంటనే స్పందించిన హాస్టల్ యాజమాన్యం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న వెంటనే స్పాట్‌కు చేరుకున్న అటవీ సిబ్బంది.. ప్రత్యేక పరికరాల సహాయంతో ఆ మొసలిని క్షేమంగా బంధించి, అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

హాస్టల్ పక్కనే ఉన్న ఒక మురుగునీటి కాలువ (డ్రైనేజీ) నుండి ఈ మొసలి పైకి వచ్చి ఉంటుందని, అక్కడి నుండి నేరుగా బేస్‌మెంట్‌లో ఉన్న మెస్ రూమ్‌లోకి ప్రవేశించి ఉంటుందని స్థానిక అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా, మొసలి మెస్‌లోకి వచ్చిన దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి. 'ఘర్ కే కలేశ్' అనే సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ కావడంతో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story