Viral: ఇదేం కంపెనీరా బాబూ.. టార్గెట్ రీచ్ కాలేదని ఉద్యోగితో 200 గుంజీలు!

Viral: హోంవర్క్ చేయకపోతే స్కూల్లో పనిష్మెంట్ ఇవ్వడం కామన్. అయితే చైనాలో టార్గెట్ రీచ్ కాని ఉద్యోగితో గుంజీలు తీయించడం వైరల్‌గా మారింది.

Ravi
By Ravi
Published on: 27 Aug 2026 8:14 PM IST
Viral
X

Viral: ఇదేం కంపెనీరా బాబూ.. టార్గెట్ రీచ్ కాలేదని ఉద్యోగితో 200 గుంజీలు!

Viral: సాధారణంగా చిన్నపిల్లలు బడిలో టీచర్ ఇచ్చిన హోంవర్క్ సరిగ్గా చేయకపోతే వారికి శిక్షగా గుంజీలు తీయించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే అచ్చం అలాంటి శిక్షనే ఒక ప్రైవేట్ సంస్థ తమ ఆఫీసులో పనిచేసే ఉద్యోగికి అమలు చేసింది. తాను ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయలేదని ఒక మేనేజర్ ఏకంగా ఆ మహిళా ఉద్యోగితో వందల సంఖ్యలో గుంజీలు తీయించాడు. ఈ విచిత్రమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. టార్గెట్ రీచ్ కాని ఉద్యోగితో గుంజీలు తీయించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక లోన్ అసిస్టెన్స్ కంపెనీలో యాంగ్ అనే ఒక యువతి ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ యువతి ప్రధానంగా టెలీ-సేల్స్ విభాగంలో పనిచేయాల్సి ఉంటుంది. ఆమె పనిచేసే టీమ్ మేనేజర్ ప్రతిరోజూ తమ ఉద్యోగులకు భారీ టార్గెట్లు పెడుతుంటాడు. అందులో భాగంగా ప్రతిరోజూ కనీసం 200 కాల్స్ చేయడంతో పాటు ఆఫీసుకు ఒక క్లైంట్‌ను తీసుకురావాలనే కఠినమైన గోల్స్ ఆ యువతికి విధించాడు. అయితే జులై 28వ తేదీన ఆ యువతి రోజూవారీ లక్ష్యాలను చేరుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. దీంతో ఆగ్రహించిన మేనేజర్ ఆమెకు ఒక విచిత్రమైన కండిషన్ పెట్టాడు.

టార్గెట్ పూర్తి చేయనందుకు వంద గుంజీలు తీయాలి లేదా ఒక్కో పనికి రూ.700 చొప్పున జరిమానా చెల్లించాలని మేనేజర్ స్పష్టం చేశాడు. అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ యువతి వద్ద అంత డబ్బులు లేకపోవడంతో జరిమానా కట్టలేనని చెప్పింది. దీనితో మేనేజర్ ఆమెతో ఏకంగా 200 గుంజీలు తీయించాడు. ఆఫీస్ భవనంలో ఆమె ఆ శిక్షను అనుభవిస్తూ వీడియో కూడా రికార్డ్ చేసి అతనికి పంపింది. ఇలా కఠినమైన శిక్షను అనుభవించిన తర్వాత ఆమె కాళ్లలో భరించలేని నొప్పి మొదలైంది. ఆ నొప్పి వల్లే ఆమె సరిగ్గా నిలబడలేక, కనీసం నడవలేని స్థితికి చేరుకుంది.

డబ్బులు లేకపోవడంతో ఆమె వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా ఐదు రోజుల పాటు అలాగే భరించింది. చివరకు మూత్రం రంగు తీవ్రంగా మారడంతో భయపడి ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. అక్కడ వైద్యులు ఆమెకు రాబ్డోమయోలిసిస్ అనే ప్రమాదకరమైన కండరాల వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ఒకేసారి శృతిమించి గుంజీలు తీయడం వల్లే కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని డాక్టర్లు వివరించారు. ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఆమె ఇక ఆ జాబ్ చేయలేక ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. తన వైద్య ఖర్చులకు నష్టపరిహారం కింద రూ.2,12,000కు పైగా చెల్లించాలని ఆమె కంపెనీని డిమాండ్ చేయగా, మేనేజర్ అందుకు ససేమిరా అన్నాడు.

దీంతో ఆ యువతి స్థానిక కార్మిక శాఖ అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసి న్యాయపోరాటానికి దిగింది. ఈ సమస్యపై సమగ్ర విచారణ జరుపుతామని అధికారులు ఆమెకు హామీ ఇచ్చారు. ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో బయటకు రావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉద్యోగులను కేవలం యంత్రాల్లా భావించి ఇలా శారీరకంగా హింసించడం ఏమాత్రం సరికాదని కామెంట్లు పెడుతున్నారు. అప్పగించిన పని చేయకపోతే వేతనంలో కోత విధించడం లేదా మరేదైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి కానీ, ఇలాంటి కఠినమైన శారీరక శిక్షలు వేయడం ఏ చట్టంలోనూ లేదని పలువురు గుర్తుచేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఇలా వందల కొద్దీ గుంజీలు తీయించడం ఆధునిక బానిసత్వాన్ని తలపిస్తుందని విమర్శిస్తున్నారు. ఒక అమాయకపు మహిళా ఉద్యోగికి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం పట్ల నెటిజన్ల నుంచి సానుభూతి వ్యక్తమవుతోంది. కార్పొరేట్ సంస్థలు కేవలం తమ లాభాల కోసం ఇలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటం దారుణం అని, సదరు మేనేజర్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కఠినమైన పని ప్రదేశాలు ఉద్యోగుల ప్రాణాలకే ముప్పు తెస్తాయని ఆరోగ్య నిపుణులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story