Cherian Philip Controversy : గెలుపు కిక్కులో హద్దు దాటిన సీనియర్ నేత.. మహిళా ఎమ్మెల్యేతో అసభ్య ప్రవర్తన..!

Cherian Philip Controversy : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తం 140 స్థానాలకు గాను

G Krishna
Published on: 7 May 2026 7:03 PM IST
Cherian Philip Controversy
X

Cherian Philip Controversy

Cherian Philip Controversy : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తం 140 స్థానాలకు గాను ఏకంగా 102 స్థానాలను కైవసం చేసుకుని అధికార పీఠాన్ని దక్కించుకుంది. అయితే, ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తిరువనంతపురంలోని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ వేదికగా జరిగిన ఒక ఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలు ఏం జరిగింది..!

కొల్లాం నియోజకవర్గం నుండి ఘనవిజయం సాధించిన మహిళా ఎమ్మెల్యే బిందు కృష్ణ, పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ఆమెను పలు ప్రశ్నలు అడగగా, ఆమె వారితో మాట్లాడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ అక్కడికి వచ్చారు. సంప్రదాయం ప్రకారం, ఒక తోటి నాయకుడికి గౌరవం ఇస్తూ బిందు కృష్ణ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేయి చాపారు.

కానీ, ఊహించని విధంగా చెరియన్ ఫిలిప్ ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన ఎమ్మెల్యే వెంటనే అప్రమత్తమై, అయనను వెనక్కి తోసివేస్తూ పక్కకు తప్పుకున్నారు. ఆమెకు అది ఇష్టం లేదని ఆ కదలికల్లో స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ, చెరియన్ ఫిలిప్ మరోసారి ఆమెను కౌగిలించుకోవడానికి యత్నించడం గమనార్హం. దీంతో తీవ్ర అసహనానికి గురైన బిందు కృష్ణ, ఇక అక్కడ ఉండలేక రెండు చేతులెత్తి నమస్కరిస్తూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.

నెటిజన్ల ఆగ్రహం.. రాజకీయాల్లో చర్చ

ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తోంది. గెలిచిన ఆనందంలో ఉన్నామనో, సీనియర్ అన్న గౌరవంతోనో మహిళా ప్రతినిధులను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "మహిళా ఎమ్మెల్యే పట్లే ఇలా ప్రవర్తిస్తే, సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి?" అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా చెరియన్ ఫిలిప్ మహిళా నేతలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి, ఇప్పుడు ఈ తాజా ఘటన ఆయనను మరింత ఇరకాటంలో పడేసింది.

కేరళలో కొత్త ప్రభుత్వం.. సీఎం ఎవరు..?

మరోవైపు, ఈ వివాదం పక్కన పెడితే కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. 102 స్థానాల భారీ మెజారిటీతో యూడీఎఫ్ దూసుకురాగా, పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ (LDF) కేవలం 35 స్థానాలకే పరిమితమై పరాజయం పాలైంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 3 స్థానాలు లభించాయి. త్వరలోనే సీఎల్పీ నేతను ఎన్నుకుని, కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని కొలువుదీర్చనుంది. ఈ కీలక సమయంలో జరిగిన ఈ సంఘటన పార్టీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story