Bride Slaps: మండపంలోనే పెళ్లికొడుకు చెంప చెళ్లుమనిపించిన వధువు.. ఏం చేశాడంటే...?

Bride Slaps: ఛత్తీస్‌గఢ్‌లో తాగి పెళ్లి మండపానికి వచ్చిన వరుడి చెంప చెళ్లుమనిపించి పెళ్లి రద్దు చేసుకుంది వధువు ముస్కాన్ ప్రధాన్.

Naresh.k
Published on: 27 Jun 2026 10:39 AM IST
Bride Slaps: మండపంలోనే పెళ్లికొడుకు చెంప చెళ్లుమనిపించిన వధువు.. ఏం చేశాడంటే...?
X

Marriage Cancel: మద్యం మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. అయితే, ఆ మహమ్మారి వల్ల తన జీవితం నాశనం కాకుండా ఓ యువతి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాగి తందనాలాడే వాడితో ఏడడుగులు వేసే ప్రసక్తే లేదంటూ.. పెళ్లి మండపంలోనే వరుడి చెంప చెళ్లుమనిపించి, పెళ్లిని రద్దు చేసుకుంది ఓ ధీర వనిత. ఈ హృదయ విదారక, స్ఫూర్తిదాయక ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గీర్-చంపా జిల్లాలో వెలుగుచూసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో, స్థానికంగా ఈ పెళ్లి గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

కోస్మాండా గ్రామానికి చెందిన ముస్కాన్ ప్రధాన్ (22) అనే యువతికి.. ఖోఖ్రా గ్రామానికి చెందిన సంత్ రామ్ (24)తో జూన్ 23న వివాహం నిశ్చయమైంది. అయితే, కథ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. నిశ్చితార్థం సమయానికే పెళ్లికొడుకు సంత్ రామ్ ఫుల్‌గా తాగి వచ్చాడు. అప్పుడే ముస్కాన్ అతడిని నిలదీసింది. ఇకపై జీవితంలో మద్యం ముట్టనని అందరి ముందు హామీ ఇవ్వడంతో, అతడి మాట నమ్మి పెళ్లికి ఒప్పుకుంది.

కానీ, బుద్ధి మారేవాడు తాగుబోతు ఎందుకవుతాడు? పెళ్లి రోజున ముహూర్త సమయానికి బంధుమిత్రులతో కలిసి పెళ్లి బృందం వధువు ఇంటికి చేరుకుంది. వివాహ కార్యక్రమాలు ప్రారంభమయ్యే సమయానికి.. పెళ్లికొడుకు సంత్ రామ్ మళ్లీ ఫూటుగా మద్యం సేవించి, కనీసం సరిగ్గా నిలబడలేని మత్తులో ఊగుతూ పెళ్లి మండపానికి చేరుకున్నాడు.

మండపంలో వరుడి నిర్వాకాన్ని చూసిన వధువు ముస్కాన్‌కు ఒళ్లు మండిపోయింది. జీవితంలో మారతానని చెప్పి.. జీవితాంతం కలిసి నడవాల్సిన పెళ్లి పీటల మీదే ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తాడా? అని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే.. అందరూ చూస్తుండగానే పెళ్లి పీటల పైనుంచి లేచి, వరుడి చెంప చెళ్లుమనిపించింది!

ఇలాంటి తాగుబోతును, బాధ్యత లేని వాడిని నేను పెళ్లి చేసుకోను.. నా జీవితాన్ని నాశనం చేసుకోలేను అంటూ తెగేసి చెప్పింది. వధువు తీసుకున్న ఈ ఊహించని నిర్ణయంతో పెళ్లి వేదిక వద్ద ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాల యువకులు కొట్టుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొడవలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

తాము చేసిన తప్పు తెలుసుకున్న వరుడి కుటుంబం.. పెళ్లి ఏర్పాట్ల కోసం వధువు కుటుంబం చేసిన ఖర్చుల నిమిత్తం సుమారు రూ.3 లక్షల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. పదో తరగతి వరకు చదివిన ముస్కాన్.. సమాజం ఏమనుకుంటుందో అని భయపడకుండా, మద్యం వ్యసనానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడింది. ఆమె చూపిన ఈ సాహసానికి జంజ్‌గీర్-చంపా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ముగ్ధులయ్యారు. సామాజిక కార్యకర్తలు, మహిళా ప్రతినిధుల సమక్షంలో ముస్కాన్‌ను పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.

ప్రస్తుతం ముస్కాన్ తన ఆగిపోయిన చదువును మళ్లీ కొనసాగించాలని నిర్ణయించుకుంది. మద్యం వ్యసనాన్ని, బాధ్యతారాహిత్యాన్ని పెళ్లిళ్ల పేరుతో అస్సలు సహించకూడదు అనే బలమైన సందేశాన్ని ఈ ఘటన సమాజానికి ఇచ్చింది. ముస్కాన్ తీసుకున్న నిర్ణయం తప్పులు చేసే ఎంతో మంది పురుషులకు గుణపాఠం, అలాగే ఎన్నో కుటుంబాల్లోని ఆడపిల్లలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story