Wedding cancelled: బారాత్‌లో డ్యాన్స్ వేయనన్న వరుడు.. పెళ్లి ఆపేసిన వధువు
Wedding cancelled: బారాత్‌లో డిజే డాన్స్ విషయంలో వధువుపై అరిచిన వరుడు. కూతురి ఆత్మగౌరవం కోసం పెళ్లిని రద్దు చేసిన వధువు తండ్రి.
Wedding cancelled: బారాత్‌లో డ్యాన్స్ వేయనన్న వరుడు.. పెళ్లి ఆపేసిన వధువు
Marriage Cancel: బాజాల భజంత్రీలు మోగుతున్నాయి.. బంధుమిత్రుల కోలాహలంతో ఆ ఇల్లు పెళ్లికళతో ఉట్టిపడుతోంది. మరికొద్ది గంటల్లో ఆ ఇద్దరూ నూతన దంపతులుగా ఒక్కటి కాబోతున్నారు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో.. ఊరేగింపులో జరిగిన ఒక చిన్న వివాదం, ఆ పెళ్లి పీటలను కదిలించేసింది. వరుడి తొందరపాటు, అహంకారం.. నిశ్చయమైన వివాహాన్ని రాత్రికి రాత్రే రద్దు చేసేలా చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో జరిగిన ఈ వింత ఉదంతం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
మార్కాపురం రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన యువకుడికి, కంభం మండలం తురిమెళ్లకు చెందిన యువతితో వివాహం నిశ్చయించారు పెద్దలు. ఆదివారం ఉదయం ముహూర్తం కావడంతో, శనివారం రాత్రే వధువు కుటుంబ సభ్యులు పెళ్లి గ్రామానికి చేరుకున్నారు. రాత్రి వేళ సాంప్రదాయబద్ధంగా వధూవరులను వాహనం ఎక్కించి, ధూమ్ ధామ్‌గా బారాత్ మొదలుపెట్టారు.
స్థానిక యువకులు, బంధువులు డీజే పాటలకు జోరుగా స్టెప్పులు వేస్తున్నారు. ఈ క్రమంలో, ఉత్సాహం తట్టుకోలేక కొత్త జంట కూడా ఒక్కసారి డాన్స్ చేయాలి అని కొందరు కోరారు. అందుకు వధువు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడానికి సిద్ధపడింది.కానీ, వరుడు మాత్రం తాను డ్యాన్స్ చేయనని తెగేసి చెప్పాడు. అక్కడితో ఆగితే బాగుండేది.. కానీ వరుడు అందరి ముందూ, నువ్వు కూడా డ్యాన్స్ చేయడానికి వీల్లేదు అంటూ వధువుపై గట్టిగా అరుస్తూ, కోపంతో మందలించాడు.
పెళ్లి కాకముందే, నలుగురి ముందూ కాబోయే అల్లుడు తన కూతురిపై అంతలా అరుస్తూ అధికారం చలాయించడం వధువు తండ్రికి అస్సలు నచ్చలేదు. పెళ్లికి ముందే ఇంత అహంకారంతో, ఇగోతో ఉంటే.. పెళ్లయ్యాక తన కూతురిని ఇంకెంత మానసిక క్షోభకు గురిచేస్తాడు? ఇలాంటి వాడికి కూతురిని ఇచ్చి ఎలా పంపగలం? అని ఆయన ఆలోచనలో పడ్డారు. ఆ క్షణంలోనే వధువు తండ్రి ఎంతో ధైర్యంతో కూడిన, తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. నా కూతురి ఆత్మగౌరవం కంటే ఏదీ ముఖ్యం కాదు. మాకు ఈ పెళ్లీ వద్దంటూ వెంటనే ఊరేగింపు వాహనం పైనుంచి తన కుమార్తెను కిందికి దించేశారు. బంధువులందరినీ తీసుకొని రాత్రికి రాత్రే సొంతూరికి తిరుగుపయనమయ్యారు.
క్షణాల వ్యవధిలో పెళ్లి వేడుక కాస్తా రద్దవడంతో ఇరువైపులా తీవ్ర గందరగోళం నెలకొంది. చివరకు పెద్దమనుషుల సమక్షంలో ఇరువర్గాలు కూర్చొని కట్నకానుకల లావాదేవీలను అక్కడికక్కడే సెటిల్ చేసుకున్నారు. అయితే, పెళ్లి కోసం అప్పటికే భారీగా ఏర్పాట్లు చేసి, లక్షల రూపాయలు ఖర్చు చేసిన వరుడి తరఫు వారు.. వరుడి తొందరపాటు ప్రవర్తన, అనవసరపు కోపం వల్లే పెళ్లి ఆగిపోయిందని, చేతిలో డబ్బులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని లబోదిబోమంటున్నారు.
ఈ ఘటన సమాజానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోంది. పూర్వకాలంలో పెళ్లి ఆగిపోతే అమ్మాయి కుటుంబానికి అవమానంగా భావించేవారు, కానీ మారుతున్న కాలంలో కూతురి ఆత్మగౌరవం, భవిష్యత్తే ముఖ్యం అని భావించి ఆ తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు, స్థానికులు అభినందిస్తున్నారు. కోపతాపాలు, అహంకారం బంధాలను ఎలా ముక్కలు చేస్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.




