Boss Scam : కార్పొరేట్ బాస్‌లకు బిగ్ వార్నింగ్.. కార్పొరేట్ ఆఫీసుల్లో కొత్త ముప్పు.!
Boss Scam : దేశంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో విరుచుకుపడుతున్నారు. కార్పొరేట్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, చార్టర్డ్ అకౌంటెంట్లు (CA), ..
boss-scam
Boss Scam : దేశంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో విరుచుకుపడుతున్నారు. కార్పొరేట్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, చార్టర్డ్ అకౌంటెంట్లు (CA), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు (CFO) , సీనియర్ మేనేజ్‌మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని 'బాస్ స్కామ్' (CEO Impersonation Fraud) పేరిట భారీ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కంపెనీలోని ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ సందేశాలు పంపి, సీనియర్ అధికారుల లాగే నటిస్తూ లక్షలాది రూపాయలను తమ ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలు వెలుగుచూడటంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), సెబీ (SEBI) తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి.
అసలు ఎలా మొదలవుతుంది? 'జిప్' ఫైళ్ల రూపంలో వస్తున్న ప్రమాదం
ఈ స్కామ్ చాలా సాధారణంగా కనిపిస్తూనే అత్యంత ప్రమాదకరంగా మొదలవుతుంది. కంపెనీకి చెందిన ఫైనాన్స్ లేదా అకౌంట్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు ఒక సాధికారిక పత్రం లాంటి మెసేజ్ వస్తుంది. అందులో "Statement of Account.zip", "RBI.zip" లేదా "MCA.zip" వంటి పేర్లతో కంప్రెస్డ్ (ZIP) ఫైళ్లు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), లేదా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) వంటి ప్రభుత్వ లేదా నియంత్రణ సంస్థల పేర్లు ఉండటంతో ఉద్యోగులు అవసరమైన ఫైల్ అని భావించి వాటిని డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేస్తారు.
ఉద్యోగి ఆ ZIP ఫైల్‌ను సిస్టమ్‌లో ఓపెన్ చేయగానే, అందులో దాగి ఉన్న మాల్వేర్ (హానికరం కలిగించే కోడ్) క్షణాల్లో యాక్టివేట్ అవుతుంది. సెక్యూరిటీ చెక్‌లను దాటుకుని లోపలికి ప్రవేశించేందుకు వీరు డీఎల్ఎల్ సైడ్‌లోడింగ్ (DLL Sideloading) అనే సంక్లిష్ట సాంకేతికతను ఉపయోగిస్తారు. దీనివల్ల సాధారణ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు కూడా ఈ మాల్వేర్‌ను గుర్తించలేవు.
వాట్సాప్ వెబ్ హ్యాకింగ్.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి
ఈ స్కామ్‌లో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసి ఉన్న వాట్సాప్ వెబ్ (WhatsApp Web) సెషన్‌ను ఈ మాల్వేర్ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఒకసారి హ్యాకర్లకు వాట్సాప్ యాక్సెస్ దక్కితే, వారు ఆ ఉద్యోగి ఖాతా నుంచే కంపెనీలోని ఇతర సహచరులకు, కాంటాక్ట్ గ్రూప్‌లకు అదే మాల్వేర్ ఫైల్‌ను పంపుతారు. తనకు తెలిసిన సహోద్యోగి లేదా పై అధికారి నుంచే మెసేజ్ రావడంతో, మిగతా ఉద్యోగులు కూడా ఎలాంటి అనుమానం లేకుండా ఆ ఫైల్‌ను తెరుస్తారు. దీంతో ఒకే కంపెనీలోని పలు కంప్యూటర్లు, నెట్‌వర్క్‌లు ఒకదాని తర్వాత ఒకటి హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తాయి.
ఉన్నతాధికారిగా నటిస్తూ ఒత్తిడి.. నిధుల మళ్లింపు
హ్యాకర్లు వాట్సాప్ లేదా మైక్రోసాఫ్ట్ టీమ్స్ (MS Teams), ఈమెయిల్స్ ద్వారా సదరు కంపెనీ సీఈఓ (CEO) లేదా బాస్ పేరుతో ఫైనాన్స్ విభాగానికి అత్యవసర సందేశాలు పంపుతారు. అత్యవసరంగా ఒక ప్రాజెక్ట్ లేదా బిజినెస్ డీల్ కోసం వెంటనే ఫలానా బ్యాంక్ ఖాతాకు డబ్బులు బదిలీ చేయాలని, ఆలస్యమైతే పెద్ద నష్టం జరుగుతుందంటూ కృత్రిమ అత్యవసర పరిస్థితిని (Sense of Urgency) సృష్టిస్తారు. తమ కంపెనీ అధిపతే నేరుగా ఆర్డర్ ఇచ్చారని నమ్మే ఉద్యోగులు, దాన్ని స్వయంగా ధృవీకరించుకోకుండానే లక్షలాది రూపాయలను సైబర్ నేరగాళ్లు సూచించిన నకిలీ బ్యాంక్ ఖాతాలకు మళ్లిస్తున్నారు. సీఈఓ పేరుతో నేరం జరుగుతుండటంతో దీనికి 'బాస్ స్కామ్' అనే పేరు వచ్చింది.
అంతర్జాతీయ ముఠాల హస్తం.. జాగ్రత్తలు తప్పనిసరి
నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) జరిపిన సాంకేతిక విశ్లేషణ ప్రకారం, ఈ మోసాల వెనుక అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న తీవ్రమైన ముఠాల హస్తం ఉందని తేలింది. సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఈ రకమైన ఫిర్యాదులు వేగంగా పెరుగుతుండటంతో సీబీఐ, సెబీ , సైబర్ పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. పరిశ్రమలు , కంపెనీలు తమ అంతర్గత భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కేవలం మెసేజింగ్ యాప్‌లు, సామాజిక మాధ్యమాలు లేదా ఈమెయిళ్లలో వచ్చే ఆదేశాల ఆధారంగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేదా నిధుల బదిలీలు చేయకూడదని, నేరుగా ఫోన్ కాల్స్ ద్వారా లేదా ప్రత్యక్షంగా నిర్ధారించుకున్న తర్వాతే ఆర్థిక లావాదేవీలు జరపాలని సెబీ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.




