Viral: గంట పాటు వీపు గోకితే రూ. 4 వేలు.. ఏకంగా నెలకు రూ. 14 లక్షలు సంపాదించేశాడుగా.!

Viral: చైనాలో ప్రారంభమైన వింత వ్యాపారం సెన్సేషన్‌గా మారింది. వీపు గోకుతూ నెలకు రూ. 14 లక్షలు సంపాదిస్తున్నారు.

Ravi
By Ravi
Updated on: 6 Sept 2026 4:53 PM IST
Viral
X

Viral: గంట పాటు వీపు గోకితే రూ. 4 వేలు.. ఏకంగా నెలకు రూ. 14 లక్షలు సంపాదించేశాడుగా.!

Viral: ప్రపంచంలో వింత వింత వ్యాపారాలు పుట్టుకొస్తుంటాయి. తాజాగా చైనాకు చెందిన 32 ఏళ్ల జాంగ్ జియావోకియావో అనే వ్యక్తి ఒక వినూత్నమైన వ్యాపారంతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు. ప్రజల వీపు గోకడం ద్వారా అతడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. చైనాలోని షెన్‌జెన్ నగరంలో 'సుమా' అనే బ్రాండ్ పేరుతో అతడు ఈ ఇచ్-స్క్రాచింగ్ బిజినెస్ ప్రారంభించాడు.

సాధారణంగా ఒత్తిడితో బాధపడేవారు రిలాక్సేషన్ కోసం మసాజ్ సెంటర్లకు వెళ్లడం చూస్తుంటాం. కానీ జాంగ్ ప్రారంభించిన సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకున్న సిబ్బంది కస్టమర్ల శరీర భాగాలపై దురదగా ఉన్నచోట పదునైన గోళ్లతో మెల్లగా గోకుతారు. మసాజ్ తరహాలో కాకుండా కండరాలపై ఒత్తిడి తీసుకురాకుండా కేవలం చర్మంపై తేలికపాటి స్పర్శతో ఈ సేవలు అందిస్తారు. ఒక గంట పాటు సాగే ఈ సెషన్‌ కోసం కస్టమర్ల నుంచి 300 యువాన్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 4 వేలు వసూలు చేస్తారు. ఇలా గోకడం వల్ల కస్టమర్లు ఎంతో రిలాక్స్‌గా ఫీల్ అవుతారని, మంచి నిద్ర పడుతుందని జాంగ్ వివరిస్తున్నాడు. సున్నితమైన ప్రదేశాల్లో గోకినప్పుడు కొందరు కస్టమర్లు నవ్వులు కూడా చిందిస్తుంటారు.

సోషల్ మీడియాలో ఒక మహిళ తన భర్త వీపు గోకుతున్న వీడియో చూసిన జాంగ్‌కు ఈ విచిత్రమైన ఐడియా వచ్చింది. ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ చదివి, ఇలాంటి సేవలు అందిస్తే కచ్చితంగా డబ్బులు సంపాదించవచ్చని భావించాడు. చిన్నతనంలో తన తండ్రి వీపు గోకినప్పుడు కలిగిన రిలాక్సేషన్, నిద్ర కూడా అతడికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. దీంతో చైనాలో ఎక్కడా లేని విధంగా ఈ సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టాడు. మానవ శరీరంపై పరిశోధనలు చేసి ఎక్కడెక్కడ గోకితే రిలాక్సేషన్ వస్తుందో స్వయంగా అధ్యయనం చేశాడు.

షెన్‌జెన్ నగరంలోని బావోన్ డిస్ట్రిక్ట్‌లో మే నెలలో ఒక ఔట్‌లెట్, ఆ తర్వాత నెల రోజులకు ఫుటియన్ డిస్ట్రిక్ట్‌లో మరో ఔట్‌లెట్ ప్రారంభించాడు. ఈ రెండు సెంటర్ల ద్వారా అతడు నెలకు లక్ష యువాన్లు అంటే సుమారు రూ. 14 లక్షలు ఆదాయం పొందుతున్నాడు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసి లాభాల బాటలో నడుస్తున్నట్లు జాంగ్ తెలిపాడు. ఈ సెంటర్‌కు వచ్చే కస్టమర్లలో 70 శాతం మంది పురుషులే ఉంటున్నారు. ఈ సేవలు మసాజ్ కంటే ఎంతో బాగున్నాయని కస్టమర్లు సానుకూల ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. మొదటి తరం నగరాల్లో ప్రజలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, అందుకే ఈ సేవలకు భారీ డిమాండ్ ఏర్పడిందని జాంగ్ చెబుతున్నాడు.

జాంగ్ జియావోకియావో గతంలో చదువు పూర్తయిన తర్వాత ఏడాదిలో 7 వేర్వేరు ఉద్యోగాలు చేశాడు. ఆ తర్వాత రెండు ఈ-కామర్స్ కంపెనీలు, సోషల్ మీడియా రంగాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అవేమీ వర్కౌట్ కాకపోవడంతో ఈ వింత వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు ఈ సక్సెస్‌తో దేశవ్యాప్తంగా 100 ఔట్‌లెట్స్ ఏర్పాటు చేయాలని జాంగ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఉద్యోగులకు సరైన శిక్షణ ఇచ్చి, ఒక నిరంతర వృత్తిగా దీనిని మార్చాలని అతడు భావిస్తున్నాడు. అయితే నెటిజన్లు మాత్రం కేవలం దురద తీర్చడానికి ఇంత భారీ మొత్తం చెల్లించాలా అని సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇది కూడా ఒక ఉద్యోగమేనా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story