Vegetable Vendor Viral : నెత్తిన ఐఫోన్.. కూరగాయల వ్యాపారి ఏఐ జాబ్.. వైరల్ వీడియో.!
Vegetable Vendor Viral : బెంగళూరు నగరంలో ఒక సాధారణ కూరగాయల వ్యాపారి తన నుదుటికి ఐఫోన్‌ను కట్టుకుని తిరుగుతున్న..
Viral Video
Vegetable Vendor Viral : బెంగళూరు నగరంలో ఒక సాధారణ కూరగాయల వ్యాపారి తన నుదుటికి ఐఫోన్‌ను కట్టుకుని తిరుగుతున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. అతను కేవలం కూరగాయలు అమ్మడం లేదు, దానితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లకు శిక్షణ ఇస్తున్నాడనే వార్త నెటిజన్లను ఒకే సమయంలో ఆశ్చర్యానికి, గందరగోళానికి గురిచేస్తోంది. వైభవ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ విచిత్రమైన దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. తాను స్కూటీపై వెళ్తుండగా ఈ వింత సెటప్‌ను చూసి ఒక్కసారిగా బ్రేక్ వేయాల్సి వచ్చిందని అతను పేర్కొన్నాడు.
ఏఐ కోసం రియల్ వరల్డ్ డేటా కలెక్షన్
ఆ వీడియోలో సదరు కూరగాయల వ్యాపారి తన తలకు ఒక రకమైన బెల్ట్ లాంటి పరికరాన్ని అమర్చుకుని, దానికి ఒక ఐఫోన్ , మెమొరీ డివైజ్‌ను తగిలించుకుని తన రోజువారీ వ్యాపారం చేసుకుంటూ కనిపిస్తున్నాడు. అసలు అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనే కుతూహలంతో వైభవ్ అతన్ని పలకరించగా.. ఊహించని సమాధానం వచ్చింది. రోబోటిక్స్ , హ్యూమనాయిడ్ (మనిషి రూపంలో ఉండే రోబోలు) ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి అవసరమైన 'రియల్ వరల్డ్ డేటా'ను తాను సేకరిస్తున్నట్లు ఆ వ్యాపారి చెప్పాడు. అంటే మనుషులు ఎలా నడుస్తారు, వస్తువులను ఎలా పట్టుకుంటారు, రోజువారీ పనులు ఎలా చేస్తారు అనే లైవ్ మూవ్‌మెంట్స్‌ను ఈ ఫోన్ రికార్డ్ చేస్తూ ఉంటుంది.
కార్పొరేట్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదన
ఈ వీడియోలో అందరినీ అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. ఈ డేటా కలెక్షన్ పనికి ఆ వ్యాపారికి అందుతున్న జీతం. సదరు పోస్ట్ సమాచారం ప్రకారం, ఈ వింత ఉద్యోగం చేస్తున్నందుకు అతనికి గంటకు 350 రూపాయలు చెల్లిస్తున్నారు. ఒకవేళ రోజుకు 10 గంటల చొప్పున లెక్కిస్తే.. రోజుకు 3,500 రూపాయలు, అంటే నెలకు ఏకంగా 1,05,000 రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడన్నమాట. తలపై ఒక స్మార్ట్‌ఫోన్ పెట్టుకుని తిరుగుతూ, కార్పొరేట్ ఇండియాలోని సగం మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే ఈ కూరగాయల వ్యాపారి ఎక్కువే సంపాదిస్తున్నాడనే నిజాన్ని నమ్మలేకపోతున్నానంటూ వైభవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఏమిటీ 'ఇగోసెంట్రిక్ డేటా కలెక్షన్'?
ఈ వీడియో వైరల్ కావడంతో దీని వెనుక ఉన్న అసలు సాంకేతికతను ఒక నెటిజన్ వివరంగా పంచుకున్నాడు. దీనిని సాంకేతిక పరిభాషలో “ఇగోసెంట్రిక్ డేటా కలెక్షన్” (Egocentric Data Collection) అని పిలుస్తారు. ఐఫోన్లలో ఉండే లిడార్ (LiDAR) వంటి అధునాతన సెన్సార్ల సహాయంతో మనుషులు చేసే వంట, బట్టలు మడతపెట్టడం, గిన్నెలు కడగడం , వస్తువులను మార్చడం వంటి పనుల లోతు (Depth), కదలికలను ఈ ఫోన్లు రికార్డ్ చేస్తాయి. ఈ డేటాను ముఖ్యంగా అమెరికాకు చెందిన రోబోటిక్స్ కంపెనీలు కొనుగోలు చేసి, మనుషుల ప్రవర్తనను రోబోలు ఖచ్చితంగా కాపీ కొట్టేలా ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగిస్తాయి.భవిష్యత్తులో ఏఐ వల్ల మనుషుల ఉద్యోగాలు ఊడిపోతాయనే చర్చ జరుగుతున్న తరుణంలో, అదే ఏఐకి మనుషులు ఎలా పనిచేస్తారో నేర్పించడానికి సామాన్య కార్మికులు ఇలా ఉపయోగపడుతుండటం విశేషం.




